జగనన్నా.. మేమంతా మీ వెంటే.. | Ys jagan praja sankalpa yatra in east godavari district | Sakshi
Sakshi News home page

జగనన్నా.. మేమంతా మీ వెంటే..

Published Sun, Aug 5 2018 3:00 AM | Last Updated on Sun, Aug 5 2018 4:20 AM

Ys jagan praja sankalpa yatra in east godavari district - Sakshi

చేబ్రోలు శివారు, దుర్గాడ క్రాస్‌లలో అశేష జనవాహిని మధ్య పాదయాత్ర సాగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘వైఎస్‌ రాజశేఖరరెడ్డికి కాపులంటే ప్రాణం. తండ్రి లాగే జగన్‌ కూడా మా పట్ల ప్రేమాభిమానాలు చూపిస్తారన్న నమ్మకం ఉంది. కాపుల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలన్న చంద్రబాబు ఆటలు సాగనివ్వం. తూర్పుగోదావరి జిల్లాలోని మొత్తం 19 నియోజకవర్గాలను గెలిచి జగన్‌కు కానుకగా ఇస్తాం’ అంటూ రామచంద్రాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాలకు చెందిన కాపు సామాజిక వర్గాల నేతలు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు నీరాజనాలు పట్టారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం 228వ రోజు జగన్‌.. పిఠాపురం నియోజకవర్గం చెందుర్తి క్రాస్‌ నుంచి పాదయాత్ర ప్రారంభించారు.

కాపు కార్పొరేషన్‌కు రూ.10 వేల కోట్లు ఇస్తామని ప్రకటించినందుకు ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన కాపు నేతలు, మహిళా ప్రజా ప్రతినిధులు జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పూల కిరీటాలు పెట్టి శాలువాలు కప్పి సన్మానించారు. మిఠాయిలు తినిపించారు. వైఎస్‌ జగన్‌ జిందాబాద్‌.. జగన్‌కు కృతజ్ఞతలు.. అంటూ దారిపొడవునా బ్యానర్లు, కటౌట్లతో స్వాగతం పలికారు. బాణసంచా కాలుస్తూ ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కాపు నేతలు మాట్లాడుతూ.. కాపులు కోరకపోయినా గత ఎన్నికల్లో గెలిచేందుకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు పిల్లిమొగ్గల్ని తాము గమనిస్తూనే ఉన్నామని, అసెంబ్లీలో తూతూ మంత్రపు తీర్మానం చేసి కేంద్రానికి పంపిన తీరే ఇందుకు నిదర్శనమన్నారు. కేంద్రంతో సత్సంబంధాలు తెగిపోనున్నాయని తెలిసే చంద్రబాబు నామమాత్రపు తీర్మానం చేసి తమను మోసపుచ్చారని ధ్వజమెత్తారు. తామంతా జగన్‌ వెంటే ఉంటామని స్పష్టం చేశారు.  

చేనేతలు చితికిపోతున్నారు..
పాదయాత్ర చేబ్రోలు చేరుకున్నప్పుడు చేనేత వర్గాల ప్రజలు, సహకార సంఘాల ప్రతినిధులు జగన్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన నూలుపై రాయితీ పథకాన్ని ఈ పాలకులు నిర్వీర్యం చేశారని, పావలా వడ్డీ అసలు కనిపించకుండానే పోయిందని వివరించారు. ఎన్నికలకు ముందు ప్రకటించిన చేనేత బజార్లు ఏర్పాటు చేయలేదని వాపోయారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే చేనేత కార్మికులు, సంఘాలకు రుణమాఫీ చేయాలని. జీఎస్టీ నుంచి చేనేత పరిశ్రమకు మినహాయింపు ఇవ్వాలని, బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, చేనేత సంఘాలు తయారు చేసిన వస్త్రాలను పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు.

నూలుపై 5 శాతం, వస్త్రంపై అద్దే రంగులకు 18 శాతం జీఎస్టీ విధించడాన్ని తొలగించేలా తక్షణమే చర్యలు చేపట్టాలని నివేదించారు. వర్షాకాలం వస్తే నేతన్నలు మగ్గాలపై పని చేసే అవకాశం ఉండదని, ఆ సమయంలో (వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇస్తున్నట్టు) సాయం అందించాలని కోరారు. వీరి సమస్యలు ఓపికగా విన్న జగన్‌ స్పందిస్తూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్‌ ఇస్తామని హామీ ఇచ్చానని, వడ్డీ లేని రుణాలతో పాటు వర్క్‌ ఆర్డర్లు ఇప్పిస్తామని.. అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
 
ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు మూసేస్తున్నారన్నా..
విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న సాకుతో బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల హాస్టళ్లను మూసి వేస్తున్నారంటూ పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జగన్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. 50 మంది కంటే తక్కువగా ఉండే హాస్టళ్లను మూసి వేయడం వల్ల తాము దూరాబారం పోలేక చదువుకు దూరం కావాల్సి వస్తోందని వాపోయారు.

ఓపక్క విద్య ప్రాథమిక హక్కు అంటూనే మరోపక్క బలహీన వర్గాలకు చదువుకునే సౌకర్యం లేకుండా చేస్తున్నారని, ఈ పరిస్థితిని నివారించేలా చర్యలు చేపట్టాలని జగన్‌ను కోరారు. బాబు వస్తే జాబొస్తుందని ఊదరగొట్టిన పెద్దమనిషి ఇప్పుడు అదిగో డీఎస్సీ, ఇదిగో ఏపీపీఎస్సీ అంటూ కబుర్లు చెబుతున్నారే తప్ప ఇంతవరకు ఒక్క ప్రభుత్వ ఉద్యోగాన్నీ భర్తీ చేయలేదని పలువురు గ్రాడ్యుయేట్లు జగన్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు రాక తల్లిదండ్రులపై ఆధారపడాల్సి రావడంతో మానసికంగా క్షోభ పడుతున్నామని చెప్పారు.   

దారిపొడవునా సమస్యల నివేదన  
పింఛన్లు, రేషన్‌కార్డులు ఇవ్వడం లేదని వృద్ధులు, జీవో 010 పద్ధతిన వేతనాలు ఇవ్వాలని పంచాయతీ వర్కర్లు, బలవన్మరణానికి పాల్పడ్డ రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో రాలేదని కౌలు రైతు కుటుంబ సభ్యులు, ఆరోగ్య శ్రీ అందక సతమతం అవుతున్నామని నిరుపేదలు.. పాదయాత్ర సాగిన దారిపొడవునా జననేత దృష్టికి తీసుకొచ్చారు. చేబ్రోలు గ్రామ శివార్లలోని ఈబీసీ కాలనీలో స్కూలుకు ఇచ్చిన 60 సెంట్ల స్థలాన్ని కాజేసేందుకు పిఠాపురం ఎమ్మెల్యే, ఎంపీటీసీ సభ్యుడు, టీడీపీ నాయకులు పోటీ పడుతున్నారంటూ పలువురు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.

ఇప్పటికే 20 సెంట్లు కాజేసినట్టు వార్తలు వస్తున్నాయని, ఏదో విధంగా స్కూలు స్థలాన్ని కాపాడేలా చూడండని వారు జగన్‌ను కోరారు. రోజురోజుకూ స్థానిక ఎమ్మెల్యే ఆగడాలు మితిమీరిపోతున్నాయని వాపోయారు. అందరి సమస్యలు ఓపికగా విన్న జగన్‌.. మనందరి ప్రభుత్వం రాగానే ఆదుకుంటామని భరోసా ఇస్తూ ముందుకు సాగారు. ఇదిలా ఉండగా, శనివారం జగన్‌ స్వల్ప అస్వస్థతతోనే పాదయాత్ర కొనసాగించారు. డస్ట్‌ అలర్జీ వల్ల జలుబు, దగ్గుతో ఆయన బాధ పడుతున్నారని, స్వల్పంగా జ్వరం కూడా వచ్చిందని పార్టీ పోగ్రాం కోఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌ తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement