Eastgodavri District
-
జలజలా.. గోదాహరి
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఏటా లక్షలాది ఎకరాల్లో రెండు పంటలకు నీరందిస్తూ.. అన్నదాతలకు తోడుగా నిలుస్తోంది గోదారమ్మ. ధవళేశ్వరం బ్యారేజీ దిగువన తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాల్లో ఖరీఫ్, రబీ పంటలకు గోదావరి జలాలు పుష్కలంగా అందుతున్నాయి. ఈ మూడు డెల్టాల్లో ఒక్క రబీలోనే 8,96,533 ఎకరాల్లో గోదావరి జలాలు గలగలా పారుతూ పసిడి పంటలు పండిస్తున్నాయి. రబీలో మూడు డెల్టాలకు ఈ నదీమతల్లి 101.739 టీఎంసీల నీరు అందిస్తోంది. తద్వారా లక్షల టన్నుల వరి సిరులు కురిపిస్తూ కోట్ల మంది ఆకలిని తీరుస్తోంది. అంతేకాదు.. అటు లక్షలాది మంది దాహార్తినీ తీరుస్తోంది. ముఖ్యంగా వేసవిలో అవిభక్త ఉభయ గోదావరి జిల్లాల్లో తాగునీటికి గోదావరే శరణ్యం. ఎండల తీవ్రత పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని స్థానిక సంస్థల యంత్రాంగాలు గోదావరి జలాలను ఒడిసి పట్టే పనిలో బిజీగా ఉన్నాయి. ఇతర సీజన్లలో కూడా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో తాగునీటికి గోదావరి జలాలే ప్రధాన ఆధారం. వేసవి అవసరాలకు సరఫరా రబీ సీజన్ ముగియడంతో ఈ నెల 15 నుంచి పంట కాలువలకు నీటి సరఫరాను నిలిపివేశారు. ఈ నెల 16 నుంచి నెలాఖరు వరకూ తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలకు తాగునీటి నిల్వల కోసం సరఫరా చేస్తున్నారు. వేసవి అంతటికీ సరిపోయేలా తాగునీటి చెరువులు, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను గోదావరి జలాలతో నింపుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలతో పాటు సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, మండపేట, రామచంద్రపురం, అమలాపురం వంటి పట్టణాల్లో వేసవి తాగునీటి సమస్య పరిష్కారానికి ఈ నీరే ఆధారం. కాకినాడ సిటీ, పెద్దాపురం నియోజకవర్గాల ప్రజల తాగునీటి అవసరాల కోసం సామర్లకోట సాంబమూర్తి రిజర్వాయర్‌లో గోదావరి జలాలను నిల్వ చేస్తున్నారు. కాకినాడ నగరంలో అధిక జనాభాను దృష్టిలో ఉంచుకొని అదనంగా అరట్లకట్ట రిజర్వాయర్ కూడా ఏర్పాటు చేశారు. సామర్లకోటకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నాగార్జున ఫిల్టర్‌బెడ్‌లో కూడా గోదావరి జలాలు నిల్వ చేస్తున్నారు. పిఠాపురం పట్టణ ప్రజల కోసం చిత్రాడ మంచినీటి చెరువునే వేసవి రిజర్వాయర్‌గా మలచి గోదావరి జలాలతో నింపుతున్నారు. చివరకు కేంద్ర పాలిత ప్రాంతం పాండిచ్చేరి పరిధిలోని యానాం పట్టణ ప్రజలకు కూడా గోదావరి జలాలే ఆధారం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మానవతా దృక్పథంతో స్పందించడంతో యానాం ప్రజలకు గోదావరి జలాలు అందుతున్నాయి. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా వేసవిలో తాగునీటి ఇబ్బందులు ఎదురు కాకుండా ముందు జాగ్రత్తగా గోదావరి జలాలు నిల్వ చేస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 42.54 లక్షల గ్రామీణ జనాభా తాగునీటి అవసరాలకు గోదావరి జలాలనే వినియోగిస్తున్నారు. ఈ గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా రోజుకు 80 మిలియన్ లీటర్ల గోదావరి జలాలను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 1,600 ఓవర్‌హెడ్ ట్యాంకులను గోదావరి నీటితో నింపుతున్నారు. అలాగే 66 మంచినీటి చెరువుల్లో 0.27 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నారు. -
భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య..
సాక్షి,తూర్పుగోదావరి : భార్యాభర్తల మధ్య నెలకొన్న చిన్న చిన్న విభేదాలు తీవ్ర రూపం దాల్చి చివరికి ఒకరి హత్యకు దారితీశాయి. తాళ్లరేవు మండల పరిధిలోని గాడిమొగ పంచాయతీ లక్ష్మీపతిపురం గ్రామానికి చెందిన విశ్వనాథపల్లి అప్పారావు(32)ను అతని భార్య దేవి గొడ్డలితో నరికి చంపడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన అప్పారావుతో ఐ.పోలవరం మండలం కొమరగిరి గ్రామానికి చెందిన దేవి అలియాస్ భవానీకి పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి పదేళ్ల కుమార్తె ఆదిలక్ష్మి, ఎనిమిదేళ్ల కుమారుడు రాము ఉన్నారు. అప్పారావుకు దేవి మేనత్త కూతురు. కొన్నినెలలుగా వేరే కాపురం పెట్టమంటూ భర్తను అడుగుతోంది. అప్పారావు ఒకడే కుమారుడు కావడం తల్లి, చెల్లి బాధ్యత తనపై ఉండడంతో దానికి ససేమిరా అనేవాడు. దీంతో తరచూ గొడవలు పడేవారు. గొడవ పడి పుట్టింటికి వెళ్లిపోయిన దేవిని గ్రామ పెద్దలు ఒప్పించడంతో వారం రోజుల క్రితం ఇంటికి వచ్చింది. రొయ్యల కంపెనీలో పనిచేసే అప్పారావును అర్ధాంతరంగా ఉద్యోగం నుంచి తొలగించారని, అప్పుల భారం అధికంగా ఉండడంతో భార్యను ఉద్యోగానికి వెళ్లాలని పట్టుబట్టినట్లు సమాచారం. ఆదివారం ఉదయం తల్లి సత్యవతి, చెల్లి దుర్గాదేవి రొయ్యల పరిశ్రమలో పనికి వెళ్లిన అనంతరం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో అప్పారావు హత్యకు గురయ్యాడు. పిల్లలు లేచి చూసేసరికి తండ్రి నెత్తుటి మడుగులో ఉండడం, తల్లి కనిపించకపోవడంతో బయటకు పరుగులు తీశారు. అప్పారావు మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న స్థానికులు ఉదయం 11 గంటల ప్రాంతంలో కోరంగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోరంగి ఎస్సై ఎస్.రాము ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాకినాడ డీఎస్పీ వి.భీమారావు, కాకినాడ రూరల్ సీఐ ఆకుల మురళీకృష్ణ విలేకర్లతో మాట్లాడుతూ నిద్రలో ఉన్న అప్పారావు తలను దేవి గొడ్డలితో ఘోరంగా నరకడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలిపారు. నిందితురాలు దేవి పరారీలో ఉందని ఆమెపై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. చదవండి: పరుగులు తీసి.. ప్రాణం కాపాడి.. -
కాకినాడ బీచ్‌లో యుద్ధ విమాన మ్యూజియం ..
సాక్షి,కాకినాడ రూరల్: యుద్ధ విమాన మ్యూజియం కాకినాడ బీచ్‌లో త్వరలోనే ప్రారంభం కానుంది. సంబంధిత పనులు వేగం అందుకున్నాయి. సూర్యారావుపేట బీచ్‌లో ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యాన అభివృద్ధి చేస్తున్న పార్కులో రూ.5.89 కోట్ల కాకినాడ పట్టణాభి వృద్ధి సంస్థ (కుడా) నిధులతో టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియం ఏర్పాటు కానున్న సంగతి తెలిసిందే. విశాఖపట్నానికి చెందిన తనేజా ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ సంస్థ ఈ పనులు చేపడుతోంది. ఈ పనులను తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ శనివారం స్వయంగా పరిశీలించారు. ఆయనకు కలెక్టర్ సి.హరికిరణ్, నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కుడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, వైస్ చైర్మన్ కె.సుబ్బారావు, జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు, ఆర్డీఓ చిన్నికృష్ణ తదితరులు స్వాగతం పలికారు. యుద్ధ విమానాన్ని పరిశీలించిన వైస్ అడ్మిరల్ అజేంద్ర ప్రజా సందర్శనకు వీలుగా చేపట్టబోయే పనుల గురించి కలెక్టర్ హరికిరణ్, తనేజా సంస్థ ప్రతినిధి శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. విశాఖపట్నంలో మాదిరిగా సందర్శకులు చూసేందుకు ప్రవేశ ద్వారం ఏర్పాటు చేయాలని సూచించారు. రెండు నెలల్లో పనులు పూర్తి చేయాలన్నారు. డిసెంబర్ 4న ప్రారంభోత్సవం జరిగేలా చూడాలన్నారు. మ్యూజియం, పార్కు అభివృద్ధి పురోగతి, పెండింగ్ పనులపై సమీక్షించారు. పనులపై వైస్ అడ్మిరల్ సంతృప్తి మ్యూజియం పనులపై కలెక్టర్ హరికిరణ్, కుడా వీసీ సుబ్బారావులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వైస్ అడ్మిరల్‌కు వివరించారు. బహదూర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ త్వరితగతిన మ్యూజియం పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్న జిల్లా అధికారులను అభినందించారు. పనులు పూర్తయ్యాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ మ్యూజియాన్ని ప్రారంభిస్తారన్నారు. కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ యూటీ–142 యుద్ధ విమాన మ్యూజియం పనులు త్వరిగతిన జరుగుతున్నాయన్నారు. వీటని 60 నుంచి 90 రోజుల్లో పూర్తి చేస్తామని తనేజా సంస్థ ప్రతినిధి తెలిపారన్నారు. కోల్‌కతా, విశాఖపట్నం తర్వాత కాకినాడలో మాత్రమే యుద్ధ విమాన మ్యూజియం ఉందన్నారు. ఏపీ టూరిజం విభాగం స్నాక్స్ బార్, ఇంటర్‌ప్రెటేన్ సెంటర్ ఏర్పాటుతో పాటు రూ.1.50 కోట్లతో పచ్చదనం ఉండేలా పార్కును అభివృద్ధి చేస్తుందన్నారు. కుడా పీఓ సత్యనారాయణమూర్తి, ఏపీలు సూర్యనారాయణ, కృష్ణ, శాంతిలత, తహసీల్దార్ మురళీకృష్ణ, రాగిరెడ్డి బన్నీ, సిద్ధార్ధ తదితరులు పాల్గొన్నారు. సమీపంలోని నేవల్ ఎన్క్లేవ్ వద్దకు వెళ్లిన వైస్ అడ్మిరల్ అక్కడి సిబ్బందితో భేటీ అయ్యారు. -
ఆంధ్రా పోలీసులుకు పశ్చిమ బెంగాల్ ప్రశంస..
సాక్షి,ఆత్రేయపురం: పశ్చిమ బెంగాల్‌కు చెందిన బాలిక కిడ్నాప్ కేసును ఆంధ్రా పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ మెయిల్లో పంపిన బాలిక ఆచూకీ ఆధారంగా కొన్ని గంటల్లోనే బాలికను, నిందుతుడ్ని కనుగొనడంతో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు పశ్చిమ బెంగాల్ పోలీసులు ప్రశంసలు అందించారు. ఎస్సై నరేష్ కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్ బెంగాల్‌కు చెందిన బాలికను ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో తన అ«దీనంలో ఉంచుకున్నాడు. నిందితుడు అదే గ్రామంలో ఇటుక బట్టీలో వలస కూలీగా పని చేస్తున్నాడు. ఆ బాలిక గురించి నార్త్–24 పరగనాస్ జిల్లాలోని మటియా పోలీసు స్టేషన్ నుంచి తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయానికి మెయిల్ ఇచ్చారు. ప్రేమ పేరుతో ఆమెకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసినట్టు సమాచారం వచ్చింది. దీనిపై జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు స్పందించి అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డికి సమాచారం అందించారు. ఆయన పర్యవేక్షణలో రావులపాలెం సీఐ కృష్ణ, ఎస్సై నరేష్, పోలీసు సిబ్బందితో రెండు బృందాలుగా సాంకేతిక పరిజ్ఞానంతో అంకంపాలెంలో బాలికను, కిడ్నాప్ చేసిన వ్యక్తిని గుర్తించారు. దీనిపై అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పశి్చమ బెంగాల్ పోలీసులు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకుని, బాలికను ఆమె బంధువులకు అప్పగించారు. ట్రాన్సిట్ వారెంట్‌పై నిందుతుడిని ఆంధ్రప్రదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్‌కు తరలించేందుకు కోర్టు అనుమతులు మంజూరు చేసింది. దీంతో నిందితుడిని, బాలికను వారి బంధువులు పశి్చమ బెంగాల్‌కు తీసుకువెళ్లారు. సమాచారం వచ్చిన వెంటనే స్పందించిన రావులపాలెం సీఐ కృష్ణ, ఎస్సై నరేష్,ను ఎస్పీ అభినందించారు. చదవండి: మూడు రోజుల్లో అత్తింటికి రావాల్సి ఉండగా.. దారుణం -
గోదారి ఒడిలో ఎగసిన క్రీడాతరంగం..
సాక్షి,తూర్పు గోదావరి: అమ్మ ఒడి ఆలోచనకు అంకురమైతే ఆటపాటలు మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యాలకు దారి చూపుతాయి. పిల్లల మస్తిష్క వికాసంలో చదువుతో పాటు క్రీడలూ ఎంతో దోహదపడతాయి. చదువే ప్రాణంగా పరిగణించేవారు కొందరైతే క్రీడల ద్వారా దేశ కీర్తిని పెంచాలనే వారు మరి కొందరుంటారు. క్రీడారంగంలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ►అమలాపురానికి చెందిన షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రంకిరెడ్డి సాయిరాజ్ సాత్విక్ జిల్లా నుంచి తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడాడు. ఇది జిల్లా క్రీడా చరిత్రలో సువర్ణాధ్యాయమేనని చెప్పాలి. ఈ ఒలింపిక్స్‌లో రాష్ట్రం నుంచి ముగ్గురు క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించగా వారిలో మన సాత్విక్ ఒకరు. సహ క్రీడాకారుడు చిరాగ్‌శెట్టితో కలిసి టోక్యో ఒలింపిక్స్‌లో ప్రతిభ చూపిన సాత్విక్‌కు ఈ నెల 7న అమలాపురం ప్రజలు ఘన స్వాగతం పలికారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తానంటూ భవిష్యత్ ప్రణాళికను ముందుగానే ప్రకటించాడు. సాత్విక్‌ను ప్రోత్సహిస్తూ ఒలింపిక్స్‌కు ముందే జూన్ 30న రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చెక్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ►కూనవరం మండలం పీరా రామచంద్రపురం వలస ఆదివాసీ గ్రామానికి చెందిన కుంజా రజిత 2019 అసోంలో జరిగిన జాతీయ పరుగు పోటీల్లో రజత పతకం సాంధించింది. త్వరలో కెన్యాలో నిర్వహించే అండర్–20 జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్ 400 మీటర్ల పరుగు పందెంలో దేశం తరఫున ఆమె పాల్గోనుంది. ►నేపాల్‌లో 2021 ఫిబ్రవరిలో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో మామిడికుదురుకు చెందిన బోయి అర్జున్, అప్పనపల్లికి చెందిన బొంతు గీతికావేణి బంగారు పతకాలు సాధించారు. ►కాలికట్లో మార్చిలో జరిగిన 32వ సౌత్ జోన్ నేషనల్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో యానాం విద్యార్థిని సూదా తేజస్వి 1,500 మీటర్ల పరుగు పోటీలో కాంస్య పతకం సాధించింది. ►2020 డిసెంబర్లో పాయకరావుపేటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో జిల్లా జట్టు 34 బంగారు పతకాలతో ప్రథమ స్థానంలో నిలిచింది. ►జనవరిలో గుంటూరు జిల్లాలో జరిగిన వైఎస్సార్ స్మారక రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పురుషుల జిల్లా జట్టు ద్వితీయ స్థానం, మహిళల జిల్లా జట్టు ఆరో స్థానం దక్కించుకున్నాయి. ►పిఠాపురంలో ఫిబ్రవరి 2న రాష్ట్రస్థాయి రగ్బీ ఇన్స్ట్రక్టర్స్ రిఫ్రెషర్ కోర్స్ కం ప్రాక్టికల్ కోచింగ్ క్యాంప్ నిర్వహించారు. ►ఫిబ్రవరి 3న అమలాపురంలో జిల్లా స్థాయి బాడీబిల్డింగ్ పోటీల్లో 120 మంది సత్తా చూపారు. ►ఫిబ్రవరిలో రాజమహేంద్రవరంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పురోహితుల క్రికెట్ లీగ్ పోటీల్లో 12 జట్లుకు చెందిన 140 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ►మార్చి 3న రాజానగరం మండలం సంపత్‌నగరంలో 32వ రాష్ట్రస్థాయి అంతర్ జిల్లా రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. ►పెద్దాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన బిరదా సాయి సింధూజ జాతీయ సీనియర్ సాఫ్ట్‌బాల్ జట్టుకు ఎంపికైంది. ధ్యాన్‌చంద్ పుట్టిన రోజే.. ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో 1905లో జన్మించిన భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ పుట్టిన రోజైన ఆగస్టు 29న జాతీ య క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు. ఆయన సారథ్యంలో భారత హాకీ జట్టు 1928, 1932, 1936 ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించి, భారతదేశ కీర్తి పతాకను ప్రపంచ స్థాయిలో రెపరెపలాడించింది. చరిత ఘనం జిల్లాకు చెందిన డాక్టర్ సుంకర హనుమంతరావు 1948 ఒలింపిక్స్‌లో పాల్గొనాల్సి ఉండగా ఉన్నత చదువుల కోసం ఫ్రాన్స్ వెళ్లడంతో ఆగిపోయారు. 1952లో ఒలింపిక్స్‌లో ఆడాల్సి ఉన్న ఆయన సోదరుడు సుంకర వెంకట రమణారావు సాధనలో గాయం కారణంగా వెళ్లలేకపోయారు. ‘‘ఫాదర్ ఆఫ్ ఏపీ ఫుట్‌బాల్’’గా ఖ్యాతికెక్కిన సుంకర సుంకర భాస్కరరావు తన జీవితాన్ని క్రీడారంగానికే అంకితమిచ్చారు. రాజమహేంద్రవరంలో పుట్టి, పెరిగిన ఆయన 1975లో జిల్లా ఒలింపిక్ సంఘాన్ని స్థాపించారు. ఆయన అధ్యక్షుడుగా, అనపర్తికి చెందిన వాలీబాల్ క్రీడాకారుడు మల్లికార్జునరావు కార్యదర్శిగా క్రీడాభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన కృషి ఆరంభమైంది. పొట్టి శ్రీరాములు ఆలిండియా గోల్డ్‌కప్ టోర్నమెంట్లను సుంకర భాస్కరరావు నిర్వహించేవారు. 1978లో ఇండియా, స్వీడన్ మహిళా ఫుట్‌బాల్ పోటీలు నిర్వహించారు. క్రీడారంగానికి ఆయన అందించిన సేవలను గౌరవిస్తూ రాజమహేంద్రవరం గాంధీపురంలోని మున్సిపల్ పాఠశాలకు ‘సుంకర భాస్కరరావు’ పేరు పెట్టారు. జిల్లా ఒలింపిక్ సంఘానికి 1993లో వైడీ రామారావు, పిఠాపురానికి చెందిన ఎస్ఎస్వీ రత్నం అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. 2006 నుంచి 2014 వరకూ సంఘం అధ్యక్ష కార్యదర్శులు వైడీ రామారావు, పద్మనాభం పలు కార్యక్రమాలు నిర్వహించారు. 2016 నుంచి చుండ్రు గోవిందరాజు, కె.పద్మనాభం అధ్యక్ష కార్యదర్శులుగా సేవలందిస్తున్నారు. -
వివాహేతర సంబంధం: ప్రియుడి మోజులో పడి కన్న బిడ్డపై దారుణం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వివాహేతర సంబంధం మోజులో పడి కన్న కుమారుడినే తల్లి హతమార్చిన ఘటన రాజమహేంద్రవరం సీతంపేటలో చోటు చేసుకుంది. త్రీటౌన్ పోలీసులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివాసం ఉంటున్న మల్లెమొగ్గల లక్ష్మి తన కుమారుడు మంజునాథ్ (6) మంచంపై నుంచి పడిపోయి, గాయపడినట్టు పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. ఆ బాలుడు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఆ బాలుడి తల, మెడ, ముఖంపై గాయాలుండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పోస్టుమార్టం నివేదికతో పాటు, స్థానికుల నుంచి పోలీసులు పలు వివరాలు సేకరించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో మంజునాథ్‌ను అతడి తల్లి లక్ష్మి, ప్రియుడు బోనం దాసు హతమార్చినట్టు పోలీసులు గుర్తించారు. వారిద్దరినీ అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. -
నిర్మిస్తున్నవి ఇళ్లు కాదు.. ఊళ్లు
సాక్షి, కాకినాడ సిటీ: గతంలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా కాలనీలు కాకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యాన రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా పెద్ద ఎత్తున గ్రామాల నిర్మాణమే జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, జిల్లా ఇన్చార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంపై జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి విస్తృత సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇళ్ల పట్టాలు అందజేయడం, ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియని, అర్హులు దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో పట్టా మంజూరవుతుందని చెప్పారు. అధికారులు ఎప్పటికప్పుడు సమస్యలను గుర్తించి ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో ఎలాంటి భూ వివాదాలూ రాకుండా స్వచ్ఛమైన భూ రికార్డులే లక్ష్యంగా భూముల రీ సర్వేను ప్రారంభించామని అన్నారు. దీనిని రూ.వెయ్యి కోట్లతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టామని ధర్మాన తెలిపారు. జిల్లాలో 4 లక్షల ఇళ్ల నిర్మాణం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ, రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన తూర్పు గోదావరి జిల్లాలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇళ్ల నిర్మాణ పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. 90 రోజుల్లో ఇంటి పట్టా కార్యక్రమంతో కలిపి, జిల్లాలో దశల వారీగా 4 లక్షల ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ప్రతి 20 ఇళ్లకు ఓ అధికారిని, అలాగే ప్రతి లే అవుట్‌కు మండల స్థాయి అధికారిని నోడల్ అధికారులుగా నియమించామని చెప్పారు. భౌగోళికంగా ఎంతో వైవిధ్యం ఉన్న జిల్లాలో సవాళ్లను అధిగమిస్తూ ప్రజాప్రతినిధుల సహకారంతో కలెక్టర్ మురళీధర్‌రెడ్డి ఈ కార్యక్రమం అమలులో ముందుండేలా కృషి చేస్తున్నారని అభినందించారు. కొమరిగిరి లే అవుట్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ లైన్ల వంటి వాటి ఏర్పాటుతో భవిష్యత్తులో ఓ ఆదర్శ పట్టణం సాక్షాత్కరించనుందని అన్నారు. ఇళ్ల నిర్మాణాలకు ఎలాంటి ఆటంకం లేకుండా లే అవుట్లలోనే సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రిని రాయితీతో అందుబాటులో ఉంచనున్నామని మంత్రి తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం స్పెషల్ లైన్ ద్వారా ఇసుకను లే అవుట్లకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ, అమలాపురం డివిజన్లో లోతు ఆధారంగా లే అవుట్లలో లెవెలింగ్ కార్యకలాపాలు సాగించాల్సి ఉందని సూచించారు. దీనివల్ల భవిష్యత్తులో సమస్యలు తలెత్తవన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చేపట్టిన పేదలందరికీ ఇళ్లు యజ్ఞాన్ని విజయవంతం చేసేందుకు సమష్టిగా కృషి చేయాలని అన్నారు. సమావేశంలో కాకినాడ ఎంపీ వంగా గీత, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండీ భరత్‌గుప్తా, సీఈ పి.శ్రీరాములు, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కొండేటి చిట్టిబాబు, జ్యోతుల చంటిబాబు, పర్వత పూర్ణచంద్రప్రసాద్, పెండెం దొరబాబు, జాయింట్ కలెక్టర్లు జి.లక్ష్మీశ, ఎ.భార్గవతేజ, జి.రాజకుమారి, డీఆర్ఓ సీహెచ్ సత్తిబాబు, జెడ్పీ సీఈఓ ఎన్వీవీ సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ పీడీ జి.వీరేశ్వర ప్రసాద్, మున్సిపల్ కమిషనర్లు, సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు, వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. రూ.4 లక్షల కోట్ల సంపద సృష్టి పేదలందరికీ ఇళ్ల నిర్మాణాలు పూర్తయితే దాదాపు రూ.4 లక్షల కోట్ల సంపద సృష్టి జరుగుతుందని మంత్రులు ధర్మాన కృష్ణదాస్, శ్రీరంగనాథరాజు అన్నారు. సమావేశం అనంతరం వారు విలేకర్లతో మాట్లాడారు. పేదల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్రంలో రూ.12 వేల కోట్లతో భూసేకరణ చేసి, లే అవుట్లను సిద్ధం చేశామన్నారు. రాష్ట్రంలో 13 వేల గ్రామ పంచాయతీలుంటే వీటికి అనుబంధంగా మరో 17,500 కొత్త గ్రామాల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. సముద్ర తీర గ్రామాల్లో తుపానులను సైతం ఎదుర్కొనేలా ఇళ్లు నిర్మిస్తున్నామని, ఆయా ప్రాంతాల్లోని లే అవుట్లలో భూగర్భ డ్రైనేజీలు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు రూ.32 వేల కోట్లు కేటాయించామని వివరించారు. ఇంటి నిర్మాణం పూర్తయితే ఒక్కో లబ్ధిదారుకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల ఆస్తి సమకూరుతుందన్నారు. తొలి దశలో 1,34,458 ఇళ్లు ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం స్థితిగతులను కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి వివరించారు. తొలిదశలో రూ.2,420 కోట్లతో 758 లే అవుట్లలో 1,34,458 ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని వెల్లడించారు. లే అవుట్లలో ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన నీటి సరఫరా పనులు 60 శాతం పూర్తయ్యాయని, 758 లే అవుట్లకు గానూ 673 లే అవుట్లకు విద్యుత్ సర్వీసులు మంజూరు చేశామని తెలిపారు. లే అవుట్లలో శాశ్వత మౌలిక వసతుల అభివృద్ధికి శాఖల వారీగా సమగ్ర ప్రాజెక్టు నివేదికలను సిద్ధం చేశామని చెప్పారు. జియోట్యాగింగ్, మ్యాపింగ్, లబ్ధిదారుల రిజిస్ట్రేషన్, జాబ్‌కార్డు మ్యాపింగ్, మెగా గ్రౌండింగ్ మేళా, ఇళ్ల నిర్మాణ సామగ్రి సేకరణ లక్ష్యాలను చేరుకునేందుకు లే అవుట్లను ఎ, బి, సి కేటగిరీలుగా వర్గీకరించామన్నారు. స్వయంసహాయ సంఘాలకు అడ్వాన్స్ రుణాల గురించి కలెక్టర్ వివరించారు. -
పాపికొండల విహారయాత్ర ప్రారంభం..
సాక్షి, తూర్పుగోదావరి : గత 21 నెలలు గా నిలిచిపోయిన పాపికొండల విహారయాత్ర తిరిగి ప్రారంభమైంది. గోదావరి నదికి హారతి ఇచ్చి పాపికొండల విహారయాత్ర ను పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. పాపికొండల విహారయాత్రకు వెళ్లే టూరిజం బోట్ల ట్రయిల్ రన్లో మంత్రి అవంతి పాల్గొన్నారు. కచ్చులూరు దుర్ఘటన, కొవిడ్ పరిస్థితుల కారణంగా పాపికొండల టూరిజం 21 నెలలుగా నిలిపి వేసినట్లు మంత్రి తెలిపారు. రేపటి నుంచి పాపికొండల బోటింగ్‌కు బుకింగ్స్ ప్రారంభం అవుతాయని చెప్పారు. ఈ సందర్భంగా గండిపోచమ్మ అమ్మవారిని మంత్రి దర్శించుకున్నారు. చదవండి: పులిచింతల ప్రాజెక్ట్ వద్ద మరో వివాదం -
చేపల ‘ఎగ్జిబిషన్’!
సాక్షి, పిఠాపురం: చేపల మార్కెట్లో చేపలనిలా ప్రదర్శనకు ఉంచారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఫిషింగ్ హార్బర్ సమీపంలో మత్స్యకారులు వేటకు వెళ్లి తెచ్చిన భారీ చేపలను ఇలా వరుస క్రమంలో పేర్చి అమ్మకానికి పెట్టారు. రూ.లక్షల విలువైన ఈ చేపలను వ్యాపారులు కొనుగోలు చేసి వివిధ దేశాలకు, ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. -
మంత్రి కురసాలపై కేసు కొట్టివేత
సాక్షి, తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుపై ఎన్నికల సమయంలో నమోదైన కేసును గురువారం న్యాయస్థానం కొట్టివేసింది. 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కరప పోలింగ్ కేంద్రంలోకి కన్నబాబు అక్రమంగా ప్రవేశించారని ఆయనపై అభియోగం వచ్చిన తెలిసిందే. ఈ కేసుపై విచారణ చేపట్టిన విజయవాడ ప్రత్యేక న్యాయస్థానం.. కన్నబాబుపై ఆరోపణలకు రుజువులు లేవని తెలిపింది. అలాగే కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. -
జగనన్నా.. మేమంతా మీ వెంటే..
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘వైఎస్ రాజశేఖరరెడ్డికి కాపులంటే ప్రాణం. తండ్రి లాగే జగన్ కూడా మా పట్ల ప్రేమాభిమానాలు చూపిస్తారన్న నమ్మకం ఉంది. కాపుల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలన్న చంద్రబాబు ఆటలు సాగనివ్వం. తూర్పుగోదావరి జిల్లాలోని మొత్తం 19 నియోజకవర్గాలను గెలిచి జగన్‌కు కానుకగా ఇస్తాం’ అంటూ రామచంద్రాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాలకు చెందిన కాపు సామాజిక వర్గాల నేతలు ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు నీరాజనాలు పట్టారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం 228వ రోజు జగన్.. పిఠాపురం నియోజకవర్గం చెందుర్తి క్రాస్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. కాపు కార్పొరేషన్‌కు రూ.10 వేల కోట్లు ఇస్తామని ప్రకటించినందుకు ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన కాపు నేతలు, మహిళా ప్రజా ప్రతినిధులు జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పూల కిరీటాలు పెట్టి శాలువాలు కప్పి సన్మానించారు. మిఠాయిలు తినిపించారు. వైఎస్ జగన్ జిందాబాద్.. జగన్‌కు కృతజ్ఞతలు.. అంటూ దారిపొడవునా బ్యానర్లు, కటౌట్లతో స్వాగతం పలికారు. బాణసంచా కాలుస్తూ ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాపు నేతలు మాట్లాడుతూ.. కాపులు కోరకపోయినా గత ఎన్నికల్లో గెలిచేందుకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు పిల్లిమొగ్గల్ని తాము గమనిస్తూనే ఉన్నామని, అసెంబ్లీలో తూతూ మంత్రపు తీర్మానం చేసి కేంద్రానికి పంపిన తీరే ఇందుకు నిదర్శనమన్నారు. కేంద్రంతో సత్సంబంధాలు తెగిపోనున్నాయని తెలిసే చంద్రబాబు నామమాత్రపు తీర్మానం చేసి తమను మోసపుచ్చారని ధ్వజమెత్తారు. తామంతా జగన్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. చేనేతలు చితికిపోతున్నారు.. పాదయాత్ర చేబ్రోలు చేరుకున్నప్పుడు చేనేత వర్గాల ప్రజలు, సహకార సంఘాల ప్రతినిధులు జగన్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. డాక్టర్ వైఎస్సార్ ప్రవేశపెట్టిన నూలుపై రాయితీ పథకాన్ని ఈ పాలకులు నిర్వీర్యం చేశారని, పావలా వడ్డీ అసలు కనిపించకుండానే పోయిందని వివరించారు. ఎన్నికలకు ముందు ప్రకటించిన చేనేత బజార్లు ఏర్పాటు చేయలేదని వాపోయారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే చేనేత కార్మికులు, సంఘాలకు రుణమాఫీ చేయాలని. జీఎస్టీ నుంచి చేనేత పరిశ్రమకు మినహాయింపు ఇవ్వాలని, బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, చేనేత సంఘాలు తయారు చేసిన వస్త్రాలను పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. నూలుపై 5 శాతం, వస్త్రంపై అద్దే రంగులకు 18 శాతం జీఎస్టీ విధించడాన్ని తొలగించేలా తక్షణమే చర్యలు చేపట్టాలని నివేదించారు. వర్షాకాలం వస్తే నేతన్నలు మగ్గాలపై పని చేసే అవకాశం ఉండదని, ఆ సమయంలో (వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇస్తున్నట్టు) సాయం అందించాలని కోరారు. వీరి సమస్యలు ఓపికగా విన్న జగన్ స్పందిస్తూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చానని, వడ్డీ లేని రుణాలతో పాటు వర్క్ ఆర్డర్లు ఇప్పిస్తామని.. అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు మూసేస్తున్నారన్నా.. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న సాకుతో బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల హాస్టళ్లను మూసి వేస్తున్నారంటూ పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జగన్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. 50 మంది కంటే తక్కువగా ఉండే హాస్టళ్లను మూసి వేయడం వల్ల తాము దూరాబారం పోలేక చదువుకు దూరం కావాల్సి వస్తోందని వాపోయారు. ఓపక్క విద్య ప్రాథమిక హక్కు అంటూనే మరోపక్క బలహీన వర్గాలకు చదువుకునే సౌకర్యం లేకుండా చేస్తున్నారని, ఈ పరిస్థితిని నివారించేలా చర్యలు చేపట్టాలని జగన్‌ను కోరారు. బాబు వస్తే జాబొస్తుందని ఊదరగొట్టిన పెద్దమనిషి ఇప్పుడు అదిగో డీఎస్సీ, ఇదిగో ఏపీపీఎస్సీ అంటూ కబుర్లు చెబుతున్నారే తప్ప ఇంతవరకు ఒక్క ప్రభుత్వ ఉద్యోగాన్నీ భర్తీ చేయలేదని పలువురు గ్రాడ్యుయేట్లు జగన్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు రాక తల్లిదండ్రులపై ఆధారపడాల్సి రావడంతో మానసికంగా క్షోభ పడుతున్నామని చెప్పారు. దారిపొడవునా సమస్యల నివేదన పింఛన్లు, రేషన్‌కార్డులు ఇవ్వడం లేదని వృద్ధులు, జీవో 010 పద్ధతిన వేతనాలు ఇవ్వాలని పంచాయతీ వర్కర్లు, బలవన్మరణానికి పాల్పడ్డ రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో రాలేదని కౌలు రైతు కుటుంబ సభ్యులు, ఆరోగ్య శ్రీ అందక సతమతం అవుతున్నామని నిరుపేదలు.. పాదయాత్ర సాగిన దారిపొడవునా జననేత దృష్టికి తీసుకొచ్చారు. చేబ్రోలు గ్రామ శివార్లలోని ఈబీసీ కాలనీలో స్కూలుకు ఇచ్చిన 60 సెంట్ల స్థలాన్ని కాజేసేందుకు పిఠాపురం ఎమ్మెల్యే, ఎంపీటీసీ సభ్యుడు, టీడీపీ నాయకులు పోటీ పడుతున్నారంటూ పలువురు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే 20 సెంట్లు కాజేసినట్టు వార్తలు వస్తున్నాయని, ఏదో విధంగా స్కూలు స్థలాన్ని కాపాడేలా చూడండని వారు జగన్‌ను కోరారు. రోజురోజుకూ స్థానిక ఎమ్మెల్యే ఆగడాలు మితిమీరిపోతున్నాయని వాపోయారు. అందరి సమస్యలు ఓపికగా విన్న జగన్.. మనందరి ప్రభుత్వం రాగానే ఆదుకుంటామని భరోసా ఇస్తూ ముందుకు సాగారు. ఇదిలా ఉండగా, శనివారం జగన్ స్వల్ప అస్వస్థతతోనే పాదయాత్ర కొనసాగించారు. డస్ట్ అలర్జీ వల్ల జలుబు, దగ్గుతో ఆయన బాధ పడుతున్నారని, స్వల్పంగా జ్వరం కూడా వచ్చిందని పార్టీ పోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. -
వీడిన రామలక్ష్మి హత్య మిస్టరీ
గరివిడి: మండలంలోని కొండలక్ష్మీపురంలో ఈ నెల 5వ తేదీన జరిగిన గొర్లె రామలక్ష్మి(65) హత్య కేసు మిస్టరీ వీడింది. పట్టుబడిన నిందితులను బొబ్బిలి డీఎస్పీ పి.సౌమ్యలత ఆధ్యర్యంలో గరివిడి ఎస్సై శ్రీనివాస్ బుధవారం మధ్యాహ్నం మీడియా ముందు ప్రవేశపెట్టారు. డీఎస్పీ సౌమ్యలత అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. రామలక్ష్మికి చేతబడి ఉందన్న అనుమానంతో హంతకులు పథకం ప్రకారం హతమార్చారు. గతంలో గ్రామంలో ఉన్న చిన్నారులు, పెద్దలు, పశువులు అనారోగ్యం పాలవుతుండటానికి ప్రధాన కారణం రామలక్ష్మి చేతబడేనని నిందితుల నమ్మకం. ముఖ్యంగా హత్యకు వారం ముందు వట్టిగళ్ల ఆదినారాయణకు చెందిన ఆవు మృతి చెందింది. తన ఆవు చనిపోవడానికి రామలకే‡్ష్మ కారణమని భావించిన ఆదినారాయణ ఆమెను అంతమొందించడానికి నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఆమె కుమార్తె తాడ్డి పెంటమ్మతో చర్చించాడు. దీంతో పెంటమ్మ తన తల్లికి చిల్లంగి, చేతబడి ఉందని అనుమానం ఉంటే పల్లు పీకేయమని, లేదంటే ఇళ్ల చుట్టూ కొయ్యలు పాతిపెట్టమని సలహాఇచ్చింది. అయితే ఆ విషయాలకు సంతృప్తి చెందని ఆదినారాయణ ఎలాగైనా ఆమెను చంపాలని నిర్ణయించాడు. అలాగే రామలక్ష్మి పేరిట బ్యాంకు ఖాతాలో రూ.90 వేలు ఉన్నట్లు కుమార్తె పెంటమ్మ తెలుసుకుంది. తల్లిని చంపేస్తే ఆ పైకం తనకే చెందుతుందన్న దురాశతో ఆదినారాయణతో చేతులు కలిపింది. దీంతో వీరిద్దరూ ఆదినారాయణ కుమారుడు వట్టిగల్ల జయరాజు, దాసరి సతీష్‌ల సహకారం తీసుకున్నారు. అదే గ్రామానికి చెందిన ఆవాల దేముడురాజుకు రూ. 50 వేలు ఇస్తామని ఆశ చూపించి రెండు రోజుల్లో రామలక్ష్మిని చంపేయాలని కోరారు. దీంతో ఈ నెల 5వ తేదీన గ్రామంలో తన తోటలో మొక్కలకు నీళ్లు పోస్తున్న రామలక్ష్మిని దేముడురాజు పీక కోసి హత్య చేశాడు. హత్యకు ఉపయోగించిన కత్తిని సంఘటనా స్థలానికి 500 మీటర్ల దూరంలో ఉన్న తాటిచెట్ల పొదల్లో దాచేశాడు. అనంతరం రామలక్ష్మి శవాన్ని కుమార్తె పెంటమ్మ తన భుజాలపై వేసుకొని ఇంటికి తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే రామలక్ష్మి మృతిపై అనుమానాలున్న పోలీసులు తనదైన శైలిలో విచారణ చేపట్టడంతో నిందితులు పట్టుబడ్డారు. కార్యక్రమంలో చీపురుపల్లి సీఐ సీహెచ్. శ్యామలరావు, ఎస్సై శ్రీనివాస్ ఉన్నారు. -
అంతర్ జిల్లాల దోపిడీ ముఠా అరెస్టు
కాకినాడ రూరల్: ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ జిల్లాలో వివిధ దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను, బంగారం కొనుగోలు చేసిన నరసాపురానికి చెందిన వ్యక్తిని అరెస్టు చేసి వీరి నుంచి రూ. 50 లక్షల విలువైన బంగారు, వెండి, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ విశాల్ గున్ని జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దొంగతనాలకు పాల్పడిన ముఠా వివరాలను వెల్లడించారు. ఈ ముఠా సభ్యులు 2015 నుంచి ఇప్పటి వరకు 18 దొంగతనాలు, 3 దోపిడీలు చేసినట్లు చెప్పారు. వీరి వద్ద నుంచి 1.5 కిలోల బంగారం, 37 కిలోల వెండి, రూ. 3, 04, 700 నగదుతో కలిపి మొత్తం రూ. 50 లక్షలు రికవరీ చేసినట్లు పేర్కొన్నారు.రాజోలు సీఐకి బుధవారం ఉదయం వచ్చిన సమాచారం మేరకు శివకోడు ముసలమ్మ తల్లిగుడి వద్ద జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా పాలకొల్లు నుంచి రాజోలు వస్తున్న అశోక్ లేలాండ్ వ్యాన్ ఆపేందుకు ప్రయత్నించగా ఆపకుండా వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడన్నారు. వెంటనే సిబ్బంది అప్రమత్తమై వ్యాన్‌ను చుట్టుముట్టి ఆపి అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనాలు, దోపిడీలకు సంబంధించిన సమాచారం బయటపడిందన్నారు. రాజోలు ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ ఏవీ సూర్యనారాయణరాజు ఇంట్లో దోపిడీ కేసుతో పాటు రాజోలు సర్కిల్లో మరో ఆరు దొంగతనాలు, అమలాపురం టౌన్లో గత నెల 7వ తేదీన జరిగిన సంచలనమైన దొంగతనంతో పాటు అమలాపురం రూరల్ సర్కిల్ పరిధిలో ఏడు దొంగతనాలు, రావులపాలెం సర్కిల్ పరిధిలో మూడు, పెద్దాపురం సర్కిల్ పరిధిలో రెండు, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం సర్కిల్ పరిధిలో ఒకటి, పాలకొల్లు సర్కిల్ పరిధిలో ఒకటి, విశాఖ జిల్లా రూరల్ పరిధిలో దొంగతనాలకు, దోపిడీలకు ఈ ముగ్గురు సభ్యుల ముఠా పాల్పడిందన్నారు. ఈ ముఠాలో పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం మట్లపాలెంకు చెందిన తోటకూర రామకృష్ణంరాజు అలియాస్ రాజేష్, తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం విలసవిల్లి గ్రామానికి చెందిన నడింపల్లి సుబ్రహ్మణ్యంరాజు అలియాస్ మహేష్ ఉన్నారు. ప్రస్తుతం మహేష్ విశాఖ జిల్లా నర్సిపట్నంలో ఉంటున్నాడు. అంబాజీపేట మండలం కె.పెదపూడి గ్రామానికి చెందిన రుద్రరాజు వెంకటరాజు అలియాస్ నాని ఇతను ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో ఉంటున్నట్లు ఎస్పీ విశాల్ గున్ని వివరించారు. అంతేగాక వీరు దొంగిలించిన వస్తువులను కొనుగోలు చేస్తున్న నరసాపురానికి చెందిన విజయ పవార్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అమలాపురం డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో రాజోలు సీఐ కిష్టోఫర్, సిబ్బంది బొక్కా శ్రీను, పి.వెంకటేశ్వర్లు, జయరాం, వీరేంద్ర, సుబ్బారావు, రామచంద్రరావు ఈ ముఠాను పట్టుకున్నట్లు ఎస్పీ విశాల్ గున్ని వివరించారు. మూడేళ్లుగా భారీ దోపిడీ, దొంగతనాలకు పాల్పడుతున్న ఈ ముఠాను చాకచక్యంతో పట్టుకున్న సిబ్బందిని ఎస్పీ విశాల్ గున్ని అభినందించారు. ఈ దోపిడీ ముఠాను పట్టుకోవడంలో సహకరించిన అమలాపురం సబ్ డివిజన్ సీఐ వైఆర్కే శ్రీనివాస్, దేవకుమార్, పెద్దిరాజు, రమణారావును ఎస్పీ విశాల్ గున్ని అభినందించారు. నిందితులపై కేసులు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. -
పిల్లలకు విషమిచ్చి దంపతుల ఆత్మహత్య
రాజమండ్రి: ఇద్దరు చిన్నారులతో తల్లిదండ్రులు మృతి చెందిన విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో విషాదం చోటు చేసుకుంది. నగరంలోని సారంగధరమెట్టలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తమ పిల్లలకు విషమిచ్చి తల్లిదండ్రులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు విజయనగరం జిల్లా పాలకొండకు చెందిన కింజెరపునాయుడు కుటుంబ సభ్యులుగా గుర్తించారు. ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగానే వీరు ఆత్మహత్యకు పాల్పడివుంటారని అనుమానిస్తున్నారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉండేవారని చుట్టుపక్కల వారు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.