సాక్షి,తూర్పు గోదావరి: అమ్మ ఒడి ఆలోచనకు అంకురమైతే ఆటపాటలు మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యాలకు దారి చూపుతాయి. పిల్లల మస్తిష్క వికాసంలో చదువుతో పాటు క్రీడలూ ఎంతో దోహదపడతాయి. చదువే ప్రాణంగా పరిగణించేవారు కొందరైతే క్రీడల ద్వారా దేశ కీర్తిని పెంచాలనే వారు మరి కొందరుంటారు. క్రీడారంగంలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
►అమలాపురానికి చెందిన షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రంకిరెడ్డి సాయిరాజ్ సాత్విక్ జిల్లా నుంచి తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడాడు. ఇది జిల్లా క్రీడా చరిత్రలో సువర్ణాధ్యాయమేనని చెప్పాలి. ఈ ఒలింపిక్స్‌లో రాష్ట్రం నుంచి ముగ్గురు క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించగా వారిలో మన సాత్విక్ ఒకరు. సహ క్రీడాకారుడు చిరాగ్‌శెట్టితో కలిసి టోక్యో ఒలింపిక్స్‌లో ప్రతిభ చూపిన సాత్విక్‌కు ఈ నెల 7న అమలాపురం ప్రజలు ఘన స్వాగతం పలికారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తానంటూ భవిష్యత్ ప్రణాళికను ముందుగానే ప్రకటించాడు. సాత్విక్‌ను ప్రోత్సహిస్తూ ఒలింపిక్స్‌కు ముందే జూన్ 30న రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చెక్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.
►కూనవరం మండలం పీరా రామచంద్రపురం వలస ఆదివాసీ గ్రామానికి చెందిన కుంజా రజిత 2019 అసోంలో జరిగిన జాతీయ పరుగు పోటీల్లో రజత పతకం సాంధించింది. త్వరలో కెన్యాలో నిర్వహించే అండర్–20 జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్ 400 మీటర్ల పరుగు పందెంలో దేశం తరఫున ఆమె పాల్గోనుంది.
►నేపాల్‌లో 2021 ఫిబ్రవరిలో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో మామిడికుదురుకు చెందిన బోయి అర్జున్, అప్పనపల్లికి చెందిన బొంతు గీతికావేణి బంగారు పతకాలు సాధించారు.
►కాలికట్‌లో మార్చిలో జరిగిన 32వ సౌత్ జోన్ నేషనల్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో యానాం విద్యార్థిని సూదా తేజస్వి 1,500 మీటర్ల పరుగు పోటీలో కాంస్య పతకం సాధించింది.
►2020 డిసెంబర్‌లో పాయకరావుపేటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో జిల్లా జట్టు 34 బంగారు పతకాలతో ప్రథమ స్థానంలో నిలిచింది.
►జనవరిలో గుంటూరు జిల్లాలో జరిగిన వైఎస్సార్ స్మారక రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పురుషుల జిల్లా జట్టు ద్వితీయ స్థానం, మహిళల జిల్లా జట్టు ఆరో స్థానం దక్కించుకున్నాయి.
►పిఠాపురంలో ఫిబ్రవరి 2న రాష్ట్రస్థాయి రగ్బీ ఇన్‌స్ట్రక్టర్స్ రిఫ్రెషర్ కోర్స్ కం ప్రాక్టికల్ కోచింగ్ క్యాంప్ నిర్వహించారు.
►ఫిబ్రవరి 3న అమలాపురంలో జిల్లా స్థాయి బాడీబిల్డింగ్ పోటీల్లో 120 మంది సత్తా చూపారు.
►ఫిబ్రవరిలో రాజమహేంద్రవరంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పురోహితుల క్రికెట్ లీగ్ పోటీల్లో 12 జట్లుకు చెందిన 140 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
►మార్చి 3న రాజానగరం మండలం సంపత్‌నగరంలో 32వ రాష్ట్రస్థాయి అంతర్ జిల్లా రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి.
►పెద్దాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన బిరదా సాయి సింధూజ జాతీయ సీనియర్ సాఫ్ట్‌బాల్ జట్టుకు ఎంపికైంది.
ధ్యాన్‌చంద్ పుట్టిన రోజే..
ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో 1905లో జన్మించిన భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ పుట్టిన రోజైన ఆగస్టు 29న జాతీ య క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు. ఆయన సారథ్యంలో భారత హాకీ జట్టు 1928, 1932, 1936 ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించి, భారతదేశ కీర్తి పతాకను ప్రపంచ స్థాయిలో రెపరెపలాడించింది.
చరిత ఘనం
జిల్లాకు చెందిన డాక్టర్ సుంకర హనుమంతరావు 1948 ఒలింపిక్స్‌లో పాల్గొనాల్సి ఉండగా ఉన్నత చదువుల కోసం ఫ్రాన్స్ వెళ్లడంతో ఆగిపోయారు. 1952లో ఒలింపిక్స్‌లో ఆడాల్సి ఉన్న ఆయన సోదరుడు సుంకర వెంకట రమణారావు సాధనలో గాయం కారణంగా వెళ్లలేకపోయారు. ‘‘ఫాదర్ ఆఫ్ ఏపీ ఫుట్‌బాల్’’గా ఖ్యాతికెక్కిన సుంకర సుంకర భాస్కరరావు తన జీవితాన్ని క్రీడారంగానికే అంకితమిచ్చారు. రాజమహేంద్రవరంలో పుట్టి, పెరిగిన ఆయన 1975లో జిల్లా ఒలింపిక్ సంఘాన్ని స్థాపించారు. ఆయన అధ్యక్షుడుగా, అనపర్తికి చెందిన వాలీబాల్ క్రీడాకారుడు మల్లికార్జునరావు కార్యదర్శిగా క్రీడాభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన కృషి ఆరంభమైంది.
పొట్టి శ్రీరాములు ఆలిండియా గోల్డ్‌కప్ టోర్నమెంట్లను సుంకర భాస్కరరావు నిర్వహించేవారు. 1978లో ఇండియా, స్వీడన్ మహిళా ఫుట్‌బాల్ పోటీలు నిర్వహించారు. క్రీడారంగానికి ఆయన అందించిన సేవలను గౌరవిస్తూ రాజమహేంద్రవరం గాంధీపురంలోని మున్సిపల్ పాఠశాలకు ‘సుంకర భాస్కరరావు’ పేరు పెట్టారు. జిల్లా ఒలింపిక్ సంఘానికి 1993లో వైడీ రామారావు, పిఠాపురానికి చెందిన ఎస్‌ఎస్‌వీ రత్నం అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. 2006 నుంచి 2014 వరకూ సంఘం అధ్యక్ష కార్యదర్శులు వైడీ రామారావు, పద్మనాభం పలు కార్యక్రమాలు నిర్వహించారు. 2016 నుంచి చుండ్రు గోవిందరాజు, కె.పద్మనాభం అధ్యక్ష కార్యదర్శులుగా సేవలందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment