56వ రోజు
08–01–2018, సోమవారం
పూతలపట్టు శివారు,
చిత్తూరు జిల్లా.
ఈ రోజు తేనెపల్లి దగ్గర 108 అంబులెన్స్ కనిపించింది. వెంటనే నాన్నగారు గుర్తుకొచ్చారు. ఒకప్పుడు దేశవ్యాప్తంగా అందరి మన్ననలు పొందిన అతిగొప్ప పథకమది. కానీ నేడు పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా కనిపిస్తోంది. ఆ అంబులెన్స్ పక్కనే ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు నిలుచున్నారు. వారు నా దగ్గరకు వచ్చి ‘సార్.. మీ నాన్నగారి వల్లే మాకు ఉద్యోగాలొచ్చాయి. అప్పట్లో మాకు ఏ ఇబ్బందీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కొద్ది సంవత్సరాలుగా జీతాలు పెంచడం లేదు. మూడు నెలలుగా అసలు జీతాలే ఇవ్వడంలేదు. చాలా అంబులెన్స్‌లు మూలనపడ్డాయి. ఉన్నవాటిలో సౌకర్యాలు కూడా సరిగా లేవు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండానే చాలా వాహనాలను నడిపిస్తున్నారు. ఉద్యోగులపై వేధింపులు ఎక్కువయ్యాయి. దాదాపు పది సంవత్సరాలకు పైబడి పనిచేస్తున్నాం.
ఇప్పుడు వేరే ఉద్యోగాలకు వెళ్లలేము. ఇలాంటి పరిస్థితులొస్తాయని కలలో కూడా ఊహించలేదు. మీ నాన్నగారి మీద అభిమానంతో, మీమీద నమ్మకంతో.. మిమ్మల్ని కలవడానికి వచ్చాం’అన్నారు. ఒకప్పుడు గ్రామీణ ప్రజలకు అత్యవసర సేవలందిస్తూ.. ఎన్నో ప్రాణాలను కాపాడుతూ.. పేదల పాలిట సంజీవనిగా పేరొందిన పథకం ఈ స్థితికి చేరుకోవడం చాలా బాధనిపించింది. నాన్నగారు ఈ పథకాన్ని ప్రారంభించి అద్భుతంగా సేవలందించడం చూసి.. దానిని ఆదర్శంగా తీసుకుని దేశంలోని దాదాపు 20కి పైగా రాష్ట్రాల్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ పథకం ప్రారంభమైన మన రాష్ట్రంలో తప్ప, మిగతా అన్ని చోట్లా విజయవంతంగా నిర్వహింపబడటం.
దీనికి కారణం.. ఎంతో పవిత్రమైన ఆశయంతో, సేవా దృక్పథంతో ప్రారంభమైన ఈ పథకాన్ని కూడా నేటి మన పాలకులు వ్యాపారమయం చేసి అవినీతి ఆదాయ మార్గంగా మలచుకోవడం ఒకటైతే, 108 అనగానే రాష్ట్ర ప్రజలందరికీ నాన్నగారే గుర్తొస్తారు కాబట్టి ఈ పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం మరొకటి.
యాత్ర ముగిసే సమయంలో కుప్పం నియోజకవర్గానికి చెందిన దళితులు కలిశారు.‘సార్.. మాది గుడిపల్లి మండలం సోడిగానిపల్లి గ్రామం. మా దళితవాడలో మాల గెరిగమ్మ, సూద్ర గెరిగమ్మ అనే దేవాలయాలున్నాయి. ఆ గుడులకు చెందిన విలువైన భూములను టీడీపీ వాళ్లు కబ్జా చేసి, ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. అధికారుల చుట్టూ, కలెక్టర్ చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోవడంలేదు’అన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో.. దళితులు ఎంతో భక్తితో కొలిచే దేవాలయాలకు చెందిన భూముల్ని ఆయన అనుచరులే ఆక్రమించుకుని అమ్ముతుంటే.. ముఖ్యమంత్రిగారు దానిపై చర్యలు తీసుకోకపోవడం అత్యంత శోచనీయం.
అయినా దళితులంటే ఆయనకు ఎలాంటి అభిప్రాయముందో అందరికీ తెలిసిందే. మొన్నటికి మొన్న జెర్రిపోతులపాలెంలో దళిత మహిళపై జరిగిన దాష్టీకాన్ని ఇంకా ప్రజలెవరూ మరువలేదు. ఆఖరికి ‘అవినీతికి కాదేదీ అనర్హం’.. అన్నట్లుగా గుడి భూములను సైతం వదలడంలేదు. మొన్న సదావర్తి భూములను తన బినామీల ద్వారా మింగాలని చూశారు. చివరికి కనకదుర్గమ్మ గుడి భూములనూ వదల్లేదు. మీరే ఇలా ఉంటే.. ఇక మీ అనుచరులు ఎలా ఉంటారు?! ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా?
చివరిగా, ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. రాజధాని మొదలుకుని మీ బినామీలకు కట్టబెట్టిన అనేక ప్రాజెక్టులలో సరైన పరిహారం కూడా ఇవ్వకుండా దళితుల భూములను బలవంతంగా లాక్కోవడం నిజం కాదా? ‘దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా..’ అన్న మీ నుంచి ఇంతకన్నా ఏం ఆశిస్తారు..?
కొండారెడ్డిపల్లె క్రాస్ వద్ద వైఎస్ జగన్‌కు నాగలిని బహూకరిస్తున్న అభిమాని
Comments
Please login to add a commentAdd a comment