
59వ రోజు
11–01–2018, గురువారం,
బీరమాకుల గండ్రిక,
చిత్తూరు జిల్లా.
ఈరోజు ఉదయం వెదురుకుప్పంలో శారదమ్మ అనే అక్క.. తన కుమారుడి ఫొటో చేతిలో పట్టుకుని, కళ్ల నిండా నీళ్లు పెట్టుకుని ‘అన్నా.. నేను అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్నాను. ఏడు నెలల కిందట నా కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అంతకు సంవత్సరం మునుపే నా కుమారుడి పేరును చంద్రన్న బీమా పథకంలో నమోదు చేయించాను. అయినా నాకు ఇంతవరకూ పరిహారం అందలేదు’ అంటూ కన్నీటిపర్యంతమైంది. చేతికి అందివచ్చిన ఒక్కగానొక్క కొడుకు మరణించి పుట్టెడు శోకంలో ఉన్న ఆ తల్లికి ప్రభుత్వ సాయం అందకపోవడం చాలా బాధనిపించింది.
మధ్యాహ్నం భోజన విరామం తర్వాత యాత్ర చంద్రగిరి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. పార్టీ పతాకాల తోరణాల పందిళ్ల కింద.. వేలాది మంది వెంటరాగా కోలాహలంగా సాగింది. నెమలిగుంటపల్లె జరిగిన రైతన్నల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నాను. అక్కడ మునుస్వామి అనే రైతు ‘అన్నా.. నాకు పొలం ఉంది. నీళ్లూ ఉన్నాయి. అయినా బీడుపెట్టుకున్నాను’ అన్నాడు. ఆశ్చర్యంతో ‘ఎందుకన్నా?..’ అని అడిగాను. ‘ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. కష్టపడి పంట వేసినా.. గిట్టుబాటు ధరలేక పెట్టుబడులు కూడా వస్తాయో లేదోనన్న భయంతో సాగుచేసుకోలేదు’ అన్నాడు. మాట్లాడిన మిగతా రైతులు కూడా తమ ఆవేదనను, అభద్రతాభావాన్ని వ్యక్తపరిచారు. రోజురోజుకూ దిగజారుతున్న రైతన్నల పరిస్థితి ఆందోళన కలిగించింది.
సంక్రాంతి పండగ దగ్గరపడుతోంది. కానీ రైతన్నలలో ఆ కళ ఏమాత్రం కనిపించడంలేదు. సంక్రాంతి అంటేనే భోగభాగ్యాలతో, సిరిసంపదలతో, సుఖసంతోషాలతో చేసుకునే పర్వదినం. తొలి పంట ఇంటికి వచ్చి ఆనందంగా జరుపుకొనే రైతుల పండగ. జనావళికి అన్నం పెట్టే అన్నదాత ఆనందానికి మించిన పండగ ఇంకేముంటుంది? అందుకే శ్రమకు, సంపదకు గొప్ప స్థానం ఇచ్చే ఈ సంక్రాంతి పండగను సంక్రాంతి లక్ష్మి అని కూడా పిలుచుకుంటాం. కానీ ఇప్పుడు ఆ ‘ఊరంతా సంక్రాంతి.. జగమంతా క్రాంతి’ ఏమైపోతోంది? ప్రస్తుత ప్రభుత్వ వైఖరితో.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ క్రమక్రమంగా దెబ్బతింటున్న నేపథ్యంలో ‘అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి’ చందంగా పరిస్థితులు నెలకొన్నాయి.
ఆరుగాలం కష్టపడి రైతన్న పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. మార్కెట్లో మాత్రం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మన రాష్ట్రంలో దాదాపు 65 శాతం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా మన రాష్ట్రం ప్రసిద్ధి. పాలకుల దృక్పథం, వైఖరి రైతన్నల నుదిటి రాతను మార్చగలవు. వ్యవసాయాన్ని ప్రజల జీవన విధానంగా గుర్తించి ప్రోత్సహిస్తే వ్యవసాయం నిజంగా పండగే. రైతన్నలందరూ పదే పదే నాన్నగారి హయాంను స్మరించుకోవడానికి కారణం అదే. ఏం జరిగినా పాలకుడు తోడున్నాడనే ధైర్యం, వ్యవసాయం లాభసాటి వ్యాపకమన్న నమ్మకం కలిగించగలగాలి. రైతులు బాగుండాలని బలంగా కోరుకోవాలి. అంతేగానీ.. కేవలం తన స్వార్థం కోసం కొద్దిమంది తన అనుయాయుల, బినామీల బాగోగుల కోసం ఆలోచించి రైతులను బలిపీఠం ఎక్కిస్తే.. వ్యవసాయం దండగ కాక మరేమవుతుంది?
ఒక్కసారి చంద్రబాబు గారు ఆత్మావలోకనం చేసుకోవాలి. మీ హయాంలోనే సాగు విస్తీర్ణం దారుణంగా ఎందుకు తగ్గిపోతోంది? మీరు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే సహకార కర్మాగారాలు ఎందుకు మూతపడుతున్నాయి? మీ పాలనలోనే బ్యాంకులు నిర్దేశిత లక్ష్యాలకన్నా తక్కువ రుణాలను ఎందుకు మంజూరు చేస్తున్నాయి? మీ ప్రభుత్వంలోనే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు లక్షల సంఖ్యలో ఎందుకు పెండింగ్‌లో ఉంటాయి? మీ ఏలుబడిలోనే రైతుల ఆత్మహత్యలు ఎందుకు పెరిగిపోతుంటాయి?
కాపు మొండివెంగనపల్లెలో వృద్ధురాలిని పలకరిస్తున్న వైఎస్ జగన్