64వ రోజు
17–01–2018, బుధవారం
వికృతమాల,
చిత్తూరు జిల్లా.
పరిపాలించే నాయకుడు స్వార్థపరుడైతే, అవినీతిపరుడైతే.. ఒక రాష్ట్రం ఎంతగా నష్టపోతుందో, తన ఒక్కడి స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలనైనా, అమాయకుల ప్రాణాలనైనా.. ఎలా బలిపెడతారో తెలిపే ఉదంతం ఈ రోజు ఎదురైంది. తాట్నేరి క్రాస్ వద్ద మునికోటి అనే వ్యక్తి కుటుంబ సభ్యులు కలిశారు. మునికోటి ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలిసే ఉంటుంది. ప్రత్యేక హోదా కోసం 2015, ఆగస్టు 9న తిరుపతిలో ఆత్మార్పణ చేసుకున్న వ్యక్తి ఆయన. తనను తాను అగ్ని జ్వాలలకు ఆహుతి చేసుకున్న ఆ అన్న సాక్షిగా.. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని టీడీపీ పెద్ద లు హామీ ఇచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పరామర్శిం చి, ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. రెండున్నర సంవత్సరాలు దాటినా ఆ ఊసే లేదంట. రాష్ట్రానికి ఎంతో అవసరమైన ప్రత్యేక హోదా కోసం ఆత్మార్పణ చేసుకున్న మనిషి కుటుంబాని కి సాయం చేస్తామని చెప్పి, మాట తప్పడాన్ని ఏమంటారు? వంచన కన్నా మించిన పదం ఏమైనా ఉందా?
చంద్రబాబుగారు ప్రత్యేక హోదా సంజీవని అన్నారు. పది సంవత్సరాలు సరిపోదు.. పదిహేనేళ్లు కావాలన్నారు. రాష్ట్ర ప్రజల్లో, యువతలో, నిరుద్యోగుల్లో కోటి ఆశలు నింపారు. అవినీతితో సంపాదించిన డబ్బుతో ఎమ్మెల్యేలను కొంటూ.. ఓటుకు కోట్లు కేసులో ముఖ్యమంత్రిగారు సాక్ష్యాధారాలతో 2015, మేలో పట్టుబడ్డాక.. ఆ కేసు నుంచి, ఇతర అవినీతి కేసుల నుంచి బయటపడటానికి కేంద్రం ముందు పూర్తిగా సాగిలపడి, ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారు. ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవనా? అంటూ మాటమార్చారు. దీంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యారు. అది జరిగిన మూడు నెలలకే మునికోటి ఆత్మార్పణ చేసుకున్నాడు. రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబును వేలెత్తి చూపడంతో మంత్రులను, ఎమ్మెల్యేలను పంపి కంటితుడుపు పరామర్శలు జరిపించారు. రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. విషయం కాస్త మరుగునపడగానే మాట తప్పారు. హోదా కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి కుటుంబానికిచ్చే పరిహారం విషయంలో మోసం చేయడం ఒక ఎత్తయితే, ప్రత్యేక హోదా అంశాన్ని నీరుగార్చి, మునికోటి లాంటి యువకుల ప్రాణత్యాగాలకు విలువే లేకుండా చేయడం ఎంత దారుణం? మొన్నటికి మొన్న ప్రధాని దగ్గరకు పోయి కోట్లాది మంది నిరుద్యోగుల కోసం ప్రత్యేక హోదా అడుగుతారనుకుంటే.. తన అవినీతి సొమ్ముతో కొన్న ఎమ్మెల్యేలకు రాజకీయ ఉద్యోగావకాశాల కోసం.. నియోజకవర్గాలు పెంచాలని అడిగారట..వంచనలో ఆయనకు ఆయనే సాటి! తన స్వార్థం కోసం ఎవ్వరినైనా బలిపెట్టే నైజం.. పిల్లనిచ్చిన మామనైనా.. రాష్ట్ర ప్రజలనైనా.
మధ్యాహ్నం స్వర్ణముఖి వంతెన మీద చెన్నంపల్లి గ్రామానికి చెందిన యువకులు.. ఒక చేతితో వారి గ్రామ సమీపంలో ప్రవహించే వాగు నీరు, మరో చేతితో ఆ గ్రామంలో లభ్యమయ్యే తాగునీళ్లున్న బాటిళ్లను చూపించారు. గాజులమండ్యం ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలు వ్యర్థ, విషపూరిత జలాలను శుద్ధి చేయకుండా సమీపంలోని నక్కల వాగులోకి వదులుతున్నాయని, ఆ విష జలాల వల్ల దాదాపు 15 గ్రామాల ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారని, మంచి పంటలు పండే భూములు కూడా నిస్సారమవుతున్నాయని, భూగర్భ జలాలు కలుషితమై, తాగునీరు, సాగునీరు కూడా విషపూరితమవుతోందని వాపోయారు. ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండటంతో అధికారులు కూడా పట్టించుకోవడంలేదని తెలిపారు. ఇలాంటి ప్రాంతాల్లోని ప్రజలకు రక్షిత మంచినీటి సరఫరా గాలికొదిలేసి, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి చేసేది పారిశ్రామిక అభివృద్ధి ఎలా అవుతుంది? సామాన్యుల ప్రాణాలంటే అంత చులకనా? ప్రజల ప్రాణాలంటే.. విలువే లేదా?
పాపానాయుడుపేటలో బలహీనవర్గాల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మాట్లాడిన ప్రతి ఒక్కరి మాటల్లో బాబుగారి మోసాలు బహిర్గతమయ్యాయి. బాబుగారు తన రంగుల మేనిఫెస్టోలో బీసీలకు నాలుగు పేజీలు కేటాయించారు. దాదాపు 120 హామీలను కుమ్మరించారు. అందులో ఏ ఒక్కటీ నెరవేర్చిన పాపాన పోలేదు. కోట్లాదిమంది జనాన్ని నమ్మించి మోసం చేయడమంటే.. అది మామూలు మనుషులకు సాధ్యంకాని పని. కాస్త చిత్తశుద్ధి, ప్రజల పట్ల బాధ్యత ఉన్న నాయకులెవరైనా అలా చేయడం మహాపాపంగా భావిస్తారు.
చివరిగా, ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. నిజంగా మీకు ఓటుకు కోట్లు, ఇతర అవినీతి కేసుల భయం లేకపోతే.. ప్రత్యేక హోదాపై ఎందుకు మాట మార్చారు? మీ భాగస్వామ్య పక్షమైన కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదు? కృష్ణా, గోదావరి జలాలపై మన రాష్ట్ర హక్కును ఎందుకు తాకట్టుపెట్టారు? రాష్ట్ర ప్రయోజనాలను ఎందుకు కాపాడలేకపోతున్నారు?
వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్‌తో తనకున్న మూడు తరాల అనుబంధాన్ని, అభిమానాన్ని చాటుతూ జననేత కటౌట్‌ను భుజంపై మోస్తూ పాదయాత్రలో పాల్గొన్న భూమన కరుణాకర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment