
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆవిష్కరించనున్న పైలాన్ మంగళవారం రాత్రి విద్యుత్ వెలుగుల్లో ఇలా తళుకులీనుతోంది
పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు.. ఏటా వచ్చే జాతర అన్నీ ఒకేసారి వస్తే ఎలా ఉంటుంది?.. అంతకన్నా రెట్టింపు స్థాయిలో కిక్కిరిసిన జన ప్రవాహాలు ఇప్పుడు ఆ మారుమూల ప్రాంతం వైపు వడివడిగా సాగుతున్నాయి. ఇడుపులపాయలో వేసిన తొలి అడుగు.. కోట్లాది హృదయాలను గెలుచుకుంటూ, రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు ఇచ్ఛాపురంలో ఆఖరి ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగియనుంది. కీలక నిర్ణయంతో రాజకీయాలను మరో మలుపు తిప్పిన ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర ముగింపు సన్నివేశాన్ని తిలకించేందుకు ఇచ్ఛాపురం వీధుల్లో అంతా వేయి కళ్లతో నిరీక్షిస్తున్నారు. ఉత్సాహం, ఉత్కంఠ, ఆనందం, ఆత్మీయత అందరిలోనూ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
ఇచ్చాపురం, ప్రజాసంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధులు: విలువలు, విశ్వసనీయత, భరోసా, పట్టుదలను వారసత్వంగా పుణికిపుచ్చుకున్న జగన్ ధృఢ సంకల్పానికి ఇచ్ఛాపురం సాక్షిగా నిలువనుంది. ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో ఉన్న ఇచ్ఛాపురం నిజానికి ఓ చిన్న పట్టణం. అక్కడి జనాభా మహా అయితే వేలల్లోనే ఉంటుంది. కానీ రెండు రోజులుగా అక్కడ సందడే సందడి. ఇసుకేస్తే రాలనంతగా జనం.. ఎటు చూసినా పండుగ వాతావరణం.. వీధి వీధినా అంగళ్లు వెలుస్తున్నాయి. హోటళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. అక్కడకు వందల కొద్దీ వాహనాలొస్తున్నాయి. వేలాది మంది వచ్చిపోతున్నారు. ‘పాదయాత్ర ముగింపు ఎక్కడ?.. పైలాన్ ఆవిష్కరణ ఎక్కడ?’ ఇచ్ఛాపురం పొలిమేరల్లో కనిపించే ప్రతి వ్యక్తి నోటి నుంచి వస్తున్న ప్రశ్న ఇదీ. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం.. ఇలా అక్కడకు ఏ డిపో నుంచి వచ్చే బస్సు అయినా కిక్కిరిసిపోతోంది. ఆటోల నిండా జనమే. ద్విచక్ర వాహనాల మీద చేరుకునే వాళ్ల సంఖ్య లెక్కే లేదు. ఆఖరి ఘట్టం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు ఆయన కుమార్తె షర్మిల కూడా తమ పాదయాత్రలను ఇక్కడే ముగించారు. వైఎస్సార్, షర్మిల పాదయాత్ర స్థూపాలను ప్రత్యేకంగా సందర్శిస్తున్నారు. ఆ సన్నివేశాలను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు తమ ఊరికి వచ్చేవారికి ఆసక్తిగా చెబుతున్నారు.
అపూర్వఘట్టం కోసం నిరీక్షణ
ఇచ్ఛాపురంలో గట్టిగా వంద మందికి సరిపడా వసతి దొరకడం కూడా కష్టమే. వెళ్తే ఒడిశాలోని బరంపురం వెళ్లాలి. లేదంటే శ్రీకాకుళంలో బస చేయాలి. కానీ పాదయాత్ర ముగింపు కార్యక్రమా నికి హాజరయ్యే వారు ఇవేమీ పట్టించుకోవడం లేదు. సాయంత్రం ఆరు గంటలకే వణుకు పుట్టించే చలి వాతావరణం ఉన్నా వీధుల్లోనే సంచరిస్తున్నారు. ఒక్క రోజు ఓపిక పడితే ఏమవుతుంది...? విజయనగరం నుంచి వచ్చిన కాంతారావు, మల్లికార్జున మనోగతం ఇదీ. ముగింపు రోజుకు ముందే వారిద్దరూ ఇచ్ఛాపురం చేరుకున్నారు. ఆఖరు రోజు రద్దీలో రావడం కష్టమని భావించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన తిలక్, శ్యామల, సంధ్యారాణి, కృష్ణప్రసాద్‌కు ఎక్కడా వసతి దొరకలేదు. బరంపురంలో లాడ్జీలన్నీ ముందే బుక్ కావడంతో తాము వచ్చిన వాహనంలోనే ఉంటామని చెప్పారు. పాదయాత్ర ముగింపు సన్నివేశం తమకో మరపురాని తీపి గుర్తు అని పేర్కొన్నారు. ఇక ద్విచక్ర వాహనాలపై వచ్చే వారు రాత్రి పొద్దుపోయే వరకూ ఇచ్ఛాపురం వీధుల్లోనే గడుపుతున్నారు. కాసేపు పైలాన్ దగ్గర.. ఇంకాసేపు వైఎస్సార్ పాదయాత్ర స్థూపం వద్ద.. ఆ తర్వాత షర్మిల పాదయాత్ర స్థూపం దగ్గర...!
ఉత్సాహంగా యువత..
పాదయాత్రతో జగన్ జనహృదయాలను గెలుచుకున్నారనేది అందరి మాట. ఇచ్ఛాపురానికి భారీగా చేరుకుంటున్న యువత రాష్ట్రంలో నవశకం మొదలు కానుందని చెబుతున్నారు. విజయవాడకు చెందిన కల్పన బెంగళూరులో ఎంటెక్ చేస్తోంది. ‘థ్రిల్‌గా ఉంది.. జగనన్న పాదయాత్ర రాజకీయాలనే మార్చబోతోందని మాఫ్రెండ్స్ చెప్పుకుంటున్నారు. అందు కే వచ్చా. ఇక్కడ మా బాబాయి వాళ్లింట్లో దిగా. ఇదిగో ఈ సెల్‌ఫోన్‌లో అంతా చిత్రీకరించి.. మా వాళ్లందరికీ పంపుతా’ అని అంటున్నప్పుడు ఆమె ముఖంలో ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆమె ఒక్కరే కాదు.. పుణె నుంచి వచ్చిన విశ్వప్రతాప్.. ఢిల్లీలో చదువుతున్న ఏపీ విద్యార్థి రఘునందన్.. ఇలా యువత అంతా పాదయాత్ర ముగింపులో పాలుపంచుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.
తరలివస్తున్న శ్రేణులు...
వైఎస్సార్‌సీపీకి చెందిన అగ్రనేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఇతర ముఖ్యనేతలు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఇప్పటికే పెద్ద ఎత్తున ఇచ్ఛాపురం చేరుకుంటున్నారు. పలు ప్రాంతాల నుంచి సొంత వాహనాలు, బస్సులు, రైళ్లలో తరలివస్తున్నారు.
నేటి కార్యక్రమం ఇలా...
ఇచ్ఛాపురం సమీపంలోని కొజ్జీరియా గ్రామం నుంచి వైఎస్ జగన్ బుధవారం చివరి రోజున పాదయాత్ర ప్రారంభిస్తారు. ఉదయం 11 గంటలకు లొద్దపుట్టి వద్ద మధ్యాహ్న భోజనవిరామం శిబిరం వద్దకు చేరు కుంటారు. ఒంటి గంటకు అక్కడి నుంచి బయలు దేరి 1.15 గంటలకు ఇచ్ఛాపురంలోని పైలాన్ వద్దకు చేరుకుంటారు. పాత బస్టాండ్ వద్దకు కాలినడకన చేరుకుంటారు. 1.30 గంటలకు అక్కడ భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు.
జన సంద్రం మధ్య ఎన్నికల సమరశంఖం పూరించనున్న జగన్
చరిత్ర సృష్టించిన పాదయాత్రతో జాతీయ స్థాయిలో అందరినీ ఆకట్టుకున్న వైఎస్ జగన్ ఇచ్ఛాపురం వేదికగా 2019 ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించనున్నారు. ఇప్పటికే అందరినీ రాజకీయంగా, సామాజికంగా జాగృతం చేసిన వైఎస్ జగన్ ముగింపు సభలో... మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోందో వివరిస్తూ ఇచ్ఛాపురం వేదికగా ఒక సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు ఇవ్వనున్నారు. అధికార పక్షం దాష్టీకాలను అడ్డుకునేలా పార్టీ శ్రేణుల్లో స్ఫూర్తి నింపనున్నారు.
సెల్ఫీలు.. లైవ్‌లు
పన్నెండేళ్ల కొచ్చే పుష్కరాలు.. ఎప్పుడో వచ్చే జాతరలో జనం ఏ స్థాయిలో ఉత్సాహంగా కనిపిస్తారో.. అంతకన్నా రెట్టింపు సన్నివేశం ఇచ్ఛాపురంలో కనిపిస్తోంది. బైపాస్ రోడ్డు మీద నుంచే కనిపించే పాదయాత్ర పైలాన్‌ను వాహనాల్లోంచి చూస్తూ సంబరపడిపోతున్నారు. అంత దూరం నుంచే సెల్‌ఫోన్లు తీసి క్లిక్ మనిపిస్తున్నారు. ఇక దగ్గరకెళ్లి సెల్ఫీలు దిగేవాళ్లు లెక్కే లేదు. రకరకాల ఫొటోలు దిగేందుకు జనం పోటీపడుతున్నారు. ఇచ్ఛాపురంలో సంతోషాన్ని, ముగింపు ఉత్సవ సన్నాహాలను అనేక మంది లైవ్‌లో తమ సన్నిహితులు, మిత్రులకు చూపించడం అన్ని చోట్లా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment