సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన చంద్రబాబుకు ఏమాత్రం లేదని, ప్రాజెక్టుల్లో లంచాలు ఎలా తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన పరిపాలన సాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ ఆరోరోజు ఆదివారం సాయంత్రం మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరు చేరుకున్నారు. దువ్వూరులో అశేష జనవాహిని జననేత వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం పలికింది. పెద్దసంఖ్యలో తరలివచ్చిన ప్రజలు పాదయాత్రకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడారు. తనపట్ల చిక్కటి చిరునవ్వుతో ఆప్యాయత, ప్రేమాభిమానాలు చూపుతున్న ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి శిరస్సు వంచి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
- ఇక్కడికి వచ్చేటప్పుడు మన పొలాల్లో నాట్లు పడే విషయాన్ని గమనించాను
- దివంగత నేత, వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలనలో ఆగస్టు 20వ తారిఖు కల్లా కేసీ కెనాల్ ద్వారా రైతులకు నీళ్లు వదిలేవారు. ఆగస్టు కల్లా నాట్లు పడేవి.
- కానీ, ఇవాళ నవంబర్ వచ్చింది ఇప్పుడు నీళ్లు వదులుతున్నారు. ఇప్పుడిప్పుడు నాట్లు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది
- టీడీపీ నాలుగేళ్ల పరిపాలనలో ఏ ఒక్కసారైనా ఇక్కడ రెండు పంటలు పండాయా?
- రాజశేఖరరెడ్డి పరిపాలనలో ఇదే కేసీ కెనాల్ మీద రెండు పంటలు పండాయి
- ఇవాళ రైతులను, పేదలను, విద్యార్థులను, వృద్ధులను పట్టించుకునే పరిస్థితిలో ఈ చంద్రబాబు ప్రభుత్వం లేదు
- పత్తి కిలోకి రూ. 30 కూడా ధర పలకడం లేదు. ఉల్లి, టమాట, పసుపు ఇలా అన్ని పంటలకు గిట్టుబాటు ధరలేక రైతులు అవస్థలు పడుతున్నారు
- చంద్రబాబు పాలనలో ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాట ధర లభించడం లేదు
- కేవలం పేదవాని భూములు లాక్కునేందుకు.. లంచాలు పుచ్చుకొని ఎలా భూములు కంపెనీలకు కట్టబెట్టాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు కేబినెట్ మీటింగ్‌లు జరుపుతున్నారు
- రాయలసీమ ప్రాంతంలో మైనస్ శాతం వర్షపాతం లోటు నమోదైంది. రైతులు పండించిన గిట్టుబాటు ధర లేదు. రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు
- ఈ సమస్యలపై ఏనాడూ చంద్రబాబు కేబినెట్ మీటింగ్ పెట్టలేదు. చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా పనిచేస్తోంది
- కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణ కోసం రాజోలిబండ ప్రాజెక్టుకు దివంగత నేత వైఎస్సార్ తన హయాంలో రూ. 630 కోట్లతో అనుమతి ఇస్తే..
ఇవాళ చంద్రబాబు పాలనలో ఆ ప్రాజెక్టును పట్టించుకొనే దిక్కుదీవాణం లేదు. - పక్కనే శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా ఉంది
- శ్రీశైలం నిండుగా ఉన్నా మనకు నీళ్లు రావడం లేదు
- పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా రాయలసీమలోని ప్రతి ప్రాజెక్టుకు నీళ్లు అందించాలని వైఎస్సార్ కలలు కన్నారు
- ఈ ప్రాజెక్టుకు సంబంధించిన 85శాతం పనులు దివంగత నేత, నాన్నగారే పూర్తి చేశారు.
- కేవలం 15శాతం పనులు ఈ చంద్రబాబు ప్రభుత్వం తన నాలుగేళ్లకాలంలో పూర్తిచేయలేదు.
- ఏ ప్రాజెక్టును పూర్తి చేయాలనే ఆలోచనతో చంద్రబాబు పాలన సాగడం లేదు
- కేవలం ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో లంచాలు ఎలా తీసుకోవాలనే ఉద్దేశంతోనే బాబు పాలన సాగుతోంది
- చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు రైతుల రుణాలు మాఫీ కాలేదు
- చంద్రబాబు తన పాలనలో అన్ని వర్గాల వారిని మోసం చేశారు
దువ్వూరులో వైఎస్ జగన్ ప్రసంగం
Comments
Please login to add a commentAdd a comment