సాక్షి, ఏలూరు (పశ్చిమ గోదావరి) : బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్యాస్ట్ కాదని, భారతీయ సంస్కృతని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అభివర్ణించారు. బీసీలంటే వెనుకబడ్డ కులాలు కాదని.. మన జాతికి వెన్నుముకలని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన బీసీ గర్జన మహాసభలో ఆయన ఆశేష బీసీ జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘బలహీన వర్గాల అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలను చూస్తా ఉంటే.. ఈ రోజు నిజంగా కురుక్షేత్రం చివరి రోజు అన్నట్లుగా ఉంది. ఐదేళ్ల చంద్రబాబు పాలన చూశాం. మార్పులను కోరుతూ ఈ రోజు బీసీ గర్జనను నిర్వహించుకుంటున్నాం. 14 నెలలపాటు.. సుమారు 3600 కిలోమీట్లరు పైగా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశాను.
పాదయాత్ర ముందే పార్టీ బీసీ కమిటీలు వేసి రాష్ట్రం మొత్తం పర్యటించమన్నాను. ఒకవైపు నా పాదయాత్ర జరుగుతుండగా.. మరో వైపు జంగా కృష్ణమూర్తి నేతృత్వంలో బీసీ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించింది. పాదయాత్రలో ఓవైపు నేను బీసీ సమస్యలు తెలుసుకుంటుండగా.. మరోవైపు మన పార్టీ కమిటీ కూడా బీసీలందరితో మమేకమైంది. వారి సమస్యలు తెలుసుకొని అధ్యయనం చేసింది. సమస్యల పరిష్కార దిశగా అడుగులు వేసి.. నివేదికను నాకు అందజేసింది. రేపొద్దున ఆ దేవుడి ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత.. పేదవాడి జీవితంలో వెలుగులు నింపడానికి, ప్రతి బీసీ సోదరుడి ముఖంలో చిరునవ్వును చూడటానికి ఏం చేయబోతున్నామో చెప్పడానికే ఈ బీసీ గర్జనకు పిలుపునిచ్చాం.
బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్యాస్ట్‌లు కారు.. భారత దేశ కల్చర్‌ను నిలబెట్టిన గొప్పవారు. వెనుకబడ్డ కులాలు కాదు.. మన జాతికి వెన్నుముకలు. వేసుకునే దుస్తులు నుంచి తినే ఆహారం వరకు.. ఉపయోగించే పనిముట్టు.. కట్టుకునే ఇల్లు, మనం అన్నం తినే కంచం వరకు మన బట్టలకు పట్టిన మకిలిని వదిలించడం. మన జుట్టుకు సంస్కారం నేర్పిన బీసీలకు రుణపడి ఉన్నాం. మన నాగరికతను కాపాడిన వ్యక్తులు బీసీలే. బడుగులు, బలహీనులు తలెత్తుకుని నిలబడాలంటే.. మంచి చదువు, పెట్టుబడులు, అధికారంలో చోటు కావాలి. గ్రామాలల్లో ఇప్పటి తరం వారు చేసుకుంటున్న పనులు లాభసాటిగా ఉండాలి. వారు వచ్చే తరాన్నైనా ప్రపంచానికి గొప్పగా పరిచయం చేయాలి.
ఆ వాగ్ధానాలకు దిక్కేలేదు..
2014 ఎన్నికల ముందు చంద్రబాబు 119 వాగ్ధానాలతో బీసీ డిక్లరేషన్ చేశారు. ఆ డిక్లరేషన్‌కు దిక్కులేకుండా పోయింది. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామన్నారు. ప్రతి ఏడాది 10 వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్ పెడతామని హామీ ఇచ్చారు. బీసీ సబ్‌ప్లాన్ ప్రవేశపెట్టి అమలుకు చట్టం చేస్తామని హామీ ఇచ్చారు. బీసీ సబ్‌ప్లాన్ ప్రవేశపెట్టి అమలుకు చట్టం చేస్తామని హామీ ఇచ్చారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా విధానాల్లో మార్పులు తెస్తామన్నారు. వెనుకబడిన తరగతులు రిజర్వేషన్లు 33 శాతం పెంచుతామని హామీ ఇచ్చారు. 2 లక్షల 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడానికి బాబుకు మనసు రాలేదు. ఆధార్‌తో సంబంధం లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ చేస్తామన్నారు. చేనేతల అభివృద్ధికి వెయ్యి కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్ల పాలనలో ఒక్క హామీ కూడా చంద్రబాబు నెరవేర్చలేదు. ఎన్నికల నేపథ్యంలోనే చంద్రబాబు మళ్లీ బీసీ డిక్లరేషన్ అంటున్నారు. దివంగత మహానేత వైఎస్ హయాంలో 100 శాతం ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను బాబు నీరుగార్చారు. చంద్రబాబు హయాంలో ముష్టివేసినట్టు రూ. 30 వేల రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నారు. దీంతో పేదపిల్లలు చదవుకోవడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
డబ్బులు ఇవ్వడం లేదు.. కాలేజీలు పట్టాలు..
బాబు ఐదేళ్ల పాలనలో రూ. 2,200 కోట్లు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నాయి. ట్రిపుల్ ఐటీ పూర్తి చేసినా రూ. 4,500 మందికి పట్టాలు రాని పరిస్థతి ఉంది. ఇంజనీరింగ్ కాలేజీల్లోను ఇదే పరిస్థితి. ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదు.. కాలేజీలు పట్టాలు ఇవ్వడం లేదు. విద్యార్థుల పరిస్థితి అధ్వానంగా ఉంది. ప్రతి కులాన్ని మోసం చేయడంలో చంద్రబాబు పీహెచ్‌డీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని వాటిపై హామీలిచ్చి మోసం చేశారు. ప్రతికులంలోను వాళ్ల ఆకాంక్షలను రెచ్చగొట్టి మోసం చేయడం ధర్మమేనా? ఎన్నికలు వస్తున్నాయనే చంద్రబాబు బీసీలకు కార్పొరేషన్లు అంటున్నారు. తన హయాంలోకి రాని బడ్జెట్‌లో కార్పొరేషన్లకు నిధులు కేటాయించారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో కార్పొరేషన్ల ఏర్పాటు చేయలేదు. వడ్డీలకు సరిపోని విధంగా రైతులకు రుణమాఫీ ఇచ్చారు. ఎన్నికల కోసం అన్నదాత సుఖీభవ అంటున్నారు. గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఇస్తున్నారు. అమరావతిలో ఎంత మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల భూములు లాక్కున్నారు? రాజధాని పేరుతో వేల ఎకరాల బలహీన వర్గాల భూములు లాక్కున్నారు. బీసీలే వెన్నెముక అంటారు కానీ, బీసీలకు తమ పార్టీ వెన్నెముక అని చెప్పరు. చంద్రబాబు బీసీలను కరివేపాకుల్లా వాడుకుంటున్నారు. ఇద్దరు బీసీలకు హైకోర్టు జడ్జిలుగా అవకాశం వస్తే.. బీసీలు అసమర్థులని చంద్రబాబు హైకోర్టుకు నివేదిక ఇచ్చారు. తమ డిమాండ్లు పరిష్కరించమంటే తోలు తీస్తా ఖబడ్దార్ అంటారు. న్యాయం చేయమని అడిగితే తోక జాడిస్తే కత్తిరిస్తా అని బెదిరిస్తారు. బీసీలపై చంద్రబాబు నైజం ఇదే. 14 ఏళ్లు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న చంద్రబాబు వైఎస్ జగన్ చెప్పిన పథకాలను నిస్సిగ్గుగా కాపీ కొడుతున్నారు.’ అని ఐదేళ్ల పాలనలో చంద్రబాబు బీసీలను ఎలా మోసం చేశారో వైఎస్ జగన్ వివరించారు. అనంతరం తాను అధికారంలోకి వస్తే బీసీల జీవితాల్లో వెలుగునింపాడానికి చేయబోయే పనులు ఏంటో తెలియజేస్తూ బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు. (చదవండి: వైఎస్ జగన్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్)
Comments
Please login to add a commentAdd a comment