వైఎస్సార్ సీపీ అధ్యక్షులువైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలకుబాసటగా నిలిచారు. ప్రజాసంకల్పయాత్రలో ఇప్పటికే బీసీలకు ఎన్నో హామీలిచ్చారు. వెనుకబడిన తరగతుల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల అధ్యయనానికి ఇప్పటికే పార్టీ తరఫున అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదించిన అంశాల ఆధారంగా బీసీలఅభ్యున్నతికి ఏలూరు బీసీ గర్జనలో మరిన్ని వరాలు ప్రకటించనున్నారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు : బీసీలకు రాజ్యాధికారం ఇచ్చామని గొప్పలకు పోవడమే తప్ప ఇప్పటివరకు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు బీసీలకు చేసిం దేమీ లేదు. బీసీలు కులవృత్తులకు ఉపయోగించే నాసిరకం పరికరాలను అందించి చేతులు దులుపుకున్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీసీలకు సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు వారి ఆర్థికాభివృద్ధికి పెద్దపీట వేశారు. బీసీలకులవృత్తులను ప్రోత్సహించడమే కాదు.. వారికి ఉన్నత విద్య, ఉన్నత కొలువులు పొందేందుకు వీలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల సామాన్య బీసీ విద్యార్థులకు సహితం ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో చదువుకునే అవకాశం దక్కింది.
ఇప్పుడు మళ్లీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తేనే బీసీలకు మేలు జరుగుతుందన్న భావన బీసీల్లో వ్యక్తమవుతోంది. జిల్లాలో జరిగిన ప్రజా సంకల్పయాత్రలో ఆయన బీసీలకు వరాలు ప్రకటించారు. రాజమండ్రి ఎంపీ స్థానాన్ని బీసీలకే కేటాయిస్తామని చెప్పిన జగన్‌మోహన్‌రెడ్డి మాట నిలబెట్టుకుంటూ మార్గాని భరత్‌ను సమన్వయకర్తగా నియమించారు. కొల్లేరు వాసులు తమ సమస్య పరిష్కరించుకోవడానికి దోహదపడే విధంగా కొల్లేరు వాసికి ఎమ్మెల్సీ ఇస్తా నని ప్రకటించారు. బీసీ రిజర్వేషన్‌లో ఏఏ కులాలను ఏబీసీడీ గ్రూపుల్లో పెట్టాలన్న అంశంపై అధ్యయనం చేసేం దుకు సబ్ కమిటీ వేయిస్తామని ప్రకటించారు. ప్రతి కులాన్ని క్షుణ్ణంగా అ«ధ్యయనం చేసిన తర్వాతే ఆయా కులాల పరిస్థితులను బట్టి ఏబీసీడీల్లో చేర్చుతామన్నారు. నేరుగా చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కని బీసీ కులాలకు ఎమ్మెల్సీ కేటాయిస్తామని ప్రకటించారు. అన్ని బీసీ కులాలకు కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి కృషి చేస్తామని చేసిన జగన్ చేసిన ప్రకటనతో బీసీ వర్గాల్లో ఆశలు చిగురిం చాయి. అతిరాస కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
వైఎస్ హయాంలో బీసీల అభ్యున్నతికి చేసిన కార్యక్రమాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. బీసీలకు ఉన్నత విద్య, మెరుగైన ఆరోగ్యం అందుబాటులోకి తీసుకువచ్చారు. వైఎస్సార్ కులవృత్తులను ప్రోత్సహించడమే కాకుండా వారికి ఉన్నత విద్య, ఉన్నత కొలువులు పొందేందుకు వీలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకంలో ఇంజినీరింగ్, మెడికల్ వంటి అత్యున్నత చదువులకు సంబంధించి ఫీజు పూర్తిగా రీయింబర్స్‌మెంట్ జరిగేది. ఎటువంటి ఆంక్షలు ఉండేవి కాదు. వందల మంది బీసీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనే కల నెరవేరింది. తరువాత కాలంలో ఇంజినీరింగ్ కాలేజీలు, సీట్ల సంఖ్య పెరగడం వల్ల లబ్ధిపొందే బీసీ విద్యార్థుల సంఖ్య రెట్టింపయ్యింది. వైఎస్సార్ తరువాత ముఖ్యమంత్రులుగా చేసిన వారు ఈ పథకాలను కొనసాగించాల్సి రావడం వల్ల వేలాదిమంది లబ్ధిపొందారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు గ్రహణం
ప్రస్తుతం రీయింబర్స్‌మెంట్ పథకానికి చంద్రబాబు సర్కార్ గ్రహణం పట్టించింది. మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయకుండా రూ.30 వేల వరకు మాత్రమే కళాశాలలకు చెల్లిస్తోంది. మిగిలిన ఫీజును విద్యార్థులు కట్టుకోవాల్సి వస్తోంది. బీసీల ఉపకార వేతనాలను అవసరమైన స్థాయిలో పెంచింది కూడా వైఎస్సార్ మాత్రమే. బీసీ సంక్షేమ వసతిగృహాలను నిర్మించడం, ఉన్నవాటిని ఆధునికీకరించడం పెద్ద ఎత్తున సాగింది కూడా వైఎస్సార్ హయాంలోనే. ఆరోగ్యశ్రీ పథకం వల్ల ఎక్కువ లబ్ధిపొందింది కూడా బీసీలే. కొల్లేరు ప్రాంత ప్రజల నాయకుడుకి ఎమ్మెల్సీ కేటాయిస్తానంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ప్రకటన పట్ల కొల్లేరు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ హామీతో అసెంబ్లీలో కొల్లేరు ప్రజల గళం వినిపించే అవకాశం వస్తుందని వారు ఆశగా ఉన్నారు. కొల్లేరులో జిరాయితీ భూములు పేదలకు అందిస్తానని జగన్ ఇచ్చిన హామీ పట్ల కూడా కొల్లేరు వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బీసీ గర్జన ద్వారా బీసీ డిక్లరేషన్ ప్రకటించింది తద్వారా బీసీ సామాజిక వర్గీయులందరికీ ఈ సభలో జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇస్తారని బీసీలు ఆకాంక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment