
సాక్షి, అవనిగడ్డ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తిచూపుతూ, సర్కారు నిష్ఫూచీని ఎండగడుతూ ప్రచారం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను చిన్న చిన్న కథలతో ప్రజలకు అర్థమయ్యేలా విడమరిచి చెబుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాలనను ప్రస్తావించిన ఆయన, శిశుపాలుడి కథ వినిపించి ప్రజలందరినీ ఆకట్టుకున్నారు.
చంద్రబాబును చూస్తే ఒక కథ గుర్తుకు వస్తుందంటూ శిశుపాలుడు, 100 తప్పులు, ఆయన వధ ఘట్టాన్ని చాలా ఆసక్తికరంగా వివరించారు. ‘మీ అందరికీ తెలుసు శిశుపాలుడి గురించి. ఆయన 100 తప్పులు చేసే వరకు దేవుడు ఓపిక పట్టాడు. తప్పులు 101 కాగానా విష్ణుచక్రంతో ఆయన తల నరికారు. ఇప్పుడు ఆ శిశుపాలుడు నరకంలో ఉన్నాడు. ఆయన అక్కడ యముడిని ఒక ప్రశ్న అడిగాడట. నేను 100 తప్పులు చేస్తేనే నా తల నరికారు. మరి చంద్రబాబు ఇంకా చాలా తప్పులు చేశారు. ఎందరినో వెన్నుపోటు పొడిచారు. అయినా ఎందుకు వదిలిపెట్టారు? అని ప్రశ్నిస్తే యముడు ఇలా చెప్పాడట’. ‘ఈ యుగంలో విష్ణుచక్రం బదులు ఫ్యాన్ చక్రం ఉందని, అలాగే శ్రీకృష్ణుడి బదులు ఓటింగ్ యంత్రం ఉందని యముడు చెప్పాడు. దాంతో చంద్రబాబును పదవి నుంచి దింపబోతున్నారని, అదే విధంగా శ్రీకృష్ణుడి ప్రతిరూపంగా రాష్ట్ర ప్రజలున్నారని చెప్పారట. అంతే కాకుండా నరకాసురుడు, రావణాసురుడు, బకాసురుడు.. అన్నీ కలిసిన వాడే చంద్రబాబు కాబట్టి, ఆయనకు బుద్ధి చెప్పడానికి కాస్త టైమ్ పడుతుందని వివరించారట’ అని వైఎస్ జగన్ ఆ కథ చాలా ఆసక్తికరంగా వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment