అవనిగడ్డ: స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా మన రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు న్యాయం చేసి సామాజిక సాధికారత సాధించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదే అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ చెప్పారు. గురువారం కృష్ణా జిల్లా అవనిగడ్డలో జరిగిన సామాజిక సాధికార సభలో మంత్రి మాట్లాడారు. అన్ని పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.
సీఎం జగన్ ప్రభుత్వ విద్య, వైద్య రంగాలను అత్యాధునికంగా తీర్చిదిద్దుతూ పేదలకు ఉన్నతస్థాయి విద్య, వైద్యాన్ని చేరువ చేశారని చెప్పారు. ప్రతి పేద పిల్లవాడికి ఫీజుల నుంచి చదువుకోవడానికి అవసరమైన అన్ని వనరులు సీఎం జగన్ సమకూరుస్తున్నారని అన్నారు. గతంలో చంద్రబాబు ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదని, వందల కోట్లు తీసుకొని ఆయన సామాజిక వర్గానికి చెందిన వారికే పదవులు అమ్ముకున్నారని విమర్శించారు.
సీఎం జగన్ నలుగురు బీసీలను రాజ్యసభకు పంపి చరిత్ర సృష్టించారని చెప్పారు. గతంలో చంద్రబాబు బీసీల తోక కట్ చేస్తానని అన్నారని, ఎస్సీల్లో పుడతారని ఎవరు కోరుకుంటారని హీనంగా మాట్లాడారన్నారు. 2019 ఎన్నికల్లో ఆ బీసీలు, ఎస్సీలే చంద్రబాబు తోక కట్‌చేశారని చెప్పారు. కాపుల ఆరాధ్య దైవమైన వంగవీటి మోహనరంగాను పొట్టన పెట్టుకున్న చంద్రబాబుకే పవన్‌కళ్యాణ్ వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు.
పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా యాదవులకు సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేశారన్నారు. బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి పాటుపడ్డారని చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఎక్కువ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చారన్నారు. పౌష్టికాహారం సూచీలో 24వ స్థానం నుంచి 8వ స్థానానికి తెచ్చారని, పేదరికాన్ని 15 నుంచి 6 శాతానికి తగ్గించిన ఘనత కూడా సీఎం జగన్‌దే అని అన్నారు.
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ గతంలో ఎందరో మేధావులు సామాజిక న్యాయం కోసం ఎన్నో ఉద్యమాలు చేసినా సాధ్యం కాలేదని, ముఖ్యమంత్రి వైస్ జగన్ దానిని సాధ్యం చేసి చూపించారని చెప్పారు. రూ.2.40 లక్షల కోట్లు నేరుగా పేదల ఖాతాల్లో జమ చేయడం, లక్షలాది అక్క చెల్లెమ్మలకు ఇళ్ళ స్ధలాలు, నాడు – నేడు ద్వారా విద్య, వైద్య రంగాలను ఆధునికంగా తీర్చిదిద్దారని తెలిపారు. చంద్రబాబు రాజకీయాలను కలుషితం చేశారని, సీఎం జగన్ సమూలంగా ప్రక్షాళన చేసి, పేదల సంక్షేమానికి పాటుపడుతున్నారని చెప్పారు.
బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయి విద్య, అత్యాధునిక వైద్యం, అవినీతి రహిత సంక్షేమం ద్వారా పేదల ఇళ్లల్లో వెలుగులు నింపిన సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. మాజీ సీఎం చంద్రబాబు పేదల ఇళ్లలో దీపాలు ఆర్పే వ్యక్తి అని అన్నారు. చంద్రబాబు పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఎన్నో అవమానాలకు గురిచేసి, జైలుకి పంపించారని, అదే వర్గాలను సీఎం జగన్ అక్కున చేర్చుకొని, పార్లమెంట్‌కు పంపించారని చెప్పారు. పేదలకు ఇంగ్లిష్ మీడియం విద్య రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని చెప్పారు. అమరావతిలో పేదలకు ఇళ్ళ స్ధలాలు రాకుండా కోర్టుల ద్వారా అడ్డుపడిన ఘనుడు కూడా చంద్రబాబే అన్నారు. సీఎం జగన్‌కు మరోసారి అధికారం ఇస్తే ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెడతారన్నారు.
గతంలో చాలా మంది నాయకులు పేదరికాన్ని తగ్గిస్తామని మాటలే చెప్పారని, సీఎం జగన్ దానిని ఆచరణలో చేసి చూపించారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ప్రశంసించారు. సీఎం జగన్ రూ.2.40 లక్షల కోట్లు నేరుగా పేదల ఖాతాల్లో జమ చేయడం ద్వారా పేద కుటుంబాలను బలోపేతం చేశారని చెప్పారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ సామాజిక సాధికారత సాధించిన ఏకైక సీఎం జగన్ అని చెప్పారు.
కృష్ణా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవి ఓసీకి రిజర్వ్ అయినప్పటికీ, బీసీ అయిన తనకు ఆ సీటు ఇచ్చి సీఎం వైఎస్ జగన్ సామాజిక సాధికారతకు అసలైన అర్ధం చెప్పారని కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక చెప్పారు. 22ఎ నిషేధిత భూముల సమస్యను పరిష్కరించడంతో పాటు అడిగిన వెంటనే కిడ్నీ డయాలసిస్ సెంటర్‌ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రికి అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పేర్ని వెంకట్రామయ్య (నాని), కైలే అనిల్‌కుమార్, ఎమ్మెల్సీలు పోతుల సునీత, జంగా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment