రాక్షస పాలన తప్ప ఇంకేమీ ఇవ్వలేదు: వైఎస్‌ జగన్‌ | YS Jagan Slams Chandrababu Naidu In Meliaputti Public Meeting | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 24 2018 5:23 PM | Last Updated on Mon, Dec 24 2018 6:10 PM

YS Jagan Slams Chandrababu Naidu In Meliaputti Public Meeting - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : ‘ఇసుక, మట్టి, బొగ్గు, కరెంట్‌ కొనుగోళ్లు, రాజధాని భూములు, విశాఖ భూముల్లో అవినీతి అక్రమాలు, కరువు, తుపాను, ఇసుక దోపిడీ, నిరుద్యోగం.. గత నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు ఇచ్చింది ఇదే.. ఈ రాక్షస పాలన తప్ప ఇంకేమీ ఇవ్వలేదు’  అని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 330వ రోజు సోమవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా మెళియపుట్టిలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

రాష్ట్రంలో రాజకీయాలు ఏ స్థాయికి దిగజారి పోతున్నాయో.. కాంగ్రెస్‌–టీడీపీ మధ్య అనైతిక పొత్తు ఎలా సాగుతోందో రాష్ట్ర ప్రజలంతా గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి సినిమా చూపించిన చంద్రబాబు.. ఇప్పుడు రాహుల్‌తో కలిసి ‘కాంగ్రెస్‌తో సంసారం’ అనే మరో కొత్త సినిమాను ప్రజల ముందుకు తెస్తున్నారని దుయ్యబట్టారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

పరిహారాన్ని బోగస్‌ పేర్లతో.. 
‘శ్రీకాకుళం జిల్లాలో పదికి ఏడు ఎమ్మెల్యేలు ఇస్తే చాలదన్నట్లు చంద్రబాబు మరొకరిని వైఎస్సార్‌సీపీ నుంచి కొనుగోలు చేశారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో జిల్లాకు ఏం చేయలేదు. మతల పెనుగట్టవాడ నుంచి ఇసుకను భారీగా దోపిడీ చేశారు. వంశధార నిర్వాసితులకు దక్కాల్సిన పరిహారాన్ని బోగస్‌ పేర్లతో కొట్టేశారు. 9 ఏళ్లలో వంశధార ప్రాజెక్ట్‌ కట్టాలని ఏ రోజు చంద్రబాబు ఆలోచన చేయలేదు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో కాల్వ పనులను ప్రారంభించారు. రూ.700 కోట్లు ఖర్చు పెట్టి వంశధార ప్రాజెక్ట్‌ను ఉరుకులు పెట్టించారు. కేవలం రూ. 55 కోట్లు ఖర్చు పెడితే ప్రాజెక్ట్‌ పూర్తయ్యేది. కానీ చంద్రబాబు రూ.476 కోట్లకు అంచనాలు పెంచి కాంట్రాక్టర్‌గా సీఎం రమేష్‌ను తెచ్చుకున్నారు. 22 గ్రామల నిర్వాసితుల సమస్యలు తీరలేదు. 200 మంది రైతులపై కేసులు పెట్టారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే నేరేడు బ్యారేజ్‌ నిర్మాణంతో పాటు పెండింగ్‌ ప్రాజెక్ట్‌ పనులన్నీ పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నాను. హిరమండల నిర్వాసితుల కోసం ధర్నా చేసి మద్దతుగా నిలిచాను. వంశాధార ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు అండగా ఉంటాను. పెట్టిన కేసులన్నీ ఎత్తివేస్తాం, పరిహారం పూర్తిగా చెల్లిస్తాం. 

చంద్రబాబు సిగ్గుపడాలి..
జిల్లాలో ఎక్కడ చూసినా తాగునీటి సమస్య ఉంది. ఇప్పటికీ ఈ సమస్య ఉందంటే చంద్రబాబు సిగ్గుతో బాధపడాలి. పాతపట్నంలో 10 మంది డాక్టర్లు ఉండాల్సిన చోట నలుగురే ఉన్నారు. వైఎస్సార్‌ హయాంలో 28 వేల ఇళ్ల నిర్మాణం జరిగితే.. బాబు హయాంలో ఊరికి ఐదు ఇళ్లు కూడా ఇవ్వలేని అధ్వాన్నమైన పరిస్థితి. పాతపట్నంలో 20 ప్రభుత్వ స్కూళ్లను మూయించారు. తిత్లీ తుపాను ప్రభావంతో 53 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం మాత్రం తుపాను ప్రభావితంగా చూడటం లేదు. తుపాను వల్ల రూ.3,435 కోట్ల నష్టం జరిగిందని కేంద్రానికి బాబు లేఖ రాశారు. కానీ చంద్రబాబు ఖర్చు చేసింది మాత్రం 15 శాతమే. పరిహారం ఎప్పుడొస్తుందా.. అని బాధితులు ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. తుపాను జయించేశాను.. సముద్రాన్ని కంట్రోల్‌ చేశానని బాబు గొప్పలు చెబుతున్నారు.

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే బాధితులకు ప్రతి రూపాయి అందేలా చేస్తా. చంద్రబాబు చేసిన రుణమాఫి రైతుల వడ్డీకి కూడా సరిపోలేదు. గజదొంగలు వాటాలు పంచుకున్నట్లు కేబినెట్‌ మీటింగ్‌లో విశాఖ, రాజధాని భూములు ఎలా కొట్టేయాలని చర్చిస్తారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు, కొనుగోలు కేంద్రాలు తెరవరు. ఇవాళ బ్యాంకుల్లో సున్నా వడ్డీకి రుణాల్లేవు. పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మల చెవిలో పూలు పెట్టారు. నిరుద్యోగి భృతి కింద ప్రతి ఇంటికి రూ.లక్షా పదివేల బాకీ పడ్డారు. ఎన్నికలకు కేవలం 3 నెలల ముందు రూ. వెయ్యి నిరుద్యోగ భృతి ఇస్తున్నారు.

చంద్రబాబు హయాంలో అన్నీ గోవిందా.. 
బాబు వస్తే ఉద్యోగం అన్నాడు.. కానీ బాబు వచ్చాడు.. ఉన్న ఉద్యోగాలను ఊస్టింగ్‌ చేసాడు. బాబు హయాంలో గోపాల మిత్ర ఉద్యోగాలు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు, 800 మంది ఆయుష్‌ ఉద్యోగాలు, సాక్షారా భారత్‌ ఉద్యోగాలు అన్నీ గోవిందా! 85 వేల మంది మధ్యాహ్నభోజన కార్మికుల ఉద్యోగాలు పోయాయి. ఇంత దారుణంగా చంద్రబాబు పరిపాలన సాగుతోంది. పోలవరం ప్రాజెక్ట్‌లో 48 గేట్లు పెట్టాల్సి ఉంటే ఒక్క గేటు పెట్టి చంద్రబాబు బిల్డప్‌ ఇస్తున్నారు. పోలవరం డ్యామ్‌కు అవసరమైన గట్టు కట్టలేదు. ప్రాజెక్ట్‌లో ఒక్క చుక్కనీరు లేదు. ఒక్క గేటును ప్రారంభించి మనకు సినిమా చూపిస్తారు. చంద్రబాబుకు బిల్డప్‌కు ఎల్లో మీడియా వంతపాడుతోంది. ఆయన అహా అంటే ఓహో అని ప్రచారం చేస్తోంది.

రాజధాని నిర్మాణానికి ఒక్క ఇటుక పడలేదు. రాజధానిలో ఒక్క పర్మినెంట్‌ బిల్డింగ్‌ లేదు. అంతా తాత్కాలికమే. ఎన్నికలకు ముందు చంద్రబాబు రాజధాని గ్రాఫిక్స్‌ చూపించారు. నాలుగున్నరేళ్లు అయినా ఇంకా గ్రాఫిక్సే చూపిస్తున్నారు. ఆర్టీసీ ఛార్జీలు, స్కూల్‌, కాలేజీ ఫీజులు బాదుడే బాదుడు. చదువులకు రూ.లక్షల్లో ఖర్చు అవుతుంటే.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ. 30వేలు మాత్రమే ఇస్తున్నారు. బాబు పాలనలో చదువుకోవాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. ఇళ్లు, ఆస్తులు అమ్ముకుంటే తప్ప విద్యార్థి ఇంజనీర్‌ అయ్యే పరిస్థితి లేదు. ప్రతి గ్రామంలో జన్మభూమి కమిటీ పేరిట ఓ మాఫియాను తయారు చేశారు.



చేతకానప్పుడు తప్పుకోవాలి..
ఇసుక, మట్టి, బొగ్గు, కరెంట్‌ కొనుగోళ్లు, రాజధాని భూములు, విశాఖ భూముల్లో అవినీతి అక్రమాలతో చంద్రబాబు ఈ నాలుగేళ్లలో రాక్షస పాలన తప్ప ఇంకేమీ ఇవ్వలేదు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి సమాజంలో కనపడాలి. తెల్ల కాగితాల్లో కనిపించేది అభివృద్ధి ఎలా అవుతుంది. ముగ్గురు ఎంపీలను సంతలో పశువుల్లా కొనుగోలు చేశాడు. ఇద్దరిని కేంద్రమంత్రులుగా చేశాడు. ఇప్పుడు కేంద్రం న్యాయం చేయడం లేదంటు చంద్రబాబు అంటున్నారు.  20 మంది ఎంపీలతో అభివృద్ధి చేయడం చేత కానప్పుడు.. ఇక రాజకీయాల్లో చంద్రబాబు ఉండటం అనవసరం, తప్పుకోవాలి.

నాడు రాహుల్‌.. నేడు మోదీ..
చేసింది చాలదా? బతికున్నామా లేదా? అని చూడటానికి ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తున్నారా అని చంద్రబాబు అంటున్నారు. నాడు రాహుల్‌ను తిట్టినట్లే నేడు మోదీని తిడుతున్నారు. 2014లో చంద్రబాబుకు కాంగ్రెస్‌ విలన్‌.. ఇప్పుడు బీజేపీ విలన్. అప్పుడు జగన్‌కు ఓటేస్తే రాహుల్‌ గాంధీకి వేసినట్లే అన్నారు. ఇప్పుడు బీజేపీకి వేసినట్టే అంటున్నారు. బీజేపీతో విడాకులు తీసుకున్నాక చంద్రబాబు కాంగ్రెస్‌తో దోస్తీకట్టారు.’ అని చంద్రబాబు పాలనపై వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరిని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ వీళ్లెవరినీ నమ్మొద్దని ప్రజలకు సూచించారు. 25 మంది వైఎస్సార్‌సీపీ ఎంపీలను గెలిపించుకుంటే కేంద్రాన్ని మనమే శాసిస్తామని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement