చోడవరం బహిరంగ సభలో అశేష జనవాహిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న వైఎస్ జగన్
సాక్షి, చోడవరం(విశాఖ జిల్లా): ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న త్రినాథ్ మృతికి సీఎం చంద్రబాబు కారణం కాదా అని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రశ్నించారు. 251వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చోడవరం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రత్యేక హోదా కోసం 2015లో చిత్తూరు జిల్లాలో తొలి బలవన్మరణం జరిగినపుడే సీఎం చంద్రబాబు మేల్కొని ఉంటే ఇలా జరిగేదా? అప్పుడే చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వం నుంచి వైదొలుగుంటే ప్రత్యేక హోదా రాకపోయేదా?’ అని ప్రశ్నించారు. ఈ సభలో జగన్ ఇంకా ఏమన్నారంటే..
సర్వం మాయం..
‘పాదయాత్ర చేస్తుంటే ఇక్కడి ప్రజలు నాదగ్గరికి వచ్చి మా జిల్లాలో 15 నియోజకవర్గాలున్నాయన్నా.. 2014 ఎన్నికల్లో చంద్రబాబునాయుడి గారికి ఈ చోడవరం నియోజకవర్గంతో సహా 15కు 12 నియోజకవర్గాలు ఇచ్చాం. అవి చాలవని, మరో ఇద్దరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనేశారు. 14 మంది ఎమ్మెల్యేలు పక్కనే పెట్టుకున్నారు. అయినా మాకు చేసిందేమిటన్నా? అని అడుగుతున్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లో ఇక్కడి నాయకులు దేన్ని కూడా వదిలిపెట్టకుండా సర్వం దోచేస్తున్నారన్నా అని చెబుతున్నారు. బుచ్చయ్య మండలంలోని తాళ్లపుడి, పెదమదీనాలో ప్రభుత్వ భూములను వదిలిపెట్టలేదు. శెట్టిదొరపాలెంలో దళితుల భూములు కూడా వదిలిపెట్టలేదు. రోలుగుండ మండలంలో జేసీ అగ్రహారంలో 412 ఎకరాలను స్వాహా చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే యత్నిస్తున్నారు. ఇసుకను ఫ్రీగా ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారు. కానీ 2 యూనిట్ల ఇసుక రూ.16 వేలకు అమ్ముతున్నారన్నా అని నాతో ఆవేదన వ్యక్తం చేశారు.
తోటకూర పాలంలో గ్రానైట్ వదిలిపెట్టడంలేదు. అనుమతులకు మించి మైనింగ్ చేస్తుంటే లంచాలు తీసుకుని ఎమ్మెల్యే పబ్బం గడుపుతున్నాడు. నీరుచెట్టు కింద పనులు చేయకపోయినా చేసినట్లు 36 కోట్లు దోచెశారని ఇక్కడి ప్రజలకు నాతో అన్నారు. పోలియోతో బాధపడుతున్న ఆళ్ల ఆశకు పెన్షన్ కావాలంటే కోర్టుకు వెళ్లామని ఆమె కుటుంబసభ్యులు బాధపడ్డారు. పెద్దకూడు సోమనాయుడు ప్రమాదంలో రెండు చేతులు, రెండుకాళ్లు పోయినా.. ఎంపీడీవో కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తే పెన్షన్ ఇచ్చారన్నా అని నాతో చెబుతూ ఆవేదన వ్యక్తం చేశాడు.
చెరకు రైతులను ఆదుకుంటాం..
చోడవరం ఫ్యాక్టరీపై దాదాపు 20వేల మంది రైతులు ఆధారపడ్డారు. గతంలో ఇదే చంద్రబాబు పాలనలో ఈ ఫ్యాక్టరీ 45 కోట్ల నష్టాల్లోకి వెళ్లింది. ఆయన కోఆపరేటివ్ ఫ్యాక్టరీలను బతకనివ్వడు. తెలిసిన వారికి వాటిని శనక్కాయపుట్నాల్లా అంటగడుతాడు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఫ్యాక్టరీలకు పునర్వైభవం తీసుకొచ్చారు. సబ్సిడీ కూడా ఇచ్చారు. 45 కోట్ల నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీని లాభాల్లోకి తీసుకొచ్చారు. మళ్లీ బాబు సీఎం అయ్యాడు. ఆ ఫ్యాక్టరీ 100 కోట్ల నష్టాల్లోకి వెళ్లింది. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జగన్ అనే నేను మీ అందరికి విశాఖ జిల్లాలో ఉన్న అన్ని ఫ్యాక్టరీలను తెరిపిస్తానని హామీ ఇస్తున్నాను. 100 కోట్ల నష్టాల్లో ఉన్న చోడవరం ఫ్యాక్టరీకి పూర్వవైభవం తీసుకొస్తామని తెలుపుతున్నాను.
రైతులకు గిట్టుబాటు ధర..
గిట్టుబాటు ధర లేక, అప్పులు భరించలేక వ్యవసాయం మానేసే పరిస్థితి ఉందన్నా అని ఇక్కడి ప్రజలు నాతో ఆవేదన వ్యక్తం చేశారు. బెల్లం ఉత్పత్తి తగ్గిపోయింది. రైతులకు బెల్లం క్వింటాకు రూ. 2500 కూడా రావడం లేదు. అదే బెల్లం హెరిటేజ్‌లో కేజీ రూ.84కు అమ్ముతున్నారు. నర్సీపట్నం-భీమిలి రోడ్డు విస్తరణను పట్టించుకునే నాథుడే లేరు. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పరిపాలన చూశాం. రైతన్న పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతుల నుంచి ఉల్లి కేజీ రూ.4 కొని హెరిటేజ్‌లో రూ.25కు అమ్ముతున్నారు. బత్తాయి రైతు నుంచి రూ.12కు కొని హెరిటేజ్‌లో రూ.40కి అమ్ముతున్నారు. చంద్రబాబు దళారీగా వ్యవహరిస్తున్నారు. గిట్టు బాటు ధర లేక అప్పులు తీరలేక రామయ్య-వడ్రమ్మ అని దంపతులు ఆత్మహత్య చేసుకోవడం మనం చూశాం.
రెండో పెళ్లాం కోసం..
చంద్రబాబు నాలుగున్నరేళ్లుగా బీజేపీతో సంసారం చేశారు. అప్పుడు ప్రత్యేక హోదా గురించి గుర్తుకు రాలేదు. తీరా విడాకులు తీసుకుని మొదటి పెళ్లాం మంచిది కాదు అంటున్నాడు. వెంటనే రెండో పెళ్లాం కోసం పరుగెడుతున్నాడు. ఆ రెండో పెళ్లాం ఎవరో తెలుసా మన రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ. విశాఖలో మీటింగ్ పెట్టి 40 లక్షల ఉద్యోగాలు అంటాడు. ఎవరికైనా వచ్చాయా అని అడుగుతున్నా? ధర్మపోరాటం అని డ్రామాలు ఆడుతుంటే ఈ రాష్ట్రంలో ధర్మం, న్యాయం బతికుందా అని అడుగుతున్నా? చివరకు గుడి భూముల్ని సైతం చంద్రబాబు వదలట్లేదు. బాబు పాలనలో విద్యార్థుల ఫీజులు విచ్చలవిడిగా పెరిగాయి. బాబు బినామీ కాలేజీల్లో ఇంటర్ చదవాలంటే ఏడాదికి లక్షా ఆరవై వేలు కావాలి. ప్రభుత్వం స్కూళ్లను దగ్గరుండి నిర్వీర్యం చేస్తున్నారు. 20వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదు.
ఫీజులు తగ్గిస్తాం..
మనందరి ప్రభుత్వం వచ్చాక స్కూల్, కాలేజీ ఫీజులు తగ్గిస్తానని హామీ ఇస్తున్నా. ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ ఇంగ్లీష్ మీడియం చేస్తాం. అన్ని ప్రభుత్వ పాఠశాలలను తెరిపిస్తాం. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేశారు. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు ఫీజులు అడ్డగోలుగా పెంచేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇటీవల జ్వరాలతో 200 మంది మృతి చెందారు. ఆరోగ్య పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోది. మంత్రి యనమల పంటినొప్పి వస్తే సింగపూర్ వెళ్తారు. అదే పేదవాడు వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్తే ఆరోగ్యశ్రీ కట్ చేస్తారు. విజయవాడలో ఇద్దరు బాలింతలకు ఒకే మంచడం ఉండటంతో ఒకరు కిందపడి మృతి చెందారు. ఈ ఘటనతో రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. ఇలా సమస్యలతో సతమతమవుతున్న రాష్ట్రం వైపు ఒకసారి చూడండి. నాలుగున్నరేళ్లు అయింది. మరో ఆరునెలల్లో ఎన్నికలు వస్తాయి. గుండెల మీద చేయివేసుకొని ఎలాంటినాయకుడు కావాలో ఆలోచించమని కోరుతున్నా. అబద్దాలు చెప్పే నాయకులు కావాలా అని అడుగుతున్నా(వద్దు వద్దు ప్రజల నుంచి), మోసాలు చేసే వారు కావాలా? మీ మనస్సాక్షి చెప్పినట్లు ఓటేయండి’ అని వైఎస్ జగన్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment