
సాక్షి, అనంతపురం : ప్రతీ కులాన్ని మోసం చేయటమే లక్ష్యంగా చంద్రబాబు పాలన కొనసాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె సమీపంలో నిర్వహించిన బీసీ సదస్సులో ఆయన శనివారం ప్రసంగించారు. నాలుగేళ్ల చంద్రబాబు నాయుడు పాలనలో జరిగిన అన్యాయం, బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకే ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించినట్లు వైఎస్ జగన్ చెప్పారు.
బాబు నాలుగేళ్ల పాలనలో ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా? అని వైఎస్ జగన్ ప్రశ్నించగా.. ప్రజల నుంచి లేదు అన్న సమాధానం వినిపించింది. కులాలను మార్చే అధికారం రాష్ట్రాలకు లేదని.. కానీ, ప్రతీ కులాన్ని ఎలా మోసం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు మ్యానిఫెస్టో పెట్టారని, అందుకు ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తున్న పరిస్థితులే నిదర్శనమని వైఎస్ జగన్ చెప్పారు. కురుమలను ఎస్టీల్లో చేరుస్తానని , బోయలను ఎస్టీల్లో చేరుస్తానని మూడుసార్లు తీర్మానం చేశారని, రజకులను ఎస్సీలుగా మారుస్తానని చంద్రబాబు చెప్పారని.. కానీ, ఆ హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని వైఎస్ జగన్ తెలిపారు.
ఇంకా వైఎస్ జగన్ ఏం చెప్పారంటే...
ఎన్నికల హామీని చంద్రబాబు అమలు చెయ్యరు. అధికారంలోకి వచ్చాక కూడా ఇది కేంద్రం పని అని తప్పించుకుంటున్నారు. సినిమాల్లోని విలన్ల కన్నా దారుణంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను ఇంతవరకు ఏ టీడీపీ నేత కూడా పరామర్శించలేదు. లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణం ఇస్తామని ప్రకటించారు కానీ, అది నెరవేర్చలేదు. బాబు సీఎం అయ్యాక రుణమాఫీ ఎలా ఉన్నా.. ప్రతీ నెలా వచ్చే సబ్సిడీ కూడా చేనేత కార్మికులకు అందటం లేదు' అని అన్నారు. నాలుగు కత్తెర్లు, నాలుగు ఐరెన్ బాక్సులిచ్చి బీసీలపై ప్రేమ ఉందంటే ఎలా?
ఇచ్చింది లేదు.. సచ్చింది లేదు.. అయినా అటు నుంచి వచ్చేసింది అన్నచందాన చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నారు. ఓవైపులు కేక్ కట్ చేయంటారు. మరోవైపు ధర్నాలు చేయమంటారు. అలాంటప్పుడు వాళ్లు చేసింది ఏంటి?. బీసీల అభివృద్ధి అంటే వారిని పేదరికంలోని ఎలా బయటకు తీసుకురావాలి.. వారి అభివృద్ధికి ఏమేం చేయాలో ఆలోచించాలి. ఆ పని చేసి చూపించిన ఏకైక వ్యక్తి ఒక్క దివంగత నేత వైఎస్సార్ మాత్రమే. ఆయన హయాంలో చదువుల విప్లవం వచ్చింది. ఇంజనీర్లు, డాక్టర్లు అయిన వాళ్లు ఇప్పుడు ఆ మహానేతను గుర్తు చేసుకుంటున్నారు.
కానీ, వైఎస్సార్ మరణం తర్వాత పరిస్థితి తిరగబడింది. బాబు పాలనలో ఉచిత విద్య లేదు. పేదలకు ఆరోగ్య సేవలు దూరం అయ్యాయి. 108, ఆరోగ్యశ్రీలు నిర్వీర్యం అయ్యాయి. చంద్రబాబు కంటే నేను చిన్నవాడినే కావొచ్చు కానీ, ఆయనలా మోసం చెయ్యను. కులాల అభివృద్ధి కోసం కచ్ఛితంగా కృష్టి చేస్తాను. ప్రజలకు మేలు చేసేందుకే నవరత్నాలు తీసుకొచ్చాను. పేదరికం దూరం చేసేందుకు నాన్న ఒక్క అడుగు ముందుకు వేస్తే.. నేను రెండు అడుగులు ముందుకేస్తా. నవరత్నాల పథకం ద్వారా ప్రతీ చిన్నారి చదువుకుంటారు.
ప్రతీ తల్లి ఖాతాలో ఏటా 15 వేలు ఇస్తాం. చదువుల కోసం అప్పుల చేసే అవసరం లేకుండా ప్రతీ బీసీ కుటుంబానికి అండగా ఉంటా. పని చేసే శక్తి కోల్పోయిన వాడు ఆకలితో అలమటించకూడదు. బాబు పాలనపై మనకు మనమే ప్రశ్నించుకోవాలని తరుణం వచ్చింది అని జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఆయన బీసీ సంఘాలతో ముఖాముఖి కొనసాగించారు. ఈ సందర్భంగా వారి సమస్యలు విన్న సానుకూలంగా స్పందించారు. ‘‘అనంతపురం జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో జరిగిన తప్పిదం పునరావృతం కాబోదు. వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో కనీసం ఒక ఎంపీ స్థానం బీసీలకే కేటాయిస్తాం. విభజన తర్వాత అన్యాయం జరిగిన కులాలకు అండగా ఉంటాం’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment