
సాక్షి, అనంతపురం : దేవుడి దయ, ప్రజల అండతో త్వరలో మన ప్రభుత్వం రాబోతుందని.. అధికారంలోకి రాగానే అన్నివర్గాల వారికి న్యాయం జరిగేలా చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పాదయాత్ర చేపట్టిన ఆయన రావులచెరువులో మహిళలను, బత్తులపల్లిలో వృద్ధులను ఆప్యాయంగా పలకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబుకు మానవత్వం, విశ్వసనీయత లేవని.. అన్ని వర్గాల ప్రజలను దారుణంగా మోసం చేసిందని చెప్పారు. రేషన్ కార్డు, పింఛన్ సమస్యలను పలువురు మహిళలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం నుంచి లబ్ధిపథకాలు ఏవీ సరిగ్గా అందటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలను టీడీపీ వాళ్లకే అందిస్తున్నారని.. ఉద్యోగాలపై పశ్నించినందుకు తనపై కేసు పెట్టారని ఓ ఆశావర్కర్ ఆవేదన చెందారు.
దీనికి స్పందించిన ఆయన కాస్త ఓపిక పట్టండని.. మన ప్రభుత్వం వచ్చాక తప్పక న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. అన్ని అర్హతలు ఉన్నా ఫించన్ రాకపోవటం ఏంటని.. ఈ విషయంపై కలెక్టర్‌కు లేఖ రాస్తానని ఆయన చెప్పారు. ‘‘మనందరి ప్రభుత్వం వస్తుంది. ప్రతీ ఒక్కరికీ న్యాయం చేస్తుంది. గ్రామంలోనే సెక్రటేరియట్ నెలకొల్పుతాం. గ్రామానికి చెందిన పది మందికి ఉద్యోగాలు ఇస్తాం. అడిగిన 72 గంటల్లోనే పెన్షన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్‌మెంట్, అన్ని సేవలు అందేలా చూస్తాం. రాజకీయాలు, కులమతాలకతీతకంగా ప్రజలకు సేవలను అందిస్తాం. వృద్ధులకు రెండువేల ఫించన్, వికలాంగులకు మూడు వేల రూపాయలు అందిస్తాం. మన ప్రభుత్వంలో నవరత్నాలు అమలు చేస్తాం. ప్రతి ఒక్కరికి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే నా కోరిక’’ అని వైఎస్ జగన్ తెలిపారు.
బెదిరింపులను లెక్కచేయని అనంతవాసులు
జననేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు విశేష స్పందన వస్తోంది. జననేత వస్తున్నాడని తెలుసుకున్న జనం ఎదురెళ్లి స్వాగతం పలుకుతున్నారు. వేరు వేరు గ్రామాల నుంచి కూడా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి రాజన్న బిడ్డకు తమ సమస్యలు చెప్పుకొని స్వాంతన పొందుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ వైఎస్ జగన్‌తో పాటు అడుగు కలుపుతున్నారు. మరోవైపు రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతుండటంతో అధికార పార్టీలో కలవరం మొదలైంది.
యాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తుండటంతో దిక్కుతోచని సర్కారు పెద్దలు నిఘా వర్గాలను రంగంలోకి దింపారు. జనం ఎందుకిలా వస్తున్నారంటూ ఆరా తీశారు. తమ పట్ల ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతోందన్న నివేదికలు అందుకుని ఆందోళనలో పడ్డారు. పాదయాత్రకు వెళ్లొద్దని ఆ పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ జనం లెక్కచేయక తండోప తండాలుగా తరలిరావడం గమనార్హం. గత నెల 6వ తేదీన వైఎస్ జగన్ ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. వైఎస్సార్ జిల్లా, కర్నూలు జిల్లాలు పూర్తి చేసుకొని ప్రస్తుతం అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలో కొనసాగుతోంది. ఇప్పటికే పాదయాత్ర 500 కిలోమీటర్లు దాటింది.
Comments
Please login to add a commentAdd a comment