ఆ తీర్పుపై పునఃసమీక్షకు సుప్రీంను కోరండి | YS Jagan Wrote a letter to President and Prime Minister | Sakshi
Sakshi News home page

ఆ తీర్పుపై పునఃసమీక్షకు సుప్రీంను కోరండి

Published Tue, Apr 3 2018 2:23 AM | Last Updated on Wed, Jul 25 2018 5:35 PM

YS Jagan Wrote a letter to President and Prime Minister - Sakshi

సాక్షి, అమరావతి : ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసులు నమోదైన నిందితులను అరెస్టు చేయడం తప్పనిసరి కాదంటూ గత నెల 20వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేయాలని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సోమవారం వేర్వేరుగా లేఖలు రాశా రు. డాక్టర్‌ సుభాష్‌ కాశీనాథ్‌ మహాజన్‌ వర్సెస్‌ మహారాష్ట్ర ప్రభుత్వం, ఏఎన్‌ఆర్‌ కేసులో తాజా గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం స్ఫూర్తిని నీరుగార్చే విధంగా ఉందని వైఎస్సార్‌ సీపీ బలంగా విశ్వసిస్తున్నట్లు ఆ లేఖల్లో జగన్‌ పేర్కొన్నారు. రాష్ట్రపతి, ప్రధానికి జగన్‌ రాసిన లేఖల్లోని సారాంశమిదీ... 

నిందితులు తప్పించుకునే అవకాశం ఉంది 
‘ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం–1989 కింద కేసులు నమోదైన నిందితులెవరినీ తక్షణమే అరెస్టు చేయరాదు. సంబంధిత నియామక అధికారి అనుమతిస్తేనే ఈ కేసులో నిందితులైన ప్రజా సేవకులు / ఉద్యోగులను అరెస్టు చేయాల్సి ఉంటుంది. పోలీసు సూపరింటెండెంటు అనుమతించిన తర్వాతే ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం కింద నిందితులను అరెస్టు చేయాలి. ఈ విషయంలో తగిన కారణాలను రికార్డ్‌ చేయాలి. తదుపరి విచారణ సమయంలో మేజిస్ట్రేట్‌ ఈ కారణాలను తప్పనిసరిగా పరిశీలించాలి’అంటూ గత నెల 20వ తేదీన సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం మీకు విదితమే. ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం స్ఫూర్తిని దెబ్బతీసేలా ఈ తీర్పు ఉందని వైఎస్సార్‌సీపీ ప్రగాఢంగా విశ్వసిస్తోంది. నిందితుని అరెస్టును అడ్డుకోవడం, దుర్భలుడైన బాధితుని కంటే బలవంతుడైన నిందితునికి ప్రయోజనం చేకూరుస్తుంది. అంతేకాక, తదుపరి దర్యాప్తునకు సైతం అవరోధం కలిగిస్తుంది. అంతేకాక, సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ, ఎస్టీ కేసుల్లో అరెస్ట్‌ నుంచి నిందితులకు రక్షణ కల్పించినట్లుంది. ఇది అణగారిన వర్గాల హక్కులకు సంరక్షకుడిగా న్యాయస్థానం ఉందన్న తిరుగులేని నమ్మకాన్ని తగ్గించేదిగా ఉంది. 

వేధింపులు లేని రోజు లేదు... 
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలపై వేధింపులు లేకుండా ఒక్క రోజు కూడా గడవటం లేదనేది కాదనలేని సత్యం. ఈ పరిస్థితుల్లో అత్యంత ముఖ్యమైన ఈ చట్టాన్ని నీరుగార్చడం వల్ల ఎస్సీ, ఎస్టీల మనోస్థైర్యం దెబ్బతింటుంది. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా ఇప్పటికీ సమాజంలో ఎస్సీ, ఎస్టీలు అత్యంత అణచివేతకు గురవుతున్నారు. వివిధ రంగాల్లో అభివృద్ధికి నోచుకోక నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు. సమానావకాశాలకు నోచుకోక, విద్యలో వెనుకబడి పౌష్టికాహార లోపంతో దుర్భర స్థితిలో అల్లాడుతున్నారు.  

కుల రహిత సమాజమే లక్ష్యం...
కుల రహిత సమాజ స్థాపనే మన రాజ్యాంగ లక్ష్యం. అది నెరవేరే వరకూ ప్రభుత్వం అణగారిన వర్గాలకు సమానావకాశాలు కల్పించాలి. ఈ పరిస్థితుల్లో అతి ముఖ్యమైన ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం – 1989ని బలహీన పరచడాన్ని మనం ఏమాత్రం అనుమతించరాదని వినయపూర్వకంగా కోరుతున్నా. అందువల్ల ఈ తీర్పుపై పునఃసమీక్ష కోసం సుప్రీంకోర్టుకు ప్రతిపాదించాలని కోరుతున్నా’అని వైఎస్‌ జగన్‌ రాష్ట్రపతి, ప్రధానికి రాసిన లేఖల్లో పేర్కొన్నారు.  

ప్రజాప్రతినిధులే ఇలా అవమానిస్తుంటే?
40 ఏళ్లుగా ప్రజాజీవితంలో (రాజకీయాల్లో) కొనసాగుతూ అత్యంత అభివృద్ధి చెందుతున్న ఒక రాష్ట్రానికి 13 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు లాంటి వారే ఎస్సీ, ఎస్టీలను కించపరిచేలా మాట్లాడుతున్నారు. ‘ఎవరు మాత్రం ఎస్సీల్లో పుట్టాలని కోరుకుంటారు?’అని ఎస్సీ, ఎస్టీల గురించి చంద్రబాబు మాట్లాడారు. ‘ఎస్సీలకు శుచి, శుభ్రత ఉండదు. చూడటానికి అసహ్యంగా ఉంటారు. హుందాగా బతకటం తెలియదు.. ’అంటూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి సైతం ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పాలకులు ఇలా ఫ్యూడల్‌ మనస్తత్వాన్ని ప్రదర్శిస్తూ దళితులను అణచివేస్తున్నారు. దళితుల పట్ల ప్రజాజీవనంలో ఉండే వారి మనస్తత్వమే ఇలా ఉంటే ఇతరుల మైండ్‌సెట్‌ ఎలా ఉంటుందో ఆలోచించండి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement