‘‘ఇక్కడ ఒకవైపు అబ్బయ్య చౌదరి ఉన్నాడు... చదువుకున్న యువకుడు. మీకు సేవ చేయాలని కోరుకుంటున్నాడు. ఇంకోవైపు చింతమనేని ప్రభాకర్ ఉన్నాడు. మహిళలను గౌరవించని క్రూరుడు, దుర్మార్గుడు. మహిళా ఎమ్మార్వో వనజాక్షిని జుట్టు పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లడం మీరంతా చూసే ఉంటారు. ఆయన మనిషా లేక పశువా? ఆయన తల్లి, భార్య మహిళలు కాదా? ఆయనకు అక్కచెల్లెళ్లు లేరా? మహిళ అని కూడా చూడకుండా ఇంత అవమానించే వ్యక్తి మృగం కాదా? ఇసుక నుంచి మద్యం వరకు, కొల్లేరులో కమీషన్లు కొట్టేయడం వరకు దుర్మార్గపు పనులన్నీ చేశారు. మీలో ఒక్కరైనా చింతమనేని ప్రభాకర్ మంచి వ్యక్తి. ఈ మంచిపని చేశాడని చెప్పగలరా? అలాంటి దుర్మార్గుడు అసెంబ్లీకి వెళ్లేందుకు అర్హుడా? ఐదేళ్లు ప్రజలను హింసించి దోచుకుతిన్నాడు. మీకు ఇదే అవకాశం .. ఈ ఎన్నికలే ఆయుధం. బెదిరింపులకు భయపడొద్దు. ఆయనకు బుద్ధి వచ్చేలా, డిపాజిట్లు కూడా రాకుండా జన్మంతా గుర్తుంచుకునేలా ఓడించండి. ఓటుతో తీర్పు చెప్పండి. చింతమనేనికి మళ్లీ సీటు ఇచ్చాడంటే చంద్రబాబు ఎంత దుర్మార్గుడో అర్థం చేసుకోండి’’
– విజయరాయి సభలో షర్మిల
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సాహంతోనే దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రెచ్చిపోతున్నారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పేర్కొన్నారు. ఓ మహిళా అధికారిని రోడ్డుపై జుట్టు పట్టుకుని ఈడ్చేసిన వ్యక్తికి మళ్లీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన చంద్రబాబు ఇంకెంత దుర్మార్గుడో ఆలోచించాలని ప్రజలను కోరారు. పోగాలం దాపురించిన చింతమనేని బెదిరింపులకు భయపడకుండా ఈ ఎన్నికలలో ఓటుతో గట్టి గుణపాఠం నేర్పాలని పిలుపునిచ్చారు. బస్సు యాత్ర నిర్వహిస్తున్న షర్మిల బుధవారం పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పర్యటించారు. దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం నడిపల్లిలో కొల్లేరు ప్రజలు, మహిళలు, మత్స్యకారులతో సమావేశమై వారి బాధలు విన్నారు. విజయరాయి, కలిదిండి, పెడనలో ఎన్నికల ప్రచార సభల్లో భారీగా హాజరైన ప్రజలనుద్దేశించి షర్మిల మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
ఎంగిలి చెయ్యి విదిలిస్తున్నారు
‘వైఎస్సార్ ఐదేళ్లు మాత్రమే పాలించినా ఒక్క రూపాయి కూడా పన్ను పెంచకుండా, అందరికీ మేలు చేసిన ఘనత ఆయన సొంతం. ఒక ముఖ్యమంత్రి ప్రజలకు ఎలా ద్రోహం చేయకూడదో ఈ ఐదేళ్లలో చంద్రబాబు మనకు చూపించారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అంటూ వంచించాడు. పసుపు– కుంకుమ అంటూ ఇప్పుడు ఎంగిలి చెయ్యి విదిలిస్తున్నారు.
ఆ డబ్బంతా మింగలేదా?
ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారు. పిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. అనుభవజ్ఞుడినంటూ, రాజధాని కట్టేస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ అయినా కట్టారా? కేంద్రం రూ.2,500 కోట్లు ఇస్తే ఒక్క ఫ్లైఓవర్ కూడా కట్టలేదు. మరి ఆ డబ్బంతా ఏం చేసినట్లు.. మింగేసినట్లు కాదా? బాబు వస్తే జాబు వస్తుందన్నారు. జయంతికి, వర్థంతికి కూడా తేడా తెలియని పప్పు లోకేష్‌కు ఏకంగా 3 మంత్రి పదవులు ఇచ్చారు. యువతకు మాత్రం ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు.
బాబు వల్లే ప్రత్యేక హోదా రాలేదు
ఇవాళ రాష్ట్రానికి హోదా రాలేదంటే చంద్రబాబే కారణం. బీజేపీతో కుమ్మక్కై కమీషన్ల కోసం ప్యాకేజీకి ఒప్పకున్నారు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు.. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు. ఇలా రోజుకో మాట, పూటకో వేషం. అందుకే రెండు వేళ్లు చూపిస్తుంటారు. చంద్రబాబు ప్రత్యేక హోదాను నీరుగార్చడానికి చేయని ప్రయత్నం లేదు. హోదా కోసం జగనన్న చేయని పోరాటం లేదు.
ఐదేళ్లుగా పప్పు కోసమే పని చేశారా?
జగన్‌కు పౌరుషం ఉందా? అంటూ చంద్రబాబు ఆయనకు సరిపడని మాటలు మాట్లాడుతున్నారు. హరికృష్ణ మృతదేహం పక్కనే ఉందన్న కనీస ఇంగితం కూడా లేకుండా టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నించాడు. పిల్లి గట్టిగా అరిస్తే పులి కాలేదు. ఓదార్పు అనే ఒక్క మాట కోసం జగనన్న కాంగ్రెస్‌ను వీడి ఒంటరిగా బయటకు వచ్చారు. అదీ పౌరుషం అంటే.
బాకీలు తీర్చమని నిలదీయండి..
గత ఎన్నికల్లో 600కిపైగా హామీలిచ్చిన చంద్రబాబు ఒక్కటీ నిలబెట్టుకోలేదు. ముందు పాత హామీలను నెరవేర్చి బకాయిలతో సహా డబ్బులు చెల్లించమని నిలదీయండి. అది మీ హక్కు. జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వండి. అంతా బైబై బాబు... అంటూ ప్రజాతీర్పు చెప్పండి’’
‘‘పొరపాటునైనా టీడీపీకి ఓటేస్తే మన ఉరి మనం వేసుకున్నట్లే...’’ అని లోకేష్ స్వయంగా చెప్పాడు. ‘‘బంధుప్రీతి, మతపిచ్చి, కులపిచ్చి ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీనే..’’ అని కూడా లోకేషే అన్నాడు.
– కలిదిండి సభలో షర్మిల
నేడు ప్రత్తిపాడు, జగ్గంపేటలలో వైఎస్ విజయమ్మ ప్రచారం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గురువారం తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు, జగ్గంపేట శాసనసభా నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.
ఉండి, ఉంగుటూరు, గోపాలపురం, నిడదవోలులో షర్మిల ప్రచారం
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సోదరి షర్మిల గురువారం పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి, ఉంగుటూరు, గోపాలపురం, నిడదవోలు శాసనసభా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment