
సాక్షి, పెదకూరపాడు (గుంటూరు) : సీఎం చంద్రబాబు నాయుడు, పీఎం నరేంద్ర మోదీ కలిసి రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను ఎగ్గొట్టారని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ సోదరి షర్మిల మండిపడ్డారు. బస్సు యాత్రలో భాగంగా ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎన్నికల ప్రచారసభలో ఆమె ప్రసంగించారు. ఐదేళ్లలో అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారని, డ్రాక్రా మహిళలకు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదన్నారు. ఎన్నికలు వస్తున్నాయని పసుపు-కుంకుమ అంటూ.. మరోసారి చంద్రబాబు మోసం చేయలనుకుంటున్నారని, ఎవరు మోసపోవద్దని షర్మిల ప్రజలకు సూచించారు. ఆరోగ్యశ్రీ అటకెక్కించిన చంద్రబాబు.. పేదవాడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని చెబుతున్నారని, ఆయన కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ఏ ఆస్పత్రికి వెళ్తారని ప్రశ్నించారు. బాబు వస్తే జాబు వస్తుందన్నారని, ఆయన కొడుక్కి మాత్రమే జాబు వచ్చిందని విమర్శించారు. పప్పుకు వర్థంతికి జయంతికి తేడా తెలియదని, ఏ అర్హత ఉందని 3 శాఖలకు మంత్రిని చేశారని ప్రశ్నించారు. మాములు ప్రజలకు ఉద్యోగాల్లేవని, ఉద్యోగ నోటిఫికేషన్లు వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా అన్నారని, తర్వాత ప్యాకేజని, ఇప్పుడు హోదా అంటున్నారని ధ్వజమెత్తారు.
చంద్రబాబుది రోజుకో మాట.. పూటకో వేషమని దుయ్యబట్టారు. ఆడపిల్ల పుడితే రూ. 25 వేలు, మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఇస్తానన్నారని, ఇచ్చారా? అని అడిగారు. చంద్రబాబును చూసి ఊసరవెళ్లి కూడా సిగ్గుతో పారిపోతుందని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఎవరితోను పొత్తు అవసరం లేదన్నారు. చంద్రబాబు 600 హామీలిచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. డ్రాక్రా మహిళలకు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదని, పసుపు-కుంకుమ పేరుతో మరోసారి మోసం చేయడానికి బాబు సిద్ధమయ్యారన్నారు. మీ భవిష్యత్ తన బాధ్యతని దొంగబాబు చెబుతున్నారని, ఆయన మాటలు నమ్మవద్దని కోరారు. ఈ ఎన్నికలు మన పిల్లల భవిష్యత్, ఏపీ అభివృద్ధికి కీలకమని, జగనన్నకు ఓటేసి రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందామని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment