సాక్షి, గుంటూరు : అమ్మకు అన్నం పెట్టడు గానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్న చందంగా.. ఐదేళ్లుగా ప్రజలను పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు మరోసారి దగా చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సోదరి షర్మిల ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఎంగిలి చెయ్యి విదిలిస్తే సరిపోదని.. అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబుకు ఓటుతో బుద్ధి చెప్పాలని విఙ్ఞప్తి చేశారు. శుక్రవారం నుంచి బస్సు యాత్ర ప్రారంభించిన షర్మిల శనివారం గుంటూరు సిటీలో జరిగిన ప్రచార ఎన్నికల సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా తమకు ఏ పార్టీతోనూ పొత్తులు లేవని.. సింహం సింగిల్‌గానే వస్తుందని స్పష్టం చేశారు. ఒక్కసారి రాజన్నను మనసులో తలచుకుని ఫ్యాను గుర్తుకు ఓటేయాలని కోరారు. మాట తప్పని వాడు మడప తిప్పని నాయకుడు కావాలంటే జగనన్నను సీఎం చేయాలని విఙ్ఞప్తి చేశారు. తమ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి షేక్ మహమ్మద్ ముస్తఫా(గుంటూరు ఈస్ట్), ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విన్నవించారు.
హామీలు ఏమయ్యాయి బాబూ?
‘ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో చంద్రబాబు 600 హామీలు ఇచ్చారు. దాంట్లో ఒక్కటైనా నెరవేర్చారా. కాబట్టి ప్రతిఒక్కరూ చంద్రబాబును నిలదీయండి. అది మీ హక్కు. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా వేస్తామని చెప్పి ఈ ఐదేళ్లలో ఒక్కరికైనా ఇచ్చారా? ఫీజు రీయింబర్స్‌మెంట్ చేశారా. మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చారా. విద్యార్థులకు ఐపాడ్లు ఇచ్చారా? లేదు. ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి అని చెప్పి వంచించారు. ఐదేళ్లలో నెలకు రూ.2 వేల ప్రకారం రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ దాదాపు రూ.1.25 లక్షలు చొప్పున చంద్రబాబు బాకీ పడ్డారు. ప్రతి పేదవాడికి మూడు సెంట్ల భూమి, పక్కా ఇళ్లు అన్నారు. ఎక్కడైనా కట్టించారా? చేనేతల మరమగ్గాలకు పూర్తి రుణమాఫీ అన్నారు. ఎన్నికలు పూర్తయ్యేలోపు బాకీ పడ్డ ఇవన్నీ మాకు ఇవ్వండి అని బాబును నిలదీయండి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక చేనేత కార్మికులకు రూ.3 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం. మగ్గమున్న ప్రతి ఇంటికి నెలకు రూ.2 వేలు ఇస్తాం. 45 ఏళ్లు నిండిన చేనేతన్నలకు ఇంటికి ఇద్దరి చొప్పున రూ.2 వేల పెన్షన్ ఇస్తాం’ అని వైఎస్ షర్మిల పునరుద్ఘాటించారు.
అందుకే చంద్రబాబు నిజం చెప్పరు
వైఎస్ షర్మిల ఇంకా మాట్లాడుతూ... ‘ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జగనన్న ఢిల్లీలో ధర్నాలు చేశారు. రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశారు. బంద్‌లు, రాస్తారోకోలు, ధర్నాలు, మానవహారాలు, కొవ్వొత్తుల ర్యాలీలు.. ఇలా ఈ ఐదేళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసం కూడా పెట్టారు. రాజీనామాలూ చేశారు. జగనన్న యువభేరి పేరిట యువతను జాగృతం చేశారు. ఆయనే గనుక ఊరురా తిరిగి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయకపోతే చంద్రబాబు నోట నుంచి ప్రత్యేక హోదా అనే మాట వచ్చి ఉండేదా? హోదా వద్దు.. ప్యాకేజీ కావాలన్న చంద్రబాబును యూటర్న్ తీసుకునేలా చేసింది జగనన్న కాదా? ఈ విషయాల గురించి చంద్రబాబు నిజం చెప్పాలి. కానీ ఆయన చెప్పరు. చంద్రబాబు నైజం గురించి నాన్న గారు ఒకమాట చెప్పేవారు.. ఎప్పుడైతే చంద్రబాబు నిజం చెబుతారో అప్పుడు ఆయన తల వేయి ముక్కలవుతుందట. పాపం అందుకే ఆయన ఎప్పుడూ అబద్ధాలే చెబుతుంటారు’ అని ఎద్దేవా చేశారు.
ఇలాంటి సీఎం అవసరమా?
వైఎస్ షర్మిల ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది కేవలం చంద్రబాబు గారి కొడుకు లోకేష్‌కు వచ్చింది. ఈ పప్పు గారికి కనీసం జయంతికి, వర్ధంతికి తేడా కూడా తెలియదు. అటువంటి వ్యక్తి ఒకటి కాదు రెండు ఏకంగా మూడు శాఖలకు మంత్రి అయి కూర్చున్నారు. అఆలు రావు గానీ అగ్ర తాంబూలం నాకే కావాలన్నాడట ఎవరో. పప్పు తీరు కూడా అలాగే ఉంది. ఒక్క ఎన్నికలో కూడా గెలవని పప్పుకు ఏ అర్హత ఉందని చంద్రాబాబు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఇది పుత్ర వాత్సల్యం కాదా. సీఎం కొడుకుకు మూడు జాబులు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల్లేవు. కనీసం నోటిఫికేషన్లు కూడా లేవు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా’ అని ప్రశ్నించారు.
శవరాజకీయాలు చేసింది ఆయనే
నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసి ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధపడ్డారు. ఓటుకు కోట్లు కేసులో ఆడియో, వీడియో టేపులతో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. ఆ కేసుకు భయపడే హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారు. ఆ రోజు నుంచి 3 నెలల క్రితం వరకు కేసీఆర్‌తో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. హరికృష్ణ శవం సాక్షిగా కేసీఆర్‌తో పొత్తు ప్రయత్నాలు చేసింది నిజం కాదా? టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం ప్రయత్నించిన చంద్రబాబు సిగ్గు లేకుండా వైఎస్సార్‌సీపీపై ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబును చూస్తే ఊసరవెళ్లి కూడా సిగ్గుతో చచ్చిపోతుంది. మాకు కేసీఆర్, బీజేపీ, కాంగ్రెస్.. ఎవరితోనూ పొత్తు లేదు. సింహం సింగిల్‌గానే వస్తుంది. వైఎస్సార్‌సీపీ బంపర్ మెజార్టీతో గెలుస్తుందని దేశంలోని సర్వేలన్నీ చెబుతున్నాయి అని షర్మిల పేర్కొన్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
రాజన్న బిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వండి
‘ఎన్నికల్లో ఓటేసే ముందు ప్రజలంతా ఒక్కసారి ఆలోచించాలి. ఒకవైపు తండ్రి లాంటి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ పార్టీని కబ్జా చేసిన వ్యక్తి బాబు. ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడుకుని పక్కన పడేసిన చంద్రబాబు ఎలాంటి వ్యక్తో ఆలోచించాలి. గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. జగనన్న తొమ్మిదేళ్లు విలువలతో కూడిన రాజకీయాలు చేశారు. కాంగ్రెస్‌ను వీడితే కేసులు పెడతారని అనాడే తెలుసు. జగనన్న అవినీతే చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీని వీడేవాడా? ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఈ తొమ్మిదేళ్లు ఎన్నో కష్టాలు పడుతూ వైఎస్సార్‌సీపీని సగర్వంగా నడిపించారు. 3,648 కి.మీ. పాదయాత్ర ద్వారా కోట్లాది మంది కష్టాలను తెలుసుకున్నారు. నాన్నలా కులాలకు, వర్గాలకు అతీతంగా అందరికీ మేలు చేద్దామని కోరుకుంటున్నాడు. రాజన్న బిడ్డ జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వండి.మాట తప్పని మడమ తిప్పని నాయకుడు కావాలంటే అంతా ఆలోచించి ఓటేయాలి. రాజన్న బిడ్డగా మీకు సేవ చేసిన నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను’ అని షర్మిల విఙ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment