సాక్షి, హైదరాబాద్ : ‘కుట్రలు, కుతంత్రాలతో జగన్ బాబుపై అక్రమ కేసులు బనాయించి... నానా ఇబ్బందులు పెట్టి, జైలుకు పంపించినప్పుడే నా బిడ్డ భయపడలేదు. నా కొడుకు ఎవరికీ భయపడడు, ఎవరి కాళ్లు మొక్కడు. ఎవరితో పొత్తు పెట్టుకోడు. ప్రజలతోనే అనుబంధం...మీతోనే నా బిడ్డ పొత్తు పెట్టుకుంటాడు.’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం విజయనగరం జిల్లా గజపతి నగరం రోడ్ షోలో చంద్రబాబు నాయుడును ఆమె తూర్పారబట్టారు.
‘తాను అనుకున్నది సాధించడానికి చంద్రబాబు ఏమైనా చేస్తాడు. ఎంతకైనా తెగిస్తాడు. బెదిరిస్తాడు. మాట వినకుంటే ఏదైనా చేస్తాడు. అలాంటిది ‘మీ భవిష్యత్ నా బాధ్యత’ ’ అని చెబుతున్న చంద్రబాబు మిమ్మల్ని ఏవిధంగా కాపాడతాడు. 17 కేసుల్లో స్టే తెచ్చుకుని మేనేజ్ చేస్తున్న ఆయన...జగన్ బాబుపై 31 కేసులు ఉన్నాయంటూ ఆరోపణలు చేస్తున్నారు. నేను అడుగుతున్నా ఆ కేసులు పెట్టింది ఎవరు? మీరు కాదా?. జగన్ బాబు తనపై పెట్టిన అక్రమ కేసులపై పోరాడుతున్నాడు. మీరే చెప్పండి ఎవరికి నిజాయితీ ఉంది. తమ్ముళ్లు నన్ను రక్షించండి.. నా చుట్టు ఉండండి... ‘మీ భవిష్యత్ నా బాధ్యత’ అని చెప్పుకుంటున్న చంద్రబాబుకు భయం పట్టుకుంది. అందుకే తాను చేసిన అభివృద్ధి గురించి చెప్పకుండా...ప్రతిపక్షంతో పాటు ఎదుటి వ్యక్తులపై బురద చల్లుతున్నాడు.
కేసీఆర్‌కు మనకు ఏంటి సంబంధం..
మన రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏం సంబంధం. ఆయన ఏమైనా ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా? లేక వైఎస్సార్ సీపీ ఏమైనా పొత్తు పెట్టుకుందా?. మరి ఎందుకు కేసీఆర్‌ను ఓడించండి అంటూ చంద్రాబాబు ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. తన స్వలాభం కోసం చంద్రబాబు ఇంతగా దిగజారిపోవాలా?. ఆయన బీజేపీలో ఉన్నప్పుడు తల్లి కాంగ్రెస్-పిల్ల కాంగ్రెస్ అన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పక్షాన చేరి...బీజేపీ, టీఆర్‌ఎస్‌తో వైఎస్సార్ సీపీ పొత్తు పెట్టుకుందని మాట్లాడుతున్నాడు. జగన్ ఎవరితో పొత్తు పెట్టుకోడు. ఎవరి కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం లేదు. జగన్ ప్రజలతోనే అనుబంధం పెట్టుకుంటాడు. ఈ విజయనగరం జిల్లా అంటే రాజశేఖర్ రెడ్డి గారికి విపరీతమైన ప్రేమ.. ఎందుకంటే ఇది కూడా రాయలసీమలా వెనుకబడిన ప్రాంతం...
తోటపల్లి నీరు పూర్తిగా రైతులకు అందడం లేదని, జంఝావతి రబ్బరు డ్యాం కట్టి రైతులకు త్వరగా నీరిచ్చే ప్రయత్నం చేశారు. తన తండ్రిలాగానే రాజశేఖర్ రెడ్డిలాగేనే జగన్ కూడా ప్రజలకు మంచి పాలన అందిస్తాడు. మళ్లీ రాజన్న రాజ్యం తెచ్చేందుకు ‘నవరత్నాలు’ పథకాన్ని ప్రతి ఇంటికి అందేలా జగన్ చేస్తాడు. మీరు గొప్పగా చెప్పుకునేలా పని చేస్తాడు. మరి చంద్రబాబు ఈ అయిదేళ్ల పాలనలో ఏం చేశారు. విజయనగరం మెడికల్ కాలేజీ వచ్చిందా?. గజపతినగరం నూరు పడకల ఆసుపత్రి వచ్చిందా?. గోస్తని, చంపావతి నదుల అనుసంధానం చేస్తామన్నారు... చేశారా?. మరి మీ నియోజకవర్గంలో చంద్రబాబు ఏం చేశారు.
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?. చంద్రబాబు తరహాలోనే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కేఎ నాయుడు ఇసుక దోచుకున్నారు. ఉద్యోగాలు కూడా అమ్ముకుంటున్నారు. నాకు అనుభవం ఉందని చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. ఆరువందలు హామీలు ఇచ్చారు. ఒక్కటైనా మవనెరవేర్చలేదు. రాజశేఖర్ రెడ్డి అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందిస్తే, చంద్రబాబు వాళ్ల కార్యకర్తల సంక్షేమం తప్ప మరేదీ చూడలేదు.’ అంటూ వైఎస్ విజయమ్మ తీవ్రస్థాయిలో చంద్రబాబుపై ధ్వజమెత్తారు. వైఎస్సార్ పాలన మళ్లీ వచ్చేందుకు ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని వైఎస్ విజయమ్మకోరారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స అప్పలనరసయ్య, ఎంపీ అభ్యర్ధి బెల్లాన చంద్రశేఖర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment