శ్రీకాకుళం అంటే వైఎస్సార్‌కు చాలా ఇష్టం: విజయమ్మ | YS Vijayamma Speech At Srikakulam challavani peta Election Rally | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం అంటే వైఎస్సార్‌కు చాలా ఇష్టం: విజయమ్మ

Published Sun, Mar 31 2019 5:24 PM | Last Updated on Sun, Mar 31 2019 7:27 PM

YS Vijayamma Speech At Srikakulam challavani peta Election Rally - Sakshi

సాక్షి, నరసన్నపేట: శ్రీకాకుళం జిల్లా అంటే దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి చాలా ఇష్టమని, వైఎస్సార్‌తోపాటు జగన్‌, షర్మిల పాదయాత్రలు ఈ జిల్లాలోనే ముగించిన విషయాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ గుర్తు చేశారు. వైఎస్సార్‌, జగన్‌, షర్మిల పాదయాత్రలు చరిత్రాత్మకమని ఆమె అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం చల్లవానిపేటలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో వైఎస్‌ విజయమ్మ ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ దివంగత మహానేత వైఎస్సార్‌ పాలనను గుర్తుచేసుకోవాలని ప్రజలను కోరారు.

ప్రజలతో తమ కుటుంబానికి 40 ఏళ్ల అనుబంధముందని, వైఎస్‌ కుటుంబం ఎప్పటికీ ప్రజలకు రుణపడి ఉంటుందని ఆమె అన్నారు.  వైఎస్సార్‌ ఆశయాల సాధన కోసమే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పుట్టిందనే విషయాన్ని మరోసారి ఆమె గుర్తు చేశారు. వైఎస్‌ మరణం తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్ర చేపడతానని ప్రజలకు మాట ఇచ్చారని, ఇచ్చిన మాట కోసం ఆయన కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకు వచ్చారని విజయమ్మ అన్నారు. కాంగ్రెస్‌ నుంచి బయటకు రావడంతో కక్షగట్టి వైఎస్‌ జగన్‌పై కేసులు పెట్టారని, జగన్‌ను ఎన్నో ఇబ్బందులు పెట్టినా ఆయన జనం మధ్యలోనే ఉన్నారని అన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్‌ జగన్‌ అనేక దీక్షలు, పోరాటాలు చేపట్టిన విషయాన్ని విజయమ్మ గుర్తుచేశారు.

మా కుటుంబం మీద అనేక విమర్శలు చేస్తున్నారని, కానీ ఎన్ని మాటలు అన్నా తాము మౌనంగానే భరిస్తూనే ఉన్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలంతా తమ కుటుంబమనే తాను ప్రజల ముందుకు వచ్చానని తెలిపారు. వైఎస్సార్‌ ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క చార్జీ పెరగలేదని, ప్రజలపై భారం పడకుండా జనసంక్షేమ పాలన అందించిన రికార్డు వైఎస్సార్‌ది అని ఆమె పేర్కొన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రైతులు అప్పుల్లో కూరుకుపోయారని, అధికారంలోకి వచ్చాక రైతుల రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి చంద్రబాబు అన్నదాతలను నట్టేట ముంచారని ఆమె పేర్కొన్నారు. పసుపు-కుంకుమ పేరుతో చంద్రబాబు కొత్త డ్రామా మొదలుపెట్టారని విమర్శించారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్య శ్రీ పథకాలను చంద్రబాబు నిర్వీర్యం చేశారని, చంద్రబాబు పాలనలో 108, 104 సేవలు మరుగునపడ్డాయని అన్నారు.

చంద్రబాబు పాలనంతా అన్యాయాలు, అక్రమాలు, మోసాలేనని, మట్టి నుంచి ఇసుక వరకు అన్నింటా అవినీతేనని, చివరకు దేవుడి భూములను కూడా వదలడం లేదని విమర్శించారు. నవరత్నాలతో వైఎస్‌ జగన్‌ అందరి జీవితాల్లో వెలుగులు నింపుతారని, మాట ఇస్తే మడమతిప్పని కుటుంబం తమదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో విలువలకు, విశ్వసనీయతకు పట్టం కట్టాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement