భూమన కరుణాకర్ రెడ్డి
సాక్షి, తిరుపతి: రాజకీయ నాయకులంటే ఏసీ గదుల్లో కాదు.. ప్రజల మధ్య, ప్రజలతో ఉండాలని నిరూపించిన మహానేత పాదయాత్ర దేశ రాజకీయ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగినదని వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చరిత్రాత్మక పాదయాత్రను ప్రారంభించి నేటికి సరిగ్గా 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని గుర్తుచేస్తూ.. మళ్లీ రాజన్న పాలన రావాలంటే ఒక్క జగనన్నతోనే సాధ్యమని పేర్కొన్నారు. సోమవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘15 ఏళ్ల కిందట రాజశేఖర్ రెడ్డిగారి పాదయాత్ర.. నాటి చంద్రబాబు పాలనపై దండయాత్రలా, జైత్రయాత్రలా సాగింది. బలి మీద వామనుడి పాదంలా పాపాల బాబు ప్రభుత్వంపై వైఎస్సార్ పాదం మోపారు. అప్పటికి చిరిగిన విస్తరిలా ఉన్న కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ పాదయాత్ర ద్వారానే కోలకుని, అధికారంలోకి వచ్చింది. 1475 కిలోమీటర్లపాటు సాగిన ఆ పాదయాత్రలో మహానేతతో కలిసి నడవటం నా అదృష్టం. ఆయన ముఖ్యమంత్రి అయితేనే మా సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు నమ్మారు. భూమిపై నడిచే దేవునిలా రాజశేఖర్ రెడ్డిని ప్రజలు కొలిచారు. అందుకే ఆయన మరణాన్ని తట్టుకోలేక గుండెలు మూగబోయాయి. మళ్లీ రాజన్న రాజ్యం రావలంటే వైఎస్ జగన్ ఒక్కరి వల్లే సాధ్యం అవుతుంది’’ అని భూమన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment