సాక్షి, అమరావతి : గుంటూరు, శ్రీకాకుళం లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రకటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఈ రెండు స్థానాల్లో పూర్తి ఓట్లను లెక్కించకుండానే రిటర్నింగ్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఫలితాలను ప్రకటించారని ఆ పార్టీ నేతలు చెప్పారు. ఈ రెండు నియోజకవర్గాల్లో స్వల్ప మెజారిటీతో టీడీపీ అభ్యర్థులు గెలిచినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపులో సరైన నిబంధనలు పాటించకుండా అధికారులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించారని గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. మోదుగులపై టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ 4205 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో గెలుపొందారు. ఈ స్థానంలో దాదాపు 9700 పైచిలుకు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించకుండా తిరస్కరించడంతో ఫలితం తారుమారైందని, అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. మొత్తం నమోదైన 14 వేలకు పైచిలుకు పోస్టల్ బ్యాలెట్లలో 4600 పైచిలుకు ఓట్లను మాత్రమే లెక్కించగా, వాటిల్లో మోదుగులకు దాదాపు 3 వేలు, గల్లాకు 12 వందలపైచిలుకు వచ్చాయి. మరో 9700 ఓట్లను తిరస్కరించారు.
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఫారమ్ 13 (ఎ) ద్వారా నమోదు చేసిన పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి 13 (బి) నంబర్ ను కవర్ పైన వేయలేదన్న సాకుతో ఆఓట్లను తిరస్కరించారని, ఇందుకు జిల్లా ఎన్నికల అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుందని మోదుగుల చెప్పారు. రాజ్యాంగం కల్పించిన హక్కు మేరకు ఎన్నికల విధుల్లో నమగ్నమయ్యే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి తీసుకోవలసిన జాగ్రత్తలన్నింటిపైనా తగిన తర్ఫీదు ఇవ్వడంతో పాటు మొత్తం బాధ్యత ఎన్నికల అధికారిదేనని వివరించారు. ఎన్నికల అధికారి తన బాధ్యతలను నిర్వర్తించకుండా పోస్టల్ బ్యాలెట్లను ఏకపకంగా తిరస్కరించడానికి వీలులేదని, ఇది ఓటర్లకు ఉన్న హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. పైగా ఈ రకంగా 9700 ఓట్లను తిరస్కరించారని, మెజారిటీ తక్కువగా వచ్చిన సందర్భాల్లో ఇలాంటి ఓట్లను మళ్లీ మళ్లీ లెక్కించాలని నిబంధనలు, సుప్రీంకోర్టు, హైకోర్టు రూలింగ్స్ ఉన్నాయని ఆయన గుర్తుచేశారు.
మొత్తం ఓట్లను లెక్కించకుండా ఎన్నికల జర్నల్స్ కు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై హైకోర్టును ఆశ్రయించనున్నట్టు మోదుగుల చెప్పారు. గుంటూరు లోక్‌సభ స్థానంతో పాటు శ్రీకాకుళం నియోజకవర్గంలోనూ ఇదే తరహా చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తెచ్చారు. పార్టీ సీనియర్ నేతలతో సమాలోచనలు జరిపారు. ఈ అంశంపై హైకోర్టులో రిట్ దాఖలు చేయాలని నిర్ణయించినట్టు మోదుగుల మీడియాతో చెప్పారు.
గుంటూరు లోక్‌సభ పరిధిలో..
గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాలరెడ్డి ప్రత్యర్థి గల్లా జయదేవ్ కంటే 4,205 ఓట్లు తక్కువగా వచ్చాయి. గుంటూరు లోక్‌సభ పరిధిలో సుమారు 9,700 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లనివిగా కౌంటింగ్ అధికారులు తేల్చి పక్కన పడేశారు. అందుకు కవర్‌పై 13–సీ నంబరు లేకపోవడమే కారణంగా చెబుతున్నారు. కవర్‌లో ఉన్న పోస్టల్ బ్యాలెట్‌లో తప్పులు లేనప్పుడు అవి లెక్కించాలంటూ మోదుగుల అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ లెక్కింపు రోజున అధికారులు అంగీకరించలేదు.
శ్రీకాకుళం లోక్‌సభ పరిధిలో..
శ్రీకాకుళం సిట్టింగ్ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కేవలం 6,658 ఓట్ల స్వల్ప మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై గెలుపొందారు. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఇచ్ఛాపురం, టెక్కలిలో మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం మీద స్వల్ప మెజార్టీతో రామ్మోహన్ నాయుడు గట్టెక్కారు. ఇక పలు చోట్ల అసెంబ్లీ నియోజక వర్గాల్లో సైతం పోస్టల్ బ్యాలెట్లు జారీ చేసిన ఉద్యోగులు చేసిన పొరపాట్లు వల్ల అవి చెల్లుబాటు కాకుండా పోయాయి.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
శ్రీకాకుళం గుంటూరు ఎంపీ ఎన్నికలపై కోర్టుకెళ్లనున్న వైఎస్‌ఆర్‌సీపీ
Comments
Please login to add a commentAdd a comment