‘చంద్రబాబు కరివేపాకులా వాడుకున్నారు’ | YSRCP BC Cell President Janga Krishna Murthy Slams Chandrababu In Eluru | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు కరివేపాకులా వాడుకున్నారు’

Published Fri, Feb 15 2019 7:28 PM | Last Updated on Fri, Feb 15 2019 10:40 PM

YSRCP BC Cell President Janga Krishna Murthy Slams Chandrababu In Eluru - Sakshi

ఏలూరు(పశ్చిమ గోదావరి జిల్లా): అధ్యయన కమిటీ ద్వారా బీసీల కష్టాలు తెలుసుకున్న మొదటి పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనని వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు జంగా కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. ఈ నెల 17న ఏలూరులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరగనున్న బీసీ గర్జన బహిరంగ సభా ప్రాంగణాన్ని జంగా కృష్ణమూర్తితో పాటు, మాజీ మంత్రి నరిసే గౌడ్‌, ఏలూరు పార్లమెంటు బీసీ సెల్‌ కన్వీనర్‌ ఘంటా ప్రసాద రావు తదితరులు పరిశీలించారు. అనంతరం జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ఒక్క వైఎస్సార్‌సీపీ తప్ప బీసీల సమస్యలను తెలుసుకోవడానికి అధ్యయన కమిటీ వేసిన పార్టీలు లేవని అన్నారు.

బీసీ వర్గాలను రాజకీయ పార్టీలు ఓట్లయంత్రాల్లాగా వాడుకుంటున్నారే తప్ప బీసీ కులాల అభివృద్ధికి పాటుపడింది లేదన్నారు. పార్లమెంటు స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయిలో బీసీల జీవనవిధానం స్థితిగతులపై తమ కమిటీ అధ్యయనం చేసిందని పేర్కొన్నారు. బీసీలను చంద్రబాబు కరివేపాకులా వాడుకున్నారని విమర్శించారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సుపరిపాలనను సాగించడానికే జగన్‌ పాదయాత్ర చేపట్టి క్షేత్రస్థాయిలో అందరి సమస్యలను తెలుసుకున్నారని అన్నారు. అధ్యయన కమిటీ ఇచ్చిన సలహాలను పరిగణనలోకి తీసుకుని వైఎస్‌ జగన్‌ డిక్లరేషన్‌ చేస్తారని చెప్పారు.

జడ్జీలుగా బీసీలు పనిరారని లేఖ రాసి బీసీలను చంద్రబాబు అవమానించారని విమర్శలు సంధించారు. బీసీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ , కులవృత్తులను ప్రోత్సహించడానికి, పారిశ్రామికవేత్తలను తయారుచేయడానికి డిక్లరేషన్‌ ఉండబోతోందని అన్నారు. సంచార జాతుల అభివృద్ధికి వారి జీవన స్థితిగతులు మార్చే విధంగా బీసీ డిక్లరేషన్‌ ఉంటుందని తెలిపారు. జీతాలు పెంచాలని అడిగిన నాయీ బ్రాహ్మణులను చంద్రబాబు తాట తీస్తానన్నారు.. అదీ ఆయనకు బీసీలపై ఉన్న ప్రేమ అని మండిపడ్డారు.

గతంలో 9 ఏళ్లు.. ఇప్పుడు ఐదేళ్లు ఏం చేశావ్‌: మాజీ మంత్ర నరిసే గౌడ్‌
గతంలొ 9 ఏళ్లు, ఇప్పుడు ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు బీసీలకు ఏం చేశారని ప్రశ్నించారు. బీసీలకు భరోసా కావాలని, అది వైఎస్‌ జగన్‌ ద్వారా మాత్రమే వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. బీసీ గర్జన మహాసభ ద్వారా వైఎస్‌ జగన్‌ ఎన్నికల సమర శంఖారావానికి శ్రీకారం చుడతారని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement