సాక్షి, అనంతపురం: కేంద్రరాష్ట్రాల వంచనపై అనంతపురం గర్జించింది. నాలుగేళ్లపాలనలో ప్రభుత్వాలు చేసిన మోసాన్ని వైఎస్సార్ సీపీ నేతలు ఎండగట్టారు. అదే సమయంలో హోదా ఆకాంక్షను ఎలుగెత్తిచాటారు. వైఎస్ జగన్ నాయకత్వంలో హోదా సాధించితీరుతామని స్పష్టంచేశారు. బీజేపీ, టీడీపీల వంచనపై వైఎస్సార్ సీపీ చేపట్టిన గర్జన దీక్ష విజయవంతమైంది. దీక్షా వేదిక అయిన అనంతపురం ఆర్ట్స్ కాలేజీ మైదానం హోదా నినాదంతో మార్మోగింది. ఈ కార్యక్రమానికి పార్టీశ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రభుత్వాల మోసపూరిత వైఖరికి నిరసనగా వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు నల్లదుస్తులు ధరించి దీక్షకు హాజరయ్యారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు.. నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు చేసిన మోసాలను నేతలంతా ఎండగట్టారు. ప్రత్యేకహోదా ఆకాంక్షను ఎలుగెత్తిచాటారు. హోదా సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తామని చెప్పారు.
హోదాకు కాకుండా ప్యాకేజీకి ఎందుకు అంగీకరించారు?
ప్రత్యేక హోదా విషయంలో నరేంద్రమోదీ, చంద్రబాబు ఏ1 ఏ2 ముద్దాయిలని వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. హోదా వల్లే పరిశ్రమలు వస్తాయని అన్నారు. ఏపీ విభజన చట్టం హామీల అమల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ చేసిన ఉద్యమాలను చంద్రబాబు కావాలని అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదాకు కాకుండా ప్యాకేజీకి ఎందుకు అంగీకరించారని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ఏపీ విభజన చట్టం హామీల అమల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయన్నారు. ప్రత్యేక హోదా కోసమే ఎంపీ పదవులకు తాము రాజీనామాలు చేస్తే, చంద్రబాబు వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రయోజనాల కోసమే పదవులను వదులుకున్నామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ వైఎస్సార్ సీపీ పొత్తు పెట్టుకోదని తేల్చిచెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్ సీపీ విజయం ఖాయమని వ్యాఖ్యానించారు. ఏపీలో 150 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో జగన్‌దే జయం అని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు తెలివిగల మోసకారి అని, వచ్చే ఎన్నికల్లో ఓటర్లను డబ్బుతో కొనాలని చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు డబ్బు ఇస్తే తీసుకోండి.. కానీ ఓటు మాత్రం వైఎస్సార్ సీపీకే వేయాలని అభ్యర్థించారు.
ఆయన రాజకీయ చరిత్రంతా దుర్మార్గాలే!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడు, దగాకోరని.. ఆయన 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అంతా దుర్మార్గాలకు నిదర్శనమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. నాలుగేళ్లుగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిజాయితీగా పోరాటం కొనసాగిస్తున్నారని చెప్పారు. ఒక్కరోజు కూడా చంద్రబాబు ప్రజల గురించి పోరాడలేదని.. అంతటితో ఆగకుండా హోదా కోసం ఉద్యమం చేసిన వాళ్లను జైళ్లో పెట్టించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందంటూ ఎద్దేవా చేశారు.
ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర విభజన చట్టంలోని హామీల సాధన విషయంలో చంద్రబాబు మోసపూరిత వైఖరి, కేంద్ర ప్రభుత్వ అలసత్వానికి నిరసనగా తలపెట్టిన ‘వంచనపై గర్జన’ దీక్షలో భూమన మాట్లాడారు. 2014 ఎన్నికల్లో టీడీపీని గెలిపించి తప్పు చేశామని ప్రజలు బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఎవరైతే హోదా ఇస్తారో.. వారికే తమ మద్దతు ఉంటుందని వైఎస్ జగన్ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రత్యేక హోదా విశిష్టతను చాటిచెప్పిన ధీరుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్సార్ ఆశయాలే వైఎస్సార్‌సీపీ సిద్ధాంతాలని భూమన వివరించారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసమే!
రాష్ట్ర ప్రయోజనాల కోసమే మమల్నిరాజీనామ చేయాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించారని మాజీ ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర విభజన చట్టంలోని హామీల సాధన విషయంలో చంద్రబాబు మోసపూరిత వైఖరి, కేంద్ర ప్రభుత్వ అలసత్వానికి నిరసనగా తలపెట్టిన ‘వంచనపై గర్జన’ దీక్షలో మిథున్ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు సిగ్గు లేకుండా మరో అవకాశం ఇవ్వాలని ప్రజలను అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో బాబు విఫలమయ్యారని ఆరోపించారు. రుణమాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేశారన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం మరిన్ని పోరాటాలు చేస్తామన్నారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామ చేయడం గర్వంగా ఉందని విథున్ రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. అశోక్ బాబు తీరు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుందని దూషించారు. ఉద్యోగులు, పెన్షనర్ల సొమ్ముపై చంద్రబాబు కన్ను పడిందని ఆయన అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన రూ.200 కోట్లను అమరావతికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment