
సాక్షి, వైఎస్సార్ జిల్లా : రాజకీయ అస్తిత్వం లేని చంద్రబాబు వల్ల రాష్ట్ర రాజకీయాలు కలుషితమయ్యాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు చెప్తున్న అభివృద్ధి అంతా అబద్దమని తేల్చి చెప్పారు. కేవలం కమీషన్ల కోసమే చంద్రబాబు మదిలో రాజధాని ఆలోచన వచ్చిందని విమర్శించారు. అమరావతి ప్రాంతంలో భూములు కేవలం ఒక సామాజికవర్గానికే కట్టబెట్టారని ఆరోపించారు. చంద్రబాబు పాలనంతా అవినీతి, అక్రమాల కంపు అని... ఆయన అవినీతి హిమాలయాలంత అని ఘాటుగా విమర్శించారు. ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉండడంతో పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.
మరోవైపు ‘నాడు మోదీని తిట్టి నేడు ఆయన కాళ్లు పట్టుకునేందుకు ఆపసోపాలు పడుతున్నాడు. రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపి కాళ్లబేరానికి దిగాడు. గతంలో చేసిన పాపాలకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు. చంద్రబాబు, పవన్‌లు బీజేపీని ఎందుకు విమర్శించరు? అధికారంలో ఉన్నా, లేకున్నా టీడీపీ, జనసేన మా పార్టీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాయి. ఎంత మంది అడ్డుపడినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారు. ఎన్ని సమస్యలు వచ్చినా అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తార’ని రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment