
రాబోయే ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్ధితులు లేకుండా..
సాక్షి, పశ్చిమగోదావరి : రాష్ట్రంలో అక్రమ పాలన, పోలీసు రాజ్యం నడుస్తోందని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ దెందులూరు సమన్వయకర్త కొఠారు అబ్బయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారమిక్కడ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... ఎమ్మెల్యే చెవిరెడ్డిని అరెస్టు చేయడం దారుణమన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్ధితులు లేకుండా భయభ్రాంతులకి గురిచేయాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలి..
ఏపీలో జరుగుతున్న అరాచకాలపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలని అబ్బయ్య చౌదరి ఈసీకి విఙ్ఞప్తి చేశారు. కొందరు పోలీసు అధికారులు పచ్చనేతలకు కొమ్ముకాస్తున్నారంటూ మండిపడ్డారు. అవినీతికి పాల్పడుతున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్ సీపీని గెలిపించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.