సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ధర్మపోరాట దీక్ష ప్రదేశాన్ని శుద్ది చేసేందుకు వెళుతున్న ఎంపీ విజయసాయి రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం దారుణం. పోలీసులను చంద్రబాబు తన జేబు సంస్ధగా చేసుకున్నారు. ఇది ప్రజాస్వామ్య విరుద్దం. మరోవైపు తిరుమల పోటులో తవ్వకాలపై విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలపై ప్రభుత్వం స్పందించి విచారణ జరపాలి. సీబీఐ విచారణకు చంద్రబాబు ఎందుకు వెనకాడుతున్నారు. జనాలను బలవంతంగా తోలుకు వచ్చి ధర్మపోరాట సభను నిర్వహించారు. తిరుపతి, నెల్లూరు, అమరావతిలో ప్రధాని ప్రసంగాన్ని ఈ సభలో చూపించారు.. మోదీ మోసాన్ని చూపించారు.. మరి చంద్రబాబు ఈ మూడు చోట్ల మాట్లాడిన మాటలను చూపించకపోవడం ఎటువంటి ధర్మం.
ప్రత్యేక ప్యాకేజీ పై హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు అర్ధరాత్రి చేసిన ప్రకటనను ఎందుకు చూపించలేదు. ఇది ఎలా ధర్మం అవుతుంది. అధర్మం కాదా? ధర్మపోరాట సభలో చంద్రబాబు ప్రసంగానికి ఆయన పార్డీ కార్యకర్తలకే అర్ధం కావడం లేదు. ధర్మ పోరాటం అంటే ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు పెట్టి జనాన్ని తీసుకురావడమా? ధర్మ పోరాట సభలో బీజేపీతో వైఎస్సార్‌సీపీ మిలాఖత్ అయ్యిందని చెప్పడం మరింత విడ్డూరం. రాష్ట్రంలో 25 ఎంపీలను ఇస్తే హోదా తెస్తానని చంద్రబాబు ఎలా చెబుతున్నారు. చంద్రబాబు వద్ద ధర్మం లేదు, మీది అసలు పోరాటమే కాదు. ఎన్నికల సభల మాదిరిగా ధర్మపోరాట దీక్ష సభ నిర్వహిస్తున్నారు. ఈ సభల్లో వైఎస్ఆర్ తన పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఈ దేశ రాజకీయాలలోనే నమ్మకద్రోహి చంద్రబాబే. కుట్ర అనే పదానికి చంద్రబాబు ఆద్యుడు. కుట్ర రాజకీయాలు, నమ్మకద్రోహంపై చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదం. 29సార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రత్యేక హోదా అడగలేదు. అమరావతికి ప్రధాని వస్తే ప్రత్యేక ప్యాకేజీ అడిగిన ఘనత చంద్రబాబుది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదు
చంద్రబాబు నాయుడుకు గతంలో అలిపిరి వద్ద జరిగిన ఘటన భగవంతుడు తన వైఖరిని మార్చుకోమని చేసిన వార్నింగ్ అని, నేడు అదే దైవాన్ని దోచుకునే నీచమైన ప్రక్రియను చంద్రబాబు చేస్తున్నారని రాంబాబు విమర్శించారు. కనకదుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు చేయించిన ఘనుడు చంద్రబాబు అని, ఏడుకొండల స్వామి విషయంలో చేస్తున్న దానికి వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. రమణదీక్షితుల ఇంట్లో ఎవరి ఫొటోలు ఉన్నాయో చంద్రబాబు తెలుసుకునే ప్రయత్నం చేశారన్నారు. రమణదీక్షితులు ఇంట్లో వైఎస్ఆర్ ఫోటో ఉందని.. అందుకే ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగు దేశం పార్టీ బ్రాహ్మణ వ్యతిరేక పార్టీ ఈ సందర్బంగా ఆయన ఆరోపించారు. వైఎస్ఆర్ హయాంలో పేద బ్రాహ్మణుల కోసం కృషి చేశారు..దేవాలయ చట్టం సవరించారు.. 2007లో అర్చకుల హక్కులను పునరుద్ధరించారు.. రాష్ట్రంలో ప్రతి పేద బ్రాహ్మణులు వైఎస్సార్‌ను గౌరవిస్తున్నారని గుర్తు చేశారు. వెంకటేశ్వర స్వామిని దోచుకునే నీచపు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment