వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ
విజయనగరం: టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి అరాచకాలు ఏపీలో మితిమీరిపోయాయని వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా విమర్శించారు. విజయనగరంలో బుధవారం బొత్స విలేకరులతో మాట్లాడారు. పోలీసు వాహనాల్లో టీడీపీ నాయకులు దర్జాగా నగదు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారు.. సాక్ష్యాధారాలను ఈసీకి ఇచ్చాం.. దీనిపై విచారణ చేసి ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఈసీ చర్యలు తీసుకుందని వెల్లడించారు. టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్న ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను కూడా తప్పించాలని ఈసీని కోరినట్లు తెలిపారు. ఏబీ వెంకటేశ్వర రావు ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించకుండా టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని అందుకే ఈసీ వేటేసిందని ఆరోపించారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే డీజీపీని తప్పించాల్సిందేనని వ్యాక్యానించారు.
కిడారి మృతి ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదా?
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతి ఏపీ ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదా అని సూటిగా ప్రశ్నించారు. వైఎస్ వివేకా హత్యపై ఇప్పటి వరకు ఏం తేల్చలేకపోయారని దుయ్యబట్టారు. ఎయిర్‌పోర్టులో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడి ప్రభుత్వ వైఫల్యం కాదా అని సూటిగా అడిగారు. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను తీసుకువచ్చి ఆయనతో కూడా అబద్ధాలు చెప్పించారని అన్నారు. తెలంగాణాలో మాదిరిగానే ఏపీలోనూ టీడీపీ కనుమరుగు కానుందని జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment