
సాక్షి, విజయవాడ : డ్వాక్రా సంఘాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వీర్యం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. ఆదివారం ఆయన వైఎస్సార్‌సీపీ మైలవరం సమన్వయ కర్త వసంత కృష్ణ ప్రసాద్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వంలో డ్వాక్రా మహిళలు పూర్తిగా కుదేలయిపోయారని ధర్మాన ఆరోపించారు. డ్వాక్రా సంఘాలకు ఇచ్చిన ఏ హామీని చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు. ఎన్నికల దగ్గర పడుతుండటంతో టీడీపీ బ్రోకర్లు మరోసారి ప్రజలకు మోసగించడానికి యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో బూత్ కమిటీల అవసరం కీలకమని, విధిగా తమ బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు.
మంత్రి ఉమా కుట్రలు ఇక చెల్లవ్ : వసంత కృష్ణ
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం చూసి మంత్రి ఉమా మహేశ్వరరావు వణికి పోతున్నారని ఆ పార్టీ మైలవరం సమన్వయకర్త వసంత కృష్ణ ప్రసాద్ ఎద్దేవా చేశారు. నియోజకవర్గ ప్రజలంతా వైఎస్ జగన్ సీఎం కావాలని ఎదురుచూస్తున్నారని చెప్పారు. మైలవరం నియోజకవర్గంలో మంత్రి ఉమా కుట్రలు ఇక చెల్లవన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.