వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలతో శిల్పా చక్రపాణిరెడ్డి
ఆత్మకూరు: టీడీపీ నాయకుడు చంద్రబాబునాయుడు లాగే ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ప్రజలను మోసగించడమే నైజంగా మార్చుకున్నారని వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. వెంకటాపురం గ్రామంలో గురువారం టీడీపీకి చెందిన కార్యకర్తలు శిల్పా ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుడ్డా రాజశేఖర్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలందరినీ మోసగించి టీడీపీకి అమ్ముడుపోయారన్నారు.
ప్రతి పనిలో కమీషన్ తీసుకుంటూ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారారని విమర్శించారు. నీరు–చెట్టు పనులే కాకుండా చివరకు పట్టణంలోని గాంధీ విగ్రహానికి ప్రహరి నిర్మిస్తే అందులోనూ కమీషన్ తీసుకున్నారన్నారు. రూ.3 లక్షలు మంజూరు చేసుకుని రూ.లక్ష మాత్రమే ఖర్చు పెట్టారని విమర్శించారు. ఇలా గాంధీ, అంబేడ్కర్ లాంటి నాయకుల పేర్లుతో కూడా నిధులు స్వాహా చేయడం ఆయనకే చెల్లుతుందనన్నారు.
పొదుపు మహిళలపై వేధింపులు..
అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎమ్మెల్యే బుడ్డా పొదుపు మహిళలను సైతం వేధిస్తున్నారని శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శించారు. పార్టీలకు అతీతంగా చేపట్టాల్సిన పసుపు–కుంకుమ చెక్కుల పంపిణీలో కూడా రాజకీయం చేస్తున్నారన్నారు. తనకు అనుకూలమైన గ్రూపులకు ఇచ్చుకుంటూ మిగతా మహిళలకు చెక్కులు ఇవ్వకుండా వేధిస్తున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు రోజుకో అబద్ధం ఆడుతూ ప్రజలను, చివరకు రైతులకు అందజేసే సాయంలో కూడా మోసగిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.6 వేలకు కేవలం రూ.4 వేలు మాత్రమే కలిపి ఇస్తూ రూ.10 వేలు అంటూ తప్పులు దోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రజలకు మేలు జరగాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలన్నారు.
భారీగా వైఎస్సార్‌సీపీలో చేరిక..
వెంకటాపురం గ్రామంలో వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన ముల్లంగి కృష్ణారెడ్డి, గోవిందరెడ్డి, సందీప్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి , ముర్తుజా, మాబాషా, మధుసూదన్‌రెడ్డి , ప్రసాద్‌రెడ్డి , హుస్సేన్‌మియా, షేక్ మాబాషా , నూర్ అహ్మద్‌తో పాటూ 100 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. వారికి శిల్పా చక్రపాణిరెడ్డి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ శ్రీశైలం నియోజకవర్గం నాయకులు శిల్పా భువనేశ్వరరెడ్డి , వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు అంజాద్ అలీ, కుందూరు శివారెడ్డి, వి.రామచంద్రరెడ్డి, నజీర్‌అహ్మద్, నాగేశ్వరరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, మాబాషా, ఎలీష, కేశవరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment