సాక్షి, హైదరాబాద్ : టీడీపీ ప్రభుత్వం పోలీసులను పావులుగా వాడుకుంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు డాక్టర్ శ్రీదేవి మండిపడ్డారు. ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇవ్వని రైతులను వేధించడం ఏమిటని ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలో రైతులకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ల్యాండ్ పూలింగ్‌కు భూములను ఇవ్వని వారిని టీడీపీ నాయకులు అనేక రకాలు వేధించారని గుర్తుచేశారు. చంద్రబాబు శాఖమూరులో అంబేడ్కర్ స్మృతివనం నిర్మిస్తానని చెప్పి.. అక్కడ ఒక్క ఇటుక వేయలేదని తెలిపారు. పైగా అక్కడకి వెళ్లిన వైఎస్సార్‌సీపీ నాయకులు మేరుగ నాగర్జునను అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం తమకు ఇచ్చిన భూములను సర్వే చేసి న్యాయం చేయాలని దళితులు దీక్ష చేస్తే దానిని టీడీపీ ప్రభుత్వం భగ్నం చేసిందని మండిపడ్డారు.
రైతు రాంమీరా ప్రసాద్ భూమిలోకి వెళ్లడానికి సీఆర్‌డీఏ, ఏడీసీ, రెవెన్యూ అధికారులకు ఏం హక్కు ఉందో సమాధానం చెప్పాలని అన్నారు. అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటినైతే రోడ్డు విస్తరణకు ఇస్తారా అని ప్రశ్నించారు. మాదాపూర్‌లోని లోకేశ్ సైట్‌లో రహదారి నిర్మిస్తే ఊరుకుంటారా అని నిలదీశారు. ప్రసాద్ భూమిపై హైకోర్టు స్టే ఉన్నప్పటికీ పోలీసులు దారుణంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసాద్ బట్టలు చిరిగినా కూడా పట్టించుకోకుండా.. అక్కడి నుంచి లాక్కుని వెళ్లి అరెస్ట్ చేశారని తెలిపారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించడమే కాకుండా.. ఒక పౌరుని ప్రాథమిక హక్కులను కాలరాశారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ దళితులకు సేవ చేస్తుందని తెలిపారు. రైతు ప్రసాద్‌కు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. అతనికి న్యాయం జరిగేవరకు సాయం చేస్తామని పేర్కొన్నారు. సీఆర్‌డీఏ, ఏడీసీ, రెవెన్యూ అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment