
విజయవాడ: టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఓటమి భయంతోనే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిథి తమ్మినేని సీతారాం విమర్శించారు. విజయవాడలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో తమ్మినేని విలేకరులతో మాట్లాడారు. ఒంగోలులో వైఎస్సార్‌సీపీ నేత బాలినేని శ్రీనివాస రెడ్డిపై దాడి జరుగుతుంటే పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారని ఆరోపించారు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు రోజూ విలువల గురించి మాట్లాడుతారు..కానీ చేసేది అంతా అప్రజాస్వామిక చేష్టలేనని అన్నారు.
ఓట్లన్నీ తొలగిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా, దొంగల్ని పట్టుకున్న ఎమ్మెల్యే చెవిరెడ్డిపై కేసులు పెట్టారని దుయ్యబట్టారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టాలని, వెంటనే టీడీపీ గుర్తింపును ఈసీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకేష్‌లిద్దరూ దొంగలని ఆరోపించారు. అత్యాధునికి టెక్నాలజీని జోడించి వైఎస్సార్సీపీ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పారు. ఓట్లు తొలగిస్తున్న వారిపై తిరగబడాల్సిన అవసరం ఉందన్నారు. ఏ ఫార్మా కంపెనీని టీఆర్‌ఎస్ నాయకులు బెదిరించారో రాయపాటి సాంబశివరావు చెప్పాలని డిమాండ్ చేశారు.
సీబీఐ దర్యాప్తు జరిగితే అన్ని వాస్తవాలు బయటికి వస్తాయని అన్నారు. దళితులను దూషించిన చింతమనేని ప్రభాకర్‌పై ఎందుకు ఇంతవరకూ చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఆంధ్రాలో మాఫియాకు లీడర్ చంద్రబాబేనని, ఈసీ ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు మేక తోలు కప్పుకున్న పులి అని తూర్పారబట్టారు . టీడీపీ నేతలు రౌడీయిజం, గూండాయిజం చేస్తూ మాపై ఆరోపణలు చేస్తున్నారని, టీడీపీ నాయకుల క్రిమినల్ చరిత్ర అంతా త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment