
నగరి మండలం వేలావడిలో నవరత్నాల గురించి వివరిస్తున్న రోజా
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలు అమలు చేస్తే రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారుతుందని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఆ పార్టీ శ్రేణులు రావాలి జగన్... కావాలి జగన్ నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం కూడా కార్యక్రమం నిర్వహించాయి. ఆయా జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, ముఖ్య నేతలతో పాటు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రజలకు నవరత్నాల్లోని ఒక్కొక్క పథకాన్ని వివరిస్తూ ముందుకు సాగారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లిలో నర్సాపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు, ఏలూరు నియోజకవర్గం సత్రంపాడు, వీరవాసరం మండలం మెంటేపూడి, ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం, తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట, ఆచంట నియోజకవర్గం వల్లూరులో ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు నవరత్నాల గురించి ప్రచారం చేశారు.
విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం బొమ్మిక గ్రామం, పార్వతీపురం, బొబ్బిలి పట్టణాల్లో జామి మండలం గొడికొమ్ములో సమన్వయకర్తల ఆధ్వర్యంలో వైఎస్ జగన్‌ను సీఎంను చేయాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించారు. గుంటూరు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొంటున్నాయి. ఎమ్మెల్యేలు ఆర్కే రోజా(నగరి) డాక్టర్ సునీల్‌కుమార్ (పూతలపట్టు), డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి(మదనపల్లె) చిత్తూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు(చిత్తూరు) కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో బుధవారం 5 నియోజకవర్గాల్లో కార్యక్రమం జరిగింది. నియోజకవర్గాల్లో ఇంటింటీకీ వెళ్లి నవరత్నాలపై అవగాహన కల్పించారు.
కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించి నవరత్నాల పథకాలను ప్రజలకు వివరించారు. నెల్లూరు నగరంలోని 6వ డివిజన్ వీవర్స్ కాలనీ, శెట్టిగుంటరోడ్డు ప్రాంతాలలో సిటీ ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్ యాదవ్ నేతృత్వంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. రూరల్ మండలంలోని కాకుపల్లిలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, సూళ్లూరుపేట మండలం అనంతసాయి గ్రామంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నం, పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో ఎస్.నర్సాపురంలో, గాజువాక అయ్యన్నపాలెంలో నాయకులు ఇంటింటికీ వెళ్లి నవరత్న పథకాలను ప్రజలకు వివరించారు. తూర్పుగోదావరి జిల్లాలోని పలు నియోజవర్గాల్లో పార్టీ నేతలు ర్యాలీగా వెళుతూ వైఎస్సార్‌సీపీ ప్రజలకు అండగా ఉంటుందని ప్రజలకు భరోసానిచ్చారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు, రాయచోటి పరిధిలో ఎమ్మెల్యేలు రాచమల్లు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. రాజంపేట పరిధిలోని సుండుపల్లెలో పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి కార్యక్రమాన్ని చేపట్టారు.