
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఆ పార్టీ విడుదల చేసిన ‘రావాలి జగన్–కావాలి జగన్’ అనే ప్రచార గీతం సామాజిక మాధ్యమాల్లో దుమ్ము రేపుతోంది. ఈ పాటకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. మార్చి 11న విడుదలైన ఈ పాటను నెల రోజుల్లోనే 2.21 కోట్ల మంది వీక్షించారు.
ఇప్పటివరకు ఒక రాజకీయ పార్టీ ఎన్నికల ప్రచార గీతాన్ని ఇంతమంది చూడటం ఇదే ప్రథమం. ‘ఐ–ప్యాక్’ బృందం రూపొందించిన ఈ పాట విడుదలైన 20 రోజులకే వ్యూస్ సంఖ్య కోటి దాటింది. ఒక్క ఏపీ ప్రజలే కాదు, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న జగన్ అభిమానులు సైతం ఈ పాట పట్ల ఆకర్షితులవుతున్నారు.
యువతీయువకులు ఈ పాటను తమ మొబైల్ ఫోన్లకు రింగ్ టోన్లుగా పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీలో ఏ నోట చూసినా ఇదే పాట వినిపిస్తోంది. ఒక ప్రాంతీయ పార్టీ ప్రచార గీతం ఈ స్థాయిలో ఆదరణ పొందడం రాష్టంలో రాగల మార్పులకు సంకేతమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ జాతీయ స్థాయిలో విడుదల చేసిన ప్రచార గీతాన్ని ఇంకా పాతిక లక్షల మంది కూడా చూడలేదు.