
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం 20వేల రూపాయలు చెల్లించాలని కోరారు. ప్రభుత్వం బాధితులను ఆదుకోని పక్షంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. అసలు రాష్ట్రంలో ఆర్థిక, రెవెన్యూ శాఖ మంత్రులు ఉన్నారా అని ప్రశ్నించారు. చుక్క భూములు కూడా పెద్ద స్కాం అని ఆరోపించారు. ఆ భూములను చంద్రబాబుకి చెందిన వ్యక్తులకు ధారాదత్తం చేశారని విమర్శించారు.
వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును హైకోర్టు జాతీయ దర్యాప్తు సంస్థకు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర డీజీపీకి చట్టాలు తెలుసా? తెలియవా? అంటూ సూటిగా ప్రశ్నించారు. అబద్ధాలకు అవార్డ్స్, రివార్డ్స్ ఇస్తే చంద్రబాబుకు ఇవ్వచ్చని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పూటకో మాట.. రోజుకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎవరితోనూ పొత్తులు ఉండవని.. ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. 100 రోజులు ఆగితే ప్రజా వ్యతిరేకత అంటే ఏమిటో చంద్రబాబుకు తెలుస్తుందన్నారు. త్వరలో వైఎస్సార్ సీపీలోకి భారీ ఎత్తున చేరికలు ఉంటాయని అన్నారు.
చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు..
చంద్రబాబు నాయుడు ఓ వీడియో ప్లే చేసి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మదనపల్లిలో ఆగస్టు నుంచి తిప్పారెడ్డి 60వేల గడియారాలు పంచుతున్నారని తెలిపారు. ఓ గడియారంలో టీఆర్‌ఎస్ ఫొటో ఉంటే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి కుట్ర కోణమని మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. రాజధాని శంకుస్థాపనకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను పిలవలేదా అని గుర్తుచేశారు. ఓటుకు కోట్లు కేసులో అప్పటి టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డికి ఇచ్చింది మీ డబ్బు కాదా అని నిలదీశారు.
నందమూరి హరికృష్ణ మృతదేహం దగ్గర టీఆర్‌ఎస్‌తో పొత్తుకు ప్రయత్నించారని కేటీఆర్ చెబితే.. అందులో తప్పేముందని చంద్రబాబు వ్యాఖ్యానించడం చూస్తే ఆయన వ్యక్తిత్వం ఎంటో అర్థమవుతుందన్నారు. వైఎస్సార్ సీపీకి ఎవరితోను కుమ్మక్కు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకుండా పోటీ చేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment