సాక్షి, విజయవాడ: సుదీర్ఘ పోరాటం తర్వాత న్యాయం గెలిచిందని మడకశిర వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామి అన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపునకు ఇది నాంది అని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఉదయం అమరావతిలోని స్పీకర్ కార్యాలయంలో తిప్పేస్వామి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. తర్వాత విజయవాడలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో తిప్పేస్వామి మాట్లాడుతూ.. మడకశిర నియోజకవర్గానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా టీడీపీ నెరవేర్చలేదని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో హంద్రీనీవా పనులు 80 శాతం పనులు పూర్తయినప్పటికీ.. సీఎం చంద్రబాబు నాయుడు కనీసం 20 శాతం పనులు కూడా చేపట్టలేకపోయారని మండిపడ్డారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి హంద్రీనీవా నీటి కోసం పోరాడతానని తెలిపారు.
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. మడకశిర ఎమ్మెల్యే విషయంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడం వల్లే న్యాయం జరిగిందని అన్నారు. ఈ విషయంలో నాలుగున్నరేళ్లు చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం కాలాయపన చేసిందని మండిపడ్డారు. చంద్రబాబు అన్యాయపాలనకు పతనం ప్రారంభమైందని తెలిపారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన చంద్రబాబు ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.
వైఎస్సార్ సీపీ విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. చంద్రబాబు దుర్మార్గాలపై తగిన తీర్పు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణలో ఓటుకు కోట్లు కేసు, రాజధాని నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డ చంద్రబాబుకు ప్రజలు సరైన గుణపాఠం చెప్తారని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. తిప్పేస్వామి తీర్పులాగే పార్టీ ఫిరాయించిన 23 మంది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల విషయంలో కూడా తీర్పు రాబోతుందని అన్నారు. ఈ తీర్పు టీడీపీకి, అసెంబ్లీ స్పీకర్‌కు కనువిప్పు కావాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment