సాక్షి, అమరావతి: మండలి రద్దుపై ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయమే వైఎస్సార్‌సీపీ తీసుకుందని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు మండలి రద్దు చేయాలనే ఆలోచన లేదని.. ఎన్నికల తర్వాత అనివార్యమైన పరిస్థితులను టీడీపీ కల్పించిందని చెప్పారు. పెద్ద మెజార్టీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గెలిచారని.. రాష్ట్రాభివృద్ధి కోసం త్వరితగతిన సీఎం నిర్ణయాలను తీసుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం చేసిన అధికార వికేంద్రీకరణ బిల్లును మండలిలో కావాలనే రాజకీయంతో తిరస్కరించారని మండిపడ్డారు. సభలో తీర్మానం చేసిన బిల్లులను అడ్డుకోవాలనే దుర్బుద్ధితో టీడీపీ సభ్యులు వ్యవహరించారని.. దీంతో మండలిని రద్దు చేయాలనే భావనను కల్పించారని వెల్లడించారు. చట్టాలను త్వరితగతిన అమలు చేసి ప్రజలకు అందించాలంటే మండలి అడ్డుగా ఉంటుందని పేర్కొన్నారు. గత ఐదేళ్లు పాలన చేసిన చంద్రబాబు అవమానకరంగా ఓడిపోయారని.. ఆయన బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. మెజార్టీ ప్రజల అభ్రిపాయాలను అణగదొక్కాలనే యత్నం చంద్రబాబు చేస్తున్నారని మండిపడ్డారు. (చదవండి:బాబు తప్పులకు రిపేర్లు చేస్తున్నాం : సీఎం జగన్)
ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎందుకు సభకు రాలేదని.. ఆ బాధ్యత నుంచి ఎందుకు పారిపోయారని అంబటి ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొని కాపాడుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. వేగవంతమైన పరిపాలన అందించాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని.. అందుకే మండలి రద్దు చేయాలనే నిర్ణయానికి సీఎం జగన్ వచ్చారన్నారు.. రాజకీయంగా అ ఆ లు రాని లోకేష్ లాంటి వ్యక్తులు శాసన మండలిని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. మండలిని దుర్వినియోగం చేసినందుకు చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు. శాసనసభలో తీర్మానం తర్వాత మండలి కచ్చితంగా రద్దు అవుతుందని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment