పోలీసులకు, విద్యార్థి సంఘ నాయకుల మధ్య తోపులాట (ఇన్‌సెట్) విద్యార్థి ఎంఆర్ నాయక్‌ను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం
కడప సెవెన్‌రోడ్స్: కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం విద్యార్థి సంఘాల జేఏసీ నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నాలుగురోజులుగా జిల్లాలో పాదయాత్రలు నిర్వహించిన ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ కార్యకర్తలు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చాయి. వైఎస్సార్ విద్యార్థి విభాగం, ఎన్‌ఎస్‌యూఐ సంఘీభావంగా పాల్గొన్నాయి. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నాటకాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే పెద్ద సంఖ్యలో మోహరించి ఉన్న పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వాగ్వాదాలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి. పోలీసులు ఒక్కసారిగా విద్యార్థులపై విరుచుకుపడి లాఠీలు ఝళిపించారు. ఈ సంఘటనలో పలువురు గాయపడ్డారు. యోగి వేమన విశ్వవిద్యాలయానికి చెందిన ఎంఆర్ నాయక్ స్పృహ కోల్పోయారు. విద్యార్థులు ఆయనను హుటాహుటిన రిమ్స్‌కు తరలించారు.
అయితే పరిస్థితి మెరుగు పడకపోవడంతో తిరుపతి రుయా ఆస్పత్రికి తీసుకెళ్లారు.విద్యార్థుల కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా, మేయర్ సురేష్‌బాబు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కడప స్టీల్ ప్లాంటు ఏర్పాటు విషయంలో మళ్లీ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయడమంటే కాలయాపన కోసమేనని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కడపలో స్టీల్ ప్లాంటుకు అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ ఉన్నాయని ఓ వైపు చెబు తూనే టాస్క్ ఫోర్స్‌కు శ్రీకారం చుట్ట డం దేనికని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని విమర్శించారు. అధికా రంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా ఏ ఒక్క హామీని అమలు చేసిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు.
రాష్ట్రాన్ని మోసగించిన నేరంలో ప్రధాని మోదీ ప్రథమ ముద్దాయి కాగా, చంద్రబాబు రెండవ ముద్దాయని చెప్పారు. విశాఖలో ఎలాంటి సదుపాయాలు లేకపోయినా అప్పట్లో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్బంగా వారు గుర్తు చేశారు. విశాఖ ఉక్కు ఉద్యమంలో విద్యార్థి, యువకులే ప్రధానంగా పాల్గొన్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయడం ద్వారా మాట నిలుపుకోవాలని, లేకుంటే ప్రజలు తగిన బుద్ది చెబు తారని హెచ్చరిం చారు.
స్టీల్ ప్లాంటు ఏర్పాటు విషయంలో చిత్తశుద్ది లేని టీడీపీ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ మాట్లాడుతూ రాయలసీమలోని నిరుద్యోగులు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలన్నారు. సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ స్థాపించాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి కె.ఆంజనేయులు, బి. నారాయణ, పీసీసీ అధికార ప్రతినిధి నీలి శ్రీనివాసరావు, వైఎస్సార్ యువజన విభాగం నాయకులు చల్లా రాజశేఖర్, విద్యార్థి నాయకుడు ఖాజా రహమతుల్లా, జనసేన విద్యార్థి విభాగం నాయకుడు గంగిరెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా కార్యదర్శి తిరుమలేశ్, పీడీఎస్‌యూ నాయకులు అంకన్న, సీపీఎం నాయకులు రామ్మోహన్‌రెడ్డి, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment