మోదీ నుంచి ఏం తెచ్చారు చంద్రబాబూ? | ysrcp mla buggana rajendranath reddy ashes out at chandrababu | Sakshi
Sakshi News home page

ఇంతకీ చంద్రబాబు సాధించిందేంటి?: బుగ్గన

Published Wed, Jan 17 2018 1:17 AM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM

ysrcp mla buggana rajendranath reddy ashes out at chandrababu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నాలుగేళ్లలో సాధించింది ఏమీ లేదని, సంకీర్ణ ప్రభుత్వంలో కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్లు కూడా చంద్రబాబుకు దొరకడం లేదని విమర్శించారు. ప్రధానమంత్రి మోదీని కలిసేందుకు చంద్రబాబుకు ఏడాదిన్నర సమయం పట్టిందని అన్నారు.

ప్రజలను నాలుగేళ్లుగా మభ్యపెడుతూ.. నాలుగేళ్లలో నాలుగు తాత్కాలిక భవనాలు కట్టడం తప్ప సాధించింది ఏమీ లేదని విమర్శించారు. టీడీపీ నేతలు చంద్రబాబుకు మోదీ అపాయింట్‌మెంట్‌ దొరికిందని ఊదరగొడుతున్నారని, ఒక సీఎంకు ఏడాది పాటు ఎందుకు అపాయింట్‌మెంట్‌ దొరకలేదని బుగ్గన ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడు మాట్లాడినా తాను రాష్ట్రం కోసం 30సార్లు ఢిల్లీ వెళ్లానని చెబుతుంటారని, నాలుగేళ్లలో ఈ సంకీర్ణ ప్రభుత్వంలో రాష్ట్రానికి ఏ మేలు జరిగిందని నిలదీశారు.

అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నిర్మాణం అని ఊదరగొడుతూ... చివరకు నాలుగు భవనాలు నిర్మించారని, అది కూడా నాలుగు చినుకులు పడితే కారిపోతుందని ఎద్దేవా చేశారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్, వైజాగ్‌ – చెన్నై కారిడార్‌ అన్నారు. ప్రత్యేక హోదా, దుగరాజుపట్నం పోర్టు, అమరావతి నిర్మాణం, పోలవరం ఇలా ఏది కూడా సాధించలేకపోయారన్నారు. దుగరాజుపట్నం పోర్టు అన్నది 13వ షెడ్యూల్‌లో పేర్కొన్నారన్నారు. నాలుగేళ్ల తరువాత సీఎం ఢిల్లీకి వెళ్లి  ప్రధానికి వినతిపత్రం ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. సామాన్య ప్రజలు కలెక్టర్‌ వద్దకు వెళ్లి అర్జీ ఇచ్చినట్లుగా చంద్రబాబు తీరు ఉందన్నారు.

రాజధాని ఏమైంది?
అంతర్జాతీయ రాజధాని నిర్మిస్తామని చంద్రబాబు చెప్పారని ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గుర్తు చేశారు. జపాన్, మలేసియా, టర్కీ, లండన్, సింగపూర్‌ అంటూ ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలా రాజధాని నిర్మిస్తామని చంద్రబాబు చెప్పారు. ఇంతవరకు ఏం మేరకు కట్టించారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ తాత్కాలిక భవనాల్లో పనిచేస్తూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాజధాని కోసం లక్ష ఎకరాల భూమి తీసుకొని ఏం చేస్తారని నిలదీశారు. త్వరలోనే చంద్రబాబు మోసాలన్నీ కూడా బయటపడుతాయన్నారు. ఐదు వేల ఎకరాలు రాజధానికి సరిపోతాయని మేమంటే..వీరికి రాజధాని నిర్మించడం ఇష్టం లేదని చంద్రబాబు నిందలు వేశారన్నారు. ఇప్పటికే నాలుగు సార్లు రాజధానికి శంకుస్థాపన చేశారన్నారు. ప్రతి మూడు నెలలకు ఓసారి బిల్డింగ్‌ ప్లాన్‌ అంటూ ప్రచారం చేస్తున్నారు తప్ప చేసింది ఏమీ లేదన్నారు.

పోలవరంపై కట్టుకథలు
చంద్రబాబు ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంపై కట్టు కథలు అల్లుతుందని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. కనీసం పోలవరం నిర్మిస్తే అర్ధరాష్ట్రమైనా బాగుపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం అంచనాలు, విధి విధానాలు అంటూ కాలయాపన చేస్తుందని  విమర్శించారు. పోలవరం అన్నది రెండు, మూడు రాష్ట్రాలకు సంబంధించిందన్నారు. ఇలాంటి ప్రాజెక్టు కేంద్రం కడితే ఉపయోగకరంగా ఉండేదన్నారు. అలాంటి ప్రాజెక్టును మేం కడుతామని చంద్రబాబు తీసుకొని మళ్లీ ఈ రోజు పోలవరాన్ని కేంద్రానికి ఇస్తామని చెప్పడం సిగ్గు చేటు అన్నారు. చట్టంలో ఉన్న పోలవరం ప్రాజెక్టును తీసుకొని ఇంతవరకు ఏం చేశారన్నారు. తెలుగు జాతికి చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు ...కేంద్ర మంత్రి గడ్కారి కోసం ఆయన సొంతూరుకు వెళ్లడం, తీరా ఆయన్ను కలిసేందుకు వీలు పడక విమానంలో తిరిగి రావడం ఏంటన్నారు. గడ్కరీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లాలి కానీ, ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి  వెళ్లడం, తీరా కలువకుండా వెనక్కి రావడం ఏంటని ప్రశ్నించారు.

కేంద్రం నిధులకే లెక్కలు లేవు
కేంద్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి రూ.2500 కోట్లు, విజయవాడలో డ్రైనేజీ వ్యవస్థ కోసం రూ. వెయ్యి కోట్లు ఇచ్చిందని చెబుతుంటే ఈ నిధులకు లెక్కలు లేవని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. దుగ్గిరాజు పట్నం పోర్టును ఎందుకు విస్మరించారని ఆయన ప్రశ్నించారు. కాగ్‌ రిపోర్టు ప్రకారం 24 వేల కోట్లు లోటు బడ్జెట్‌ ఉండేదని, రూ.14 వేల కోట్లతో రూ.7 వేల కోట్లు మాత్రమే లోటు బడ్జెట్‌ ఉందని కేంద్రం చెబుతుందన్నారు. అయితే మళ్లీ చంద్రబాబు రూ.16 వేల కోట్లు లోటు ఉందని లేఖలు రాస్తున్నారన్నారు. ఇన్నిసార్లు మీరు ఢిల్లీకి వెళ్లి సాధించింది ఏంటని, కేంద్రంలో ఉన్న మీ మంత్రులు ఏం చేస్తున్నారని బుగ్గన ప్రశ్నించారు. ఇప్పటికైనా తీరు మార్చుకుంటే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. లేదంటే ప్రజల ఆగ్రహానికి కొట్టుకుపోవడం ఖాయమని హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement