ఇన్ని రోజులా... నిద్ర పోతున్నావా? | YSRCP MLA Gadikota Srikanth Reddy Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ఏపీ సీఎంపై శ్రీకాంత్‌​ రెడ్డి ధ్వజం

Published Sat, Dec 8 2018 2:29 PM | Last Updated on Sat, Dec 8 2018 3:28 PM

YSRCP MLA Gadikota Srikanth Reddy Fires On Chandrababu Naidu In Press Club - Sakshi

విలేకరులతో మాట్లాడుతున్న శ్రీకాంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : చంద్రబాబు నాయుడు పాలించినంత కాలం రాష్ట్రంలో కరువు తాండవిస్తుందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌​ రెడ్డి ఎద్దేవా చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గత ఏడేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో కరువు ఉందని చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారన్నారు. అంటే ఆయన పాలనలో వర్షాలు కురవని చంద్రబాబుకు కూడా అర్థమైందంటూ ఎద్దేవా చేశారు. కరువు ఉందని ఒప్పుకున్న చంద్రబాబు.. దానికి సంబంధించి కేంద్రానికి మాత్రం తప్పుడు నివేదిక ఇచ్చారని ఆరోపించారు. ఏడేళ్లుగా కరువు ఉంటే కేంద్రాన్ని సాయం అడగడానికి ఇన్ని రోజులు పట్టిందా.. నిద్ర పోతున్నావా బాబూ అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో దాదాపు 35 లక్షల ఎకరాల్లో​ పంటలు ఎండిపోయాయి.. 17 లక్షల మంది రైతులు దీనావస్థలో ఉన్నారన్న చంద్రబాబు.. మరుసటి రోజే వ్యవసాయాభివృద్ధిలో మనమే టాప్‌ అంటూ కోతలు కోశారన్నారు. ఇలాంటి అభూత కల్పనలు సృష్టించడంలో బాబు నంబర్‌వన్‌ అంటూ విమర్శించారు. మ్యానిపులేట్‌ చేయడంలో బాబుకు విల్‌, వే బాగా ఉంటుందని ఎద్దేవా చేశారు.  

శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తప్ప ఏ జిల్లాలో కూడా కావాల్సినంత వర్షపాతం లేదని తెలిపారు. గతంలో 9 ఏళ్ల పాలనలో.. ఇప్పుడు ఐదేళ్లలో కూడా రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. రైతులను ఆదుకోవడంలో టీడీపీ పూర్తిగా వైఫల్యం చెందిందని శ్రీకాంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు రాష్ట్ర సమస్యలను గాలికి వదిలి.. తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వెళ్లారని విమర్శించారు. మహాకూటమి ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ఆంధ్రాలో సంపాదించిన అవినీతి సొమ్మేనని ఆరోపించారు. మరో నాలుగు నెలల్లో ఏపీ ప్రజలు ఇక్కడి నుంచి తరిమేస్తారని తెలిసే.. చంద్రబాబు తెలంగాణలో వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నారని శ్రీకాంత్‌ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు తెలంగాణకు వెళ్తే పీడ విరగడవుతుందని ఏపీ ప్రజలు కూడా కోరుకుంటున్నారని పేర్కొన్నారు. దేశంలో అత్యధిక అప్పులున్న రైతులు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నారని నాబార్డ్‌ నివేదిక స్పష్టం చేసిందని తెలిపారు. ఏపీలో రైతు సమస్యలను గాలికొదిలేసి.. దేశవ్యాప్తంగా ఎందుకు తిరుగుతున్నారంటూ చంద్రబాబును ప్రశ్నించారు.

ఇన్ని రోజులు హైదరాబాద్‌ను నిర్మించింది తానేనంటూ మాట్లాడిన బాబు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో మాత్రం సైబరాబాద్‌ను మాత్రమే నిర్మించానని చెప్పాడు. అంటే కుతుబ్‌ షా ఆత్మలు ఏవైనా చంద్రబాబును బెదిరించాయా అంటూ శ్రీకాంత్‌ రెడ్డి ప్రశ్నించారు. హైటెక్‌ సిటీ భవనాన్ని 1992లో నేదురుమళ్లి జనార్దన్‌ రెడ్డి నిర్మించారని, చంద్రబాబు కేవలం తన రియల్‌ ఎస్టేట్‌ మిత్రులకు మాత్రమే లాభాలు చేకూర్చారని ఆరోపించారు. చంద్రబాబు కోతలు ఎలా ఉన్నాయంటే శంషాబాద్‌ విమానాశ్రయాన్ని కూడా తానే నిర్మించానని రాహుల్‌ గాంధీతో చెప్పారని, అసలు ఆ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసింది, ప్రారంభించింది సోనియా గాంధీ అని గుర్తుచేశారు. ఈ విషయం చెప్పలేక రాహుల్‌ గాంధీ మౌనంగా ఉన్నారని తెలిపారు. ఔటర్‌ రింగ్‌ రోడ్‌, పీవీ నర్సింహ్మరావు ఎక్స్‌ప్రెస్‌ వేని నిర్మించి.. ఆ ప్రాంతాలని అభివృద్ధి చేసింది వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అని వివరించారు.

బాబు సీఎంగా ఉన్నప్పుడే, కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న ఎస్‌ఎం కృష్ణ బెంగుళూరును ఎంతో అభివృద్ధి చేశారు.. కానీ బాబులా ఎప్పుడు డప్పు కొట్టుకోలేదంటూ శ్రీకాంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశించి కూటమిని తెర మీదకు తెచ్చారని.. దాని బదులు టీడీపీనే, కాంగ్రెస్‌లో విలీనం చేస్తే సరిపోయేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చెప్పే సుభిక్షం, పచ్చదనం కేవలం పచ్చ పేపర్లలో, టీవీ చానళ్లలో మాత్రమే ఉంటుందని, రాష్ట్రంలో లేదని అన్నారు. దేశంలో చక్రం తిప్పాలని కలలు కనే బదులు రాష్ట్రం గురించి ఆలోచిస్తే మంచిదని సూచించారు. ఎన్నికల్లో​ వెదజల్లుతున్న అవినీతి సొమ్మును రైతుల కోసం వినియోగించాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదానే వైఎస్సార్‌ సీపీ ప్రధాన ధ్యేయంగా శ్రీకాంత్‌ రెడ్డి పునరుద్ఘాటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement