
సాక్షి, తాడేపల్లి: రాయలసీమలో హైకోర్టు వద్దని అక్కడ ప్రజలు కోరుకుంటున్నట్లు టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అబద్దాలు చెబుతున్నారని వైఎస్సార్ క్రాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పేర్కొన్నారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాయలసీమలో హైకోర్టు పెట్టాలని పెద్ద ఎత్తున్న ఉద్యమాలు జరుగుతున్నాయన్నారు. హై బెంచ్ రాయలసీమలో పెడతామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అన్నారు.
కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అన్ని ప్రాంతాలు సమానమేనని, ప్రజల ఆకాంక్ష మేరకు రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తున్నారని హఫీజ్ ఖాన్ తెలిపారు. రాయలసీమలో హైకోర్టు పెట్టడం చంద్రబాబుకు ఇష్టం లేదా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం అనేది అక్కడి ప్రజల హక్కు అని పేర్కొన్నారు. ఇక 29 గ్రామాలకు నాయకుడిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు రాబోయే రోజుల్లో టీడీపీని బంగాళా ఖాతంలో కలుపుతారని ఆయన ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment