సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒక విఫల నాయకుడని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. మంగళవారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఐదేళ్ల పాలనపై చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు చేసిన విమర్శలను ఆయన తప్పుబట్టారు. చంద్రబాబును భస్మాసురుడి పెద్దన్నగా అభివర్ణించారు. చంద్రబాబు సీఎం గా ఉన్న గత ఐదేళ్లు.. రాష్ట్రం మొత్తం తగలబడిపోయిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలు చేసే అర్హత ఆయనకు లేదని ధ్వజమెత్తారు. (‘ఆయనకు అందుకే మతి భ్రమించింది’)
చైతన్యయాత్రలు వెలవెల..
చంద్రబాబు చేస్తున్న చైతన్య యాత్రలు జనాలు లేక వెలవెల బోతున్నాయని కోటంరెడ్డి ఎద్దేవా చేశారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకొనే చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి నాలుగు మంచి సలహాలు చెప్పారా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి.. ఎన్నికల వాయిదా వేయించేందుకు ఆయన సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. టీడీపీకి అభ్యర్థులు లేక స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. లిటికేషన్‌లు పెట్టి కోర్టుల్లో వాయిదాలు వేయిస్తున్నారని కోటంరెడ్డి మండిపడ్డారు.
ఏపీ ఇమేజ్ డామేజ్ చేస్తున్నారు..
‘ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఏపీ ఇమేజ్‌ను డామేజ్ చేస్తున్నారు. ఏ తప్పు చేయకపోతే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు. సిట్ ఏర్పాటుతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరుగెడుతున్నాయి. ఆయన అధికారంలో ఉంటే రాష్ట్రం కరువు కటాకలతో ఉండేది. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని’ కోటంరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బీసీలను అణగదొక్కారని, ప్రతిపక్షంలో కూడా చంద్రబాబు అదే పని చేస్తున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment