సాక్షి, అనంతపురం : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇక్బాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్లో పవన్ కల్యాణ్ నటిస్తున్నారని.. టీడీపీ ప్రభుత్వ దోపిడీ పై ఎందుకు ప్రశ్నించలేదో పవన్ కల్యాణ్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంగ్లీషు మీడియంపై చంద్రబాబు, ఇతర విపక్షాల రాద్ధాంతం అనవసరమని.. పేద పిల్లల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్సీ ఇక్బాల్ స్పష్టం చేశారు.
అనంతపురంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ...‘పవన్ కళ్యాణ్ చెగొవేరాను కాదు... నిజ జీవితంలో క్యాషియోను(మన్మథుడు) ఫాలో అవుతున్నారు. పవన్ పవిత్రబంధంలో ఉంటూనే వేరొక వ్యక్తితో బంధాన్ని అక్రమంగా కొనసాగించడం అప్పట్లో నేరం. పవన్ పూర్తిగా ప్రశ్నించే తత్వాన్ని మరిచిపోయారు. నైతికతను వివాహ బంధంలో విడనాడారు. రాజకీయాల్లో సైతం అదేవిధంగా నైతికతను మరిచిపోయారు.
టీడీపీ నుంచి బయటకు వచ్చి లోకేష్ అవినీతిపై మాట్లాడి ఆ తర్వాత మరిచిపోయారు. వరదల వల్ల ఇసుక కొరత వస్తే దానిపై ప్రభుత్వం చెబుతున్నప్పటికీ లాంగ్ మార్చ్ చేశారు. తిరుపతి సభలో వాచ్ డాగ్‌లా ఉంటానని చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు అక్రమ కట్టడంలో ఉన్నా, ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డా, శివరామకృష్ణన్ కమిటీని పక్కనపెట్టి నారాయణ కమిటీ నిర్ణయాలు అమలు చేసినా ప్రశ్నించలేదు.
రైతుల ఇబ్బందులను ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కనీసం ఆ పని కూడా చేయలేదు. రైతు వేషంలో వచ్చి చంద్రబాబుతో కలిసి ప్యాకేజీ మాట్లాడుకున్నారని ప్రజలు చెప్పుకున్నారు. చంద్రబాబు చేసిన రూ.2.50 లక్షల కోట్ల అప్పు, రూ.40వేల కోట్ల బిల్లులపై మీరు ప్రశ్నించారు. దేశంలో వృద్ధిరేటు గురించి ప్రస్తావిస్తూ రాష్ట్ర వృద్ధిరేటును చంద్రబాబు చెబుతున్నా మీరు నిలదీయలేదు. నీరు-మట్టి, పుష్కరాలు, తాత్కాలిక కట్టడాలలో దోపిడీ, పోలవరం ప్రాజెక్ట్ దోపిడీ, ఇసుక మాఫియాను కనీసం ప్రశ్నించలేకపోయారు.
ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన అనేది తక్షణం తీసుకున్న నిర్ణయం కాదు. నిపుణుల కమిటీతో పాటు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ప్రజలు చెప్పిన మీదటనే ఆ నిర్ణయం అమలు చేస్తున్నారు. పేదలు తమ బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని అనుకుంటున్నారు. అది వారికి ఆర్థికంగా ఎలా భారమవుతుంది, దాన్ని తొలగించాలంటే ఏం చేయాలనే దానిపై ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మతం మారతారన్నట్లు ఎందుకు మాట్లాడుతున్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సైతం అలా ఎందుకు రాస్తున్నారు. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడమే. సీఎం జగన్‌ది సెక్యులర్ తత్వం. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామికి సీఎం వైఎస్ జగన్‌కు ఉన్న అనుబంధం గురించి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. కులాలు, మతాల పట్ల ముఖ్యమంత్రికి ఎంతో గౌరవం ఉంది. అందరిని సమాన దృష్టితో చూస్తున్నారు. ఆయన ప్రవేశపెడుతున్న పథకాలే అందుకు సాక్ష్యం.
2050లో మన రాజధానిని ప్రపంచంలోనే అత్యుత్తమంగా చేస్తామని చంద్రబాబు చెప్పినా... దానికి ప్రతిపాదనలు కనిపించడం లేదు. 2030లో పేదరికాన్ని పోగొడతామని ఆయన అన్నారు. మరి మీరు అప్పటిదాకా ఉంటారా అని రాధాకృష్ణ ఎందుకు చంద్రబాబును ప్రశ్నించలేదు. ఐదు ట్రిలియన్ డాలర్ల సంపదను సృష్టిస్తామని అన్నారు... దాని గతి లేదు’ అంటూ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment