
సాక్షి, అమరావతి : భారత వాతావరణ విభాగం(ఐఎండీ) కంటే తన టెక్నాలజీయే గ్రేట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకోవడంపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యంగ్యంగా స్పందించారు. చంద్రబాబు నాయుడి మానసికస్థితి బాగాలేక ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. ‘ చంద్రబాబు నాయుడు తన టెక్నాలజీతో భవిష్యత్తులో తుపాను ఎక్కడ వస్తుందని చెప్పడమే కాకుండా కరెంట్ స్థంబాలు ఎన్ని ఒరుగుతాయి, ఎన్ని చెట్లు విరుగుతాయి, ఎన్ని ఇళ్ల కప్పులు ఎగిరిపోతాయని ముందే చెబుతారట. తుపాన్లను కంట్రోల్ చేయడం కోసం తీరం వెంబడి గోడ కడతారంట. పెథాయ్ వల్ల భూగర్భ జలాలు పెరిగాయంట. అయ్యో చంద్రబాబు గారు.. మానసిక రుగ్మతలన్నీ ఓకేసారి తిరగబడ్డాయా ఏంటి? ఇలా మాట్లాడితే అమెరికాలోని మెంటల్ హస్పిటల్‌లో చేర్పిస్తారు’ అంటూ చంద్రబాబుని ఎద్దేవా చేస్తూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.(ఐఎండీ కంటే.. నా టెక్నాలజీనే గ్రేట్)
చంద్రబాబు నాయుడు మంగళవారం కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఇస్రోతో కలిసి ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీని తాను అందుబాటులోకి తెచ్చానని గొప్పలు చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఫెథాయ్ తుపాను యానాం- తుని మధ్య తీరం దాటుతుందని తాను తెచ్చిన టెక్నాలజీ వల్లే సాధ్యమైందని ఊదరగొట్టారు. అంతే కాకుండా ఓ అడుగు ముందుకేసి భవిష్యత్తులో తుపాన్లు ఎప్పుడు వస్తాయి? వాటి తీవ్రత ఎలా ఉండబోతుంది? ఎక్కడ తీరం దాటుతుందో చెప్పడమే కాదు, ఎన్ని చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఇళ్లు కూలిపోతాయి? ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఏ మేరకు నష్టం వాటిల్లబోతుందో కూడా చెప్పగలిగే స్థాయిలో టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నానని గొప్పలు చెప్పుకున్నారు.