సాక్షి, వరంగల్ రూరల్: మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు తెరపడింది. మూడు రోజులుగా కొనసాగుతున్న నామినేషన్ల దాఖలు బుధవారంతో ముగిసింది. చివరి రోజున జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 22న దుగ్గొండి, నర్సంపేట, పర్వతగిరి, సంగెం, వర్ధన్నపేట మండలాల్లోని 5 జెడ్పీటీసీ, 62 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. తొలిరోజున జెడ్పీటీసీ స్థానాలకు 3 నామినేషన్లు, ఎంపీటీసీ స్థానాలకు 9 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో రోజు 29 నామినేషన్లు రాగా అందులో జెడ్పీటీసీ స్థానాలకు 3 నామినేషన్లు , ఎంపీటీసీ స్థానాలకు 26 నామినేషన్లు దాఖలయ్యాయి.
చివరిరోజున జెడ్పీటీసీ స్థానాలకు 54 నామినేషన్లు, ఎంపీటీసీ స్థానాలకు 338 నామినేషన్లు దాఖలైయ్యాయి. చివరిరోజున ఐదు మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు భారీగా నామినేషన్లు సమర్పించారు. చివరి రోజున మొత్తం 392 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు మొత్తంగా 5 జడ్పీటీసీ స్థానాలకు 60 నామినేషన్లు, 62 ఎంపీటీసీ స్థానాలకు 373 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో జడ్పీటీసీ స్థానాల కోసం 53మంది అభ్యర్ధులు 60 నామినేషన్లు సమర్పించారు. జడ్పీటీసీ నామినేషన్లలో టీఆర్‌ఎస్ నుంచి 24 నామినేషన్లు, కాంగ్రెస్ నుంచి 15 నామినేషన్లు, బీజేపీ నుంచి 8 నామినేషన్లు, సీపీఐ నుంచి 1,టీడీపీ నుంచి 4, ఇతరులు 14 చొప్పున నామినేషన్ సెట్లు దాఖలు చేశారు. అదేవిధంగా 62 ఎంపీటీసీ స్థానాలకు 373 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో బీజేపీ నుంచి 20, సీపీఐ నుంచి 1, కాంగ్రెస్ నుంచి 124, టీఆర్‌ఎస్ నుంచి 182, టీడీపీ నుంచి 13, స్వతంత్రులు 68 చొప్పున నామినేషన్ సెట్లు దాఖలు చేశారు.
నేడు నామినేషన్ల పరిశీలన..
మొదటి విడతలో దాఖలైన నామినేషన్ల పరిశీలన గురువారం జరుగనుంది. నామినేషన్ల స్క్రూటినీ అధికారులు చేపట్టనున్నారు. నామినేషన్ల పరిశీలన అనంతరం సాయంత్రం 5గంటలకు సక్రమంగా ఉన్న నామినేషన్ల జాబితాను ప్రకటిస్తారు. 26న నామినేషన్లపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. అభ్యంతరాలను స్వీకరణ అనంతరం సక్రమంగా నామినేషన్ల జాబితాను ప్రకటిస్తారు. 28న మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. నామినేషన్ల ఉపసంహరణ తరువాత పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటించడంతో పాటు పార్టీ గుర్తులను ప్రకటిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment