ఒంగోలు : నిత్యం రద్దీగా ఉండే ఒంగోలు–నంద్యాల రహదారి నిర్వహణ (మెయింటెనెన్స్)పనుల్లో నిధులు నిలువునా దోచేశారు. అక్కడక్కడ తూతూ మంత్రంగా పనులు చేసినట్లు చూపించి కోట్లాది రూపాయలు ఆరగించారు. ఐదేళ్ల పాటు రోడ్డు మరమ్మతుల పేరిట మంజూరైన నిధులు పప్పుబెల్లాల్లా ఆరగించారు. ఐదేళ్లపాటు రోడ్డు మరమ్మతుల కోసం 2013 జనవరిలో అప్పటి ప్రభుత్వం జిల్లాలోని రెండు రోడ్లకుగాను రూ.45.38 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను ఒంగోలు–నంద్యాల రోడ్డులో 100 కిలో మీటర్లు, దొనకొండ కనిగిరి రోడ్డులో 144 కిలో మీటర్లు మేర నిర్వహణ కోసం కేటాయించారు. అందుకుగాను ఔట్‌పుట్ అండ్ పెర్‌ఫార్మెన్స్ బేస్‌డ్ రోడ్డు కాంట్రాక్ట్ (ఓపీఆర్‌సీ)గ్రాంట్ కింద జిల్లాలో ప్యాకేజ్–38లో భాగంగా రోడ్డు నిర్వహణకు విడుదల చేశారు. ఒంగోలుకు చెందిన కాంట్రాక్ట్ సంస్థలు మెసర్స్ ఎస్‌ఎస్‌ఎన్‌సి–భవానీ జాయింట్ వెంచర్‌గా పనులు చేపట్టేందుకు రోడ్లు, భవనాల శాఖ(ఆర్ అండ్ బీ)తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ రోడ్డు పనుల నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించేందుకు కనిగిరి ఆర్ అండ్ బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ)కు అప్పగించారు. అయితే ఐదేళ్లు పూర్తయిపోతోంది. ఎక్కడ గుంతలు అక్కడే వదిలేసి మిగిలిన నిధులను పూర్తిగా తీసుకునేందుకు అటు అధికారులు, ఇటు కాంట్రాక్టర్లు రంగం సిద్ధం చేసుకున్నారు.
ఐదు రకాల నిర్వహణ కోసం నిధులు...
రెండు రోడ్లలో వాహనాల రాకపోకల సమయంలో దెబ్బతిన్న చోట, రోడ్డు మార్జిన్లు, వర్షాలకు, వరదలకు గుంతలు పడ్డ ప్రాంతాల్లో మరమ్మతులు చేయటానికి ఐదు రకాల పనుల చేపట్టటానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. అందులో భాగంగా సాధారణ రోడ్డు నిర్వహణ కోసం రూ.8.54 కోట్లు కేటాయించారు. అదేవిధగా రోడ్లపై బాగా గుంతలు పడి రాకపోకలకు ఇబ్బందిగా ఉంటే అలాంటి ప్రాంతాల్లో రోడ్డును పునరుద్ధరించటాని రూ.3.09 కోట్లు కేటాయించారు. కాలానుగుణంగా వర్షాలు ఎక్కువగా పడి గుంతలు ఏర్పడిన సమయాల్లో వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా మరమ్మతులు చేపట్టడానికి రూ.23.95 కోట్లు, చిన్న, చిన్న మరమ్మతులకు రూ.6.81 కోట్లు, అత్యవసర పరిస్థితుల్లో విపత్కర పరిస్థితులు ఎదురై రోడ్లు దెబ్బతిన్నప్పుడు వాడేందు రూ.3 కోట్లు కేటాయించారు. ఈ రెండు రోడ్లకు కేటాయించిన నిధుల్లో ఏ హెడ్‌లోనూ సగానికి పైగా నిధులు ఖర్చు చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వాడాల్సిన నిధులు అసలు ఖర్చే చేయలేదన్న వాదన వినపడుతోంది.
ఒంగోలు–చీమకుర్తిలోపే ఎన్నో గుంతలు...
రోడ్డు నిర్వహణ కోసం కోట్లాది రూపాయలు ట్రెజరీలో మూలుగుతున్నాయి. ఒంగోలు–చీమకుర్తి మధ్యలో రోడ్డు ఎన్నో గుంతలు పడి వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. అయినా అధికారులకు మాత్రం చీమకుట్టినట్టయినా లేదు. ఒంగోలు నగరంలోని ఫ్‌లై ఓవర్ నుంచి వరుసగా ఎప్పుడూ గుంతలతోనే వాహనదారులు అవస్థలు పడుతున్నారు. భారీ వాహనాలు తిరిగే ఒంగోలు–చీమకుర్తి రోడ్డులో మార్జిన్లు గుంతలతో ఇప్పటికీ అవస్థలు పడుతూనే ఉన్నారు. రోడ్డు నిర్వహణ పేరుతో దోచుకోవటమే పనిగా అధికారులు, కాంట్రాక్టర్లు పెట్టుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment