సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
ఒంగోలు టౌన్: ‘జిల్లాలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయి. పనుల్లో అక్కడక్కడ యంత్రాలను వాడుతున్నారు’ అని డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ పోలప్ప అంగీకరించారు. స్థానిక టీటీడీసీ సమావేశ మందిరంలో మంగళవారం డిస్ట్రిక్ట్ డవలప్‌మెంట్ కో ఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ(దిశ) సమావేశం నిర్వహించారు. ఆ కమిటీ చైర్మన్, ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో శాఖల వారీగా సమీక్షలు నిర్వహించే సమయంలో ఉపాధి హామీ పనుల్లో అక్రమాలను సభ్యులు ఎండగట్టారు. ముందుగా వైవీ సుబ్బారెడ్డి జిల్లాలో ఉపాధి పనులకు ఎంత నిధులొచ్చాయి.. ఎంత ఖర్చు చేశారని పీడీని ప్రశ్నించారు. పీడీ స్పందిస్తూ.. ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద జిల్లాకు రూ.760 కోట్లు కేటాయిస్తే, ఇప్పటివరకు రూ.468 కోట్లతో వివిధ రకాల పనులు చేపట్టినట్లు వివరించారు. ఎంపీ వైవీ జోక్యం చేసుకుంటూ త్రిపురాంతకం, పెద్దారవీడు, తర్లుపాడు మండలాల్లో ఉపాధి పనుల్లో అవకతవకలు జరగలేదా..? అని ప్రశ్నించారు. కూలీలతో చేయించాల్సిన పనులను యంత్రాలతో చేయించారా.. లేదా..? అని ప్రశ్నించారు. ఇందుకు పీడీ కొద్దిసేపు నీళ్లు నమిలి అక్కడక్కడ అవకతవకలు జరిగినట్లు ఒప్పుకున్నారు. పనుల్లో జరిగిన అక్రమాలు సోషల్ ఆడిట్‌లో వెలుగులోకి రావడంతో సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అక్రమాలు జరిగినట్లు తన దృష్టికి వచ్చిన వెంటనే ఎంపీడీఓ, ఏపీఓలతో విచారణ జరిపిస్తున్నట్లు పీడీ చెప్పారు.
ఎందుకయ్యా.. ఈ సమావేశాలు..?
నాలుగు నెలల క్రితం జరిగిన దిశ సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలపై శాఖలకు సంబంధించిన నివేదికలు లేకపోవడంపై వైవీ సుబ్బారెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకయ్యా ఈ మీటింగ్‌లు, నివేదికలు లేకుండా ఎందుకొస్తారు. మీకు, నాకు టైమ్ వేస్ట్. అసలు మీటింగ్‌లు పెట్టాలా.. వద్దా..? అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో కిడ్నీ వ్యాధితో ఇప్పటివరకు ఎంతమంది మరణించారన్న వివరాలను అడిగితే డీఎంహెచ్‌ఓ నుంచి సమాధానం రాకపోవడంపై ఎంపీ అసహనం వ్యక్తం చేశారు. కొనకనమిట్ల మండలం చినారికట్ల గ్రామం నుంచి కనిగిరికి నీటిని అందించేందుకు ఇళ్ల ముందుగా పైపులైన్ వేసినా ఆ గ్రామస్తులకు మాత్రం నీరు ఇవ్వకపోవడంపై వైవీ సుబ్బారెడ్డి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులపై మండిపడ్డారు. ఇటీవల తాను చినారికట్లకు వెళితే అక్కడి మహిళలు ఖాళీ బిందెలతో తన కాన్వాయ్‌ను ఆపారని, దీన్ని బట్టి అక్కడ నీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ విషయమై నెలరోజుల క్రితమే ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడినా ఇప్పటి వరకు సమస్య పరిష్కరించలేదన్నారు. చినారికట్ల, పెదారికట్ల గ్రామాల్లో పైపులైన్లు వేసి నీటి సమస్యను పరిష్కరించాలని, అందుకు అవసరమైతే నిధులు మంజూరు చేస్తానన్నారు.
ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనుల్లో రూ.కోట్లలో అవినీతి:
ఎమ్మెలే జంకె
జిల్లాలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనుల్లో కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని మార్కాపురం శాసనసభ్యుడు జంకె వెంకటరెడ్డి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. మండలాల్లో జరిగే అక్రమాలపై సంబం«ధిత ఎంపీడీఓ, ఏపీఓలతో విచారణ చేయించడం వల్ల వాస్తవాలు బయటకు వచ్చే అవకాశాలు లేవన్నారు. తన నియోజకవర్గ పరిధిలోని భూపతిపల్లిలో పనులు మరీ ఘోరంగా చేశారన్నారు. తర్లుపాడు మండలం మీర్జాపేటలో 240 మంది కూలీలతో చేయించాల్సిన పనులను రాత్రికి రాత్రి జేసీబీతో చేయించిన విషయాన్ని ప్రస్తావించారు. అక్రమాలకు పాల్పడిన వారిని సస్పెండ్ చేసి తిరిగి అక్కడే పోస్టింగ్‌లు ఇస్తున్నారన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనుల్లో జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేస్తేనే వాస్తవాలు వెలుగులోనికి వస్తాయన్నారు. కొనకనమిట్ల ఎంపీపీ రామనారాయణరెడ్డి జోక్యం చేసుకుంటూ తన మండలంలో చేపట్టిన ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనుల్లో కోటి రూపాయల వరకు అవకతవకలు జరిగాయన్నారు. వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ జిల్లాలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు జరగకుండా ఉండేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని పీడీని ఆదేశించారు.
పదేళ్ల క్రితం కట్టిన వాటికి బిల్లులు..
వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల లక్ష్యాల పేరుతో పదేళ్ల క్రితం కట్టిన వాటిని తాజాగా చూపించి బిల్లులు ఇచ్చారని ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. మార్కాపురం మండలంలోని వేములకోట గ్రామంలో 47 మందికి పదేళ్ల క్రితం కట్టిన మరుగుదొడ్లకు బిల్లులు చెల్లించారన్నారు. ఐదేళ్ల క్రితం కట్టిన వాటికి కూడా బిల్లులు చెల్లించారని, వీటిపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. ఎంపీడీఓ తప్పుచేస్తే ఆ ఎంపీడీఓతోనే విచారణ చేయిస్తే తప్పు బయటపడుతుందా..? అని ప్రశ్నించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల్లో జరుగుతున్న అక్రమాలపై ఆర్‌డబ్ల్యూఎస్, డ్వామా అధికారులపై విచారణ జరిపించాలన్నారు. కొనకనమిట్ల ఎంపీపీ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో సర్పంచ్, మండలస్థాయిలో ఎంపీపీ కన్వీనర్‌గా ఉండే జన్మభూమి కమిటీల్లో ప్రతిపక్ష పార్టీలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. కొనకనమిట్ల ఎంపీడీఓ అక్రమాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీపీల సంతకాలు లేకుండా పింఛన్లు ఇస్తున్నారని, ఈ విషయమై హైకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయడం లేదన్నారు. వైఎస్సార్ సీపీ ప్రాతినిధ్యం కలిగిన పంచాయతీల్లో హౌసింగ్ స్కీమ్ అమలు చేయడం లేదన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, డీఆర్‌డీఏ పీడీ ఎంఎçస్ మురళి, సీపీఓ కేటీ వెంకయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment