nregs works
-
14 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా..
సాక్షి, విజయవాడ: ఉపాధి హామీ పనుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్‌వన్‌గా నిలిచిందని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 14 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా పని కల్పించామని, కరోనా కష్టకాలంలో అత్యధికంగా ఉపాధి కల్పించగలిగామని ఆయన వెల్లడించారు. (కాంట్రాక్ట్ ఉద్యోగులపై సీఎం జగన్ సమీక్ష) ‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టార్గెట్ మేరకు 57 లక్షల మంది కూలీలకు పని కల్పించాం. జూన్ ఒక్క నెలలోనే అత్యధికంగా 8 కోట్ల పని దినాలు కల్పించాం. కరోనా కాలంలో పని కల్పించి రూ.4 వేల కోట్ల వేతనాలు చెల్లించామని’’ ఆయన పేర్కొన్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, నాడు - నేడు పాఠశాలల పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆస్తుల నిర్మాణంలోనూ దేశంలోనే ఏపీని నంబర్‌వన్ స్థానంలో నిలిపామని, పారదర్శకంగా వేతనాల చెల్లింపుల్లోనూ అందరికంటే ముందజలో ఉన్నామని గిరిజా శంకర్ వెల్లడించారు. (‘గిరిజనులకు మెరుగైన వైద్యమే లక్ష్యం’) -
అక్రమార్కుల భరతం పడతాం
సాక్షి, కొడవలూరు: ఇరిగేషన్, ఉపాధిహామీ పనుల్లో గడిచిన ఐదేళ్లలో చోటు చేసుకున్న అవినీతిపై విచారణ జరిపిస్తామని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో నీరు–చెట్టు పథకంలో భారీగా అవినీతి జరిగిందన్నారు. ఈ విషయాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకుపోవడం జరిగిందని తెలిపారు. విచారణలో అవినీతిని నిగ్గుతేల్చి అక్రమార్కుల భరతం పడతామన్నారు. నీరు–చెట్టులోని అవినీతి కారణంగా రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. ఎంతో మంది అధికారులు బలయ్యారని తెలిపారు. ఉపాధి పనుల్లోనూ భారీగా అవకతవకలు జరిగాయని, వీటిపై తహసీల్దార్, ఎంపీడీఓలతో విచారణ జరిపిస్తామన్నారు. గతంలో జరిగిన అవినీతికి, ఏకపక్ష నిర్ణయాలకు విసిగిపోయిన ప్రజలు తనను 40వేల మెజార్టీతో గెలిపించారన్నారు. గత ప్రభుత్వం మహిళా తహసీల్దార్‌పై ప్రజాప్రతినిధి దాడికి పాల్పడిన చర్యలు తీసుకోకుండా నిరంకుశంగా వ్యవహరించిందన్నారు. ప్రభుత్వ వైద్యులు మండల కేంద్రాల్లోనే నివాసం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో వైద్యులు మానవతతో వ్యవహరించాలన్నారు. ఊటుకూరులో బోరు బావిలో పడిన బాలికను కొనఊపిరితో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొస్తే వైద్యులు అందుబాటులో లేరన్నారు. అనంతరం కోవూరు వైద్యశాలకు తీసుపోయినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వైద్యులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. అమ్మఒడి పథకాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇప్పటికీ గిరిజనులు బడులకు పోవడం లేదని తెలిపారు. ఎంఈఓ, ఐసీడీఎస్, పంచాయతీ కార్యదర్శులు సమైక్యంగా కృషి చేసి అమ్మఒడిని ప్రజల్లోకి తీసుకుపోయి ప్రతీబిడ్డా చదివేలా చేయాలన్నారు. గృహనిర్మాణ శాఖలో లబ్ధిదారులను ముప్పతిప్పలు పెట్టారన్నారు. అందువల్లే గృహాలన్నీ వివిధ దశల్లో నిలిచిపోయి ఉన్నాయన్నారు. సమావేశం ప్రారంభమైనా ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అందుబాటులోకి రాకపోవడంపై ఆయన స్పందిస్తూ పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు. ఎంపీపీ నల్లావుల వెంకమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తహసీల్దార్ ఎన్వీ ప్రసాద్, ఎంపీడీఓ డీవీ నరసింహారావు, వైస్‌ఎంపీపీ కొండా శ్రీనివాసులురెడ్డి, ఎంఈఓ వసంతకుమారి, వైద్యాధికారులు రామకృష్ణ, సుచిత్ర, ఎస్సై శ్రీనివాసులురెడ్డి, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
రూ.వంద కోట్లతో ఉపాధి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు వచ్చే ఏడాది విస్తృతంగా చేపట్టేందుకు యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేసింది. సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేసి కూలీలకు మరింత ఉపాధి కల్పించడంతోపాటు గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని నిర్ణయించింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) 2018–19 సంవత్సరానికి ప్రణాళిక రూపొందించింది. ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త పనులు చేపట్టేందుకు ఇప్పటి నుంచే అధికారులు కసరత్తు చేస్తున్నారు. పని కావాలని కోరిన ప్రతి కుటుంబానికి ఏడాదిలో గరిష్టంగా వంద రోజులపాటు ఉపాధి కల్పించాలన్నది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ముఖ్య ఉద్దేశం. వచ్చే ఏడాది రూ.100 ఖర్చు చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకోగా.. ఇందులో సుమారు రూ.70 కోట్లను కూలి కిందనే చెల్లించనుండడం విశేషం. జిల్లాలో 415 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో 356 పంచాయతీల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయి. వీటి పరిధిలో జాబ్ కార్డులు పొందిన 1.36 లక్షల కుటుంబాలు ఉపాధి పనులకు ఏ డాది పొడవునా హాజరవుతున్నట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నా యి. ఇందులో కనీసం లక్ష కుటుంబాలకు వంద రోజుల పని కల్పించా లని డీఆర్డీఏ లక్ష్యం పెట్టుకుంది. మరో రూ.30 కోట్లను మెటీరియల్ కోసం వెచ్చించనున్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, శ్మశాన వాటికలు, ప్ర భుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, కిచెన్ షెడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. నీటి సంరక్షణకు పెద్దపీట వర్షపు నీటి సంరక్షణకు పెద్దపీట వేయనున్నారు. వాన నీటిని ఎక్కడికక్కడ నిల్వచేసి ప్రతి బొట్టుని భూమిలోకి ఇంకించేందుకు విస్తృతంగా నిర్మాణాలు చేపట్టాలని యోచిస్తున్నారు. జిల్లాలో 90 శాతం పంటల సాగుకు భూగర్భ జలాలే ప్రధాన వనరు. వాన నీటి నిల్వ, సంరక్షణ కోసం విస్తృతంగా ఊట కుంటలు, చెక్‌డ్యాంలు, ఇంకుడు గుంతలు నిర్మించాలని నిర్ణయించారు. అలాగే వ్యవసాయానికి అనుబంధంగా రైతులకు ఉపయోగపడేలా బావుల పూడికతీత, నీటి పారుదల కాల్వల నిర్వాణం, ఫీడర్ చానెళ్ల ఏర్పాటు తదితర పనులకూ ప్రాధాన్యం ఇస్తామని అధికార వర్గాలు వెల్లడించాయి. ‘వచ్చే ఏడాది మరింత ఉత్సాహంతో పనులు చేపట్టనున్నాం. ప్రతి కుటుంబానికి వంద రోజుల పని కల్పించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని డీఆర్డీఓ ప్రశాంత్ కుమార్ తెలిపారు. అలాగే స్వచ్ఛభారత్‌లో భాగంగా పెద్ద ఎత్తున వ్యక్తిగత మరుగుదొడ్లను త్వరితగతిన నిర్మిస్తామని చెప్పారు. ఈ ఏడాది రూ.80 కోట్లు ఖర్చు ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనుంది. దాదాపు 10 నెలల కాలంలో ఉపాధి హామీ పథకం కింద రూ.80 కోట్లు ఖర్చు చేశారు. 7,200 కుటుంబాలకు వంద రోజుల పని కల్పించారు. హాజరైన కూలీల కు సుమారు రూ.57 కోట్లు కూలి రూపంలో చెల్లించారు. మరో రూ.24 కోట్లను మెటీరియల్ పనులకు ఖర్చు చేశారు. మార్చి 31లోగా మరో రూ.10 కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. -
అవకతవకలు నిజమే.!
ఒంగోలు టౌన్: ‘జిల్లాలో ఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయి. పనుల్లో అక్కడక్కడ యంత్రాలను వాడుతున్నారు’ అని డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ పోలప్ప అంగీకరించారు. స్థానిక టీటీడీసీ సమావేశ మందిరంలో మంగళవారం డిస్ట్రిక్ట్ డవలప్మెంట్ కో ఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ(దిశ) సమావేశం నిర్వహించారు. ఆ కమిటీ చైర్మన్, ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో శాఖల వారీగా సమీక్షలు నిర్వహించే సమయంలో ఉపాధి హామీ పనుల్లో అక్రమాలను సభ్యులు ఎండగట్టారు. ముందుగా వైవీ సుబ్బారెడ్డి జిల్లాలో ఉపాధి పనులకు ఎంత నిధులొచ్చాయి.. ఎంత ఖర్చు చేశారని పీడీని ప్రశ్నించారు. పీడీ స్పందిస్తూ.. ఎన్ఆర్ఈజీఎస్ కింద జిల్లాకు రూ.760 కోట్లు కేటాయిస్తే, ఇప్పటివరకు రూ.468 కోట్లతో వివిధ రకాల పనులు చేపట్టినట్లు వివరించారు. ఎంపీ వైవీ జోక్యం చేసుకుంటూ త్రిపురాంతకం, పెద్దారవీడు, తర్లుపాడు మండలాల్లో ఉపాధి పనుల్లో అవకతవకలు జరగలేదా..? అని ప్రశ్నించారు. కూలీలతో చేయించాల్సిన పనులను యంత్రాలతో చేయించారా.. లేదా..? అని ప్రశ్నించారు. ఇందుకు పీడీ కొద్దిసేపు నీళ్లు నమిలి అక్కడక్కడ అవకతవకలు జరిగినట్లు ఒప్పుకున్నారు. పనుల్లో జరిగిన అక్రమాలు సోషల్ ఆడిట్లో వెలుగులోకి రావడంతో సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అక్రమాలు జరిగినట్లు తన దృష్టికి వచ్చిన వెంటనే ఎంపీడీఓ, ఏపీఓలతో విచారణ జరిపిస్తున్నట్లు పీడీ చెప్పారు. ఎందుకయ్యా.. ఈ సమావేశాలు..? నాలుగు నెలల క్రితం జరిగిన దిశ సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలపై శాఖలకు సంబంధించిన నివేదికలు లేకపోవడంపై వైవీ సుబ్బారెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకయ్యా ఈ మీటింగ్‌లు, నివేదికలు లేకుండా ఎందుకొస్తారు. మీకు, నాకు టైమ్ వేస్ట్. అసలు మీటింగ్‌లు పెట్టాలా.. వద్దా..? అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో కిడ్నీ వ్యాధితో ఇప్పటివరకు ఎంతమంది మరణించారన్న వివరాలను అడిగితే డీఎంహెచ్ఓ నుంచి సమాధానం రాకపోవడంపై ఎంపీ అసహనం వ్యక్తం చేశారు. కొనకనమిట్ల మండలం చినారికట్ల గ్రామం నుంచి కనిగిరికి నీటిని అందించేందుకు ఇళ్ల ముందుగా పైపులైన్ వేసినా ఆ గ్రామస్తులకు మాత్రం నీరు ఇవ్వకపోవడంపై వైవీ సుబ్బారెడ్డి ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై మండిపడ్డారు. ఇటీవల తాను చినారికట్లకు వెళితే అక్కడి మహిళలు ఖాళీ బిందెలతో తన కాన్వాయ్‌ను ఆపారని, దీన్ని బట్టి అక్కడ నీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ విషయమై నెలరోజుల క్రితమే ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడినా ఇప్పటి వరకు సమస్య పరిష్కరించలేదన్నారు. చినారికట్ల, పెదారికట్ల గ్రామాల్లో పైపులైన్లు వేసి నీటి సమస్యను పరిష్కరించాలని, అందుకు అవసరమైతే నిధులు మంజూరు చేస్తానన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో రూ.కోట్లలో అవినీతి: ఎమ్మెలే జంకె జిల్లాలో ఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని మార్కాపురం శాసనసభ్యుడు జంకె వెంకటరెడ్డి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. మండలాల్లో జరిగే అక్రమాలపై సంబం«ధిత ఎంపీడీఓ, ఏపీఓలతో విచారణ చేయించడం వల్ల వాస్తవాలు బయటకు వచ్చే అవకాశాలు లేవన్నారు. తన నియోజకవర్గ పరిధిలోని భూపతిపల్లిలో పనులు మరీ ఘోరంగా చేశారన్నారు. తర్లుపాడు మండలం మీర్జాపేటలో 240 మంది కూలీలతో చేయించాల్సిన పనులను రాత్రికి రాత్రి జేసీబీతో చేయించిన విషయాన్ని ప్రస్తావించారు. అక్రమాలకు పాల్పడిన వారిని సస్పెండ్ చేసి తిరిగి అక్కడే పోస్టింగ్‌లు ఇస్తున్నారన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేస్తేనే వాస్తవాలు వెలుగులోనికి వస్తాయన్నారు. కొనకనమిట్ల ఎంపీపీ రామనారాయణరెడ్డి జోక్యం చేసుకుంటూ తన మండలంలో చేపట్టిన ఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో కోటి రూపాయల వరకు అవకతవకలు జరిగాయన్నారు. వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ జిల్లాలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు జరగకుండా ఉండేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని పీడీని ఆదేశించారు. పదేళ్ల క్రితం కట్టిన వాటికి బిల్లులు.. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల లక్ష్యాల పేరుతో పదేళ్ల క్రితం కట్టిన వాటిని తాజాగా చూపించి బిల్లులు ఇచ్చారని ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. మార్కాపురం మండలంలోని వేములకోట గ్రామంలో 47 మందికి పదేళ్ల క్రితం కట్టిన మరుగుదొడ్లకు బిల్లులు చెల్లించారన్నారు. ఐదేళ్ల క్రితం కట్టిన వాటికి కూడా బిల్లులు చెల్లించారని, వీటిపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. ఎంపీడీఓ తప్పుచేస్తే ఆ ఎంపీడీఓతోనే విచారణ చేయిస్తే తప్పు బయటపడుతుందా..? అని ప్రశ్నించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల్లో జరుగుతున్న అక్రమాలపై ఆర్డబ్ల్యూఎస్, డ్వామా అధికారులపై విచారణ జరిపించాలన్నారు. కొనకనమిట్ల ఎంపీపీ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో సర్పంచ్, మండలస్థాయిలో ఎంపీపీ కన్వీనర్‌గా ఉండే జన్మభూమి కమిటీల్లో ప్రతిపక్ష పార్టీలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. కొనకనమిట్ల ఎంపీడీఓ అక్రమాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీపీల సంతకాలు లేకుండా పింఛన్లు ఇస్తున్నారని, ఈ విషయమై హైకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయడం లేదన్నారు. వైఎస్సార్ సీపీ ప్రాతినిధ్యం కలిగిన పంచాయతీల్లో హౌసింగ్ స్కీమ్ అమలు చేయడం లేదన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, డీఆర్డీఏ పీడీ ఎంఎçస్ మురళి, సీపీఓ కేటీ వెంకయ్య పాల్గొన్నారు. -
ఉపాధి పనులు పరిశీలన
కంబదూరు: మండలంలో ఉపాధి హామీ పథకం కింద 2016, 17, 18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.16 కోట్లతో చేపట్టిన ఫారంపాండ్లు,హార్టికల్చర్,మట్టి రోడ్లు, అవెన్యూ ప్లాంటేషన్,వ్యక్తిగత మరుగుదొడ్లు,వర్మీకంపోస్టు, చెరువులో పూడికతీత తదితర పనులను మంగళవారం స్టేట్ బృందం సభ్యులు పరిశీలించారు. మండలంలోని ములకనూరు వద్ద చేపట్టిన పనులను స్టేట్ బృందం సభ్యులు రాంప్రసాద్, గోవర్ధన్, సాయికిశోర్, భాగ్యరాజ్, అనూష, మూర్తి, శ్రీనివాసులు కొలతలు తీసి పరిశీలించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధిహామీకి సంబంధించిన 20 రికార్డులను తనిఖీ చేశారు. త్వరలో కేంద్ర బృందం కమిటీ సభ్యులు వచ్చే అవకాశం ఉందన్నారు. వీరి వెంట అడిషనల్ పీడీ రాజేంద్ర ప్రసాద్, ఏపీడీ విజయలక్ష్మి, ఎంపీడీఓ శివారెడ్డి, ఏపీఓ హనుమంతరాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి పనుల్లో బయటపడిన పంచలోహ విగ్రహం
అమడగూరు (పుట్టపర్తి) : అమడగూరు మండలం పూలకుంటపల్లికి చెందిన కూలీలు గురువారం ఉపాధి హామీ పథకం పనులు చేస్తుండగా పంచ లోహాలతో తయారు చేసిన సుమారు ఐదు కిలోల బరువుండే ఆజనేయ స్వామి విగ్రహం బయటపడింది. కూలీలు వెంటనే విగ్రహాన్ని గ్రామానికి తీసుకొచ్చి, నడిబొడ్డున ఉన్న పీర్ల చావిడిలో ఉంచి పూజలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు.